Hanmanta Rao
-
ఎంపీగా పోటీ చేసి తీరుతాను: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరుతానని పీసీసీ మాజీ చీఫ్, సీనియర్‌నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సోమవారం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ‘ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను. ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు. పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?. ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా?. నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఎంటి?. ...గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ప్రధాని మోదీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదు. ఏం ఉద్దరించారని సంకల్ప యాత్ర చేస్తున్నారు. రాముడ్ని మేమే పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నేతలు భాష మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్ వెళ్ళాలి. రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు. గుడులు మీ అయ్య జాగీర్లా?’అని వీహెచ్ మండిపడ్డారు. -
‘కేకులు కోసినట్లు పీకలు కోస్తారా?’
సాక్షి, మంథని: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటడం.. కేకులు కట్ చేయడంతోపాటు హైకోర్టు న్యాయవాద దంపతులుగట్టు వామన్‌రావు–నాగమణి దంపతుల గొంతు కూడా కోశారని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. న్యాయవాద దంపతుల స్వగ్రామం మంథని మండలం గుంజపడుగులో మృతులకు టుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి శుక్రవారం పరామర్శించారు. అనంతరం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఇంత పెద్ద సంఘటన జరిగినా మంత్రులు, నాయకులు స్పందించకపోవడమే కాకుండా, తమకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన, మంథని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్న న్యాయవాద దంపతులను హత్య చేయడం పాశవిక చర్య అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు జరిగిన ఈ దారుణం గురించి ఇకపై ప్రతీ పుట్టినరోజు మాట్లాడుకుంటారని తెలిపారు. న్యాయవాదుల కుటుంబ సభ్యులు కోరుతున్నట్లుగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పేరు నిందితుల జాబితాలో ఎందుకు చేర్చడంలేదని ప్రశ్నించారు. హనమంత రావుతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, మండల అధ్యక్షుడు సెగ్గెంరాజేశ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్ కాచే, డీసీసీ అధికార ప్రతినిధి ఇనుముల సతీశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్, నాయకులు మంథని సత్యం, ఆజీంఖాన్ ఉన్నారు. హత్య స్థలాన్ని పరిశీలించిన వీహెచ్.. రామగిరి(మంథని): రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపైన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకటనాగమణిని హత్యచేసిన స్థలాన్ని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు శుక్రవారం పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: న్యాయవాదుల హత్య: ఆడియో క్లిప్పింగ్ వైరల్ -
పీసీసీ అధ్యక్ష పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల బలిదానాలు వల్ల వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయుకుడు వీ హనుమంతరావు అన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల బలిదానాల మీద కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని వీహెచ్ విమర్శించారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది మీద కేంద్రం సవతి ప్రేమ చూపుతుందంటున్న కేటీఆర్.. మరీ తెలంగాణలోని విద్యార్థుల కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క విద్యార్థికైనా ఉద్యోగం కల్పించారా అని వీహెచ్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేటీఆర్ ఏవిధంగా నిందిస్తున్నారో.. తెలంగాణలోని విద్యార్థులు కూడా టీఆర్ఎస్ను అలాగే నిందిస్తున్నారని వీహెచ్ విమర్శించారు. తెలంగాణలో విద్యార్థులకు కనీసం ఉపకార వేతనము కూడా ఇవ్వటం లేదని వీహెచ్ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు వారి డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు. 30 మంది కార్మికులు చనిపోయాక సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ మీద ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి తప్పకుండా తనకే ఇవ్వాలని.. తన కంటే సీనియర్ నాయకుడు రాష్ట్రంలో ఎవరు లేరని అన్నారు. ప్రజల్లోకి వెళ్లే సత్తా తనకు మాత్రమే ఉందని వీహెచ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తప్పకుండా తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తుందనే వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. -
సాగు ప్రాజెక్టులకన్నా వాటర్‌షెడ్లే మిన్న
- మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసంలో మాజీ ఈఎన్సీ హన్మంతరావు - తక్కువ ఖర్చుతో అధిక లాభాలు - నాలుగు నీటి సూత్రాలతో ఏటా మూడు పంటల సాగు సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులంటూ ప్రభుత్వాలు రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, వాటికి బదులుగా వాటర్షెడ్ల కార్యక్రమాన్ని విస్తృతపరిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తాయని నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్సీ టి. హన్మంతరావు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వాలు ఆర్భాటాలు చేస్తూ వాటర్‌షెడ్ పథకాలపై శీతకన్ను ప్రదర్శిస్తున్నాయని, దీంతో రైతులకు సత్వర ఫలాలు అందడం లేదని హన్మంతరావు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో తాను రూపొందించిన 4 సూత్రాల ప్రణాళిక ప్రకా రం వాటర్షెడ్లు ఏర్పాటు చేసుకుంటే రైతులు ఏడాదిలో మూడు పంటలు పండించుకోవచ్చని, రెండు వరుస పంటలతోపాటు మరో మెట్ట పంటను సాగు చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లా గొట్టిగారి పల్లి ఇందుకు నిదర్శనమన్నారు. రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతాల్లోనూ ఇది విజయవంతమైందన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఏడాదిలో కేవలం ఒక పంటకే నీరు అందుతుందని, కానీ వాటర్షెడ్లతో ఏడాది కాలంలో నీరు పుష్కలంగా లభిస్తుందని వివరించారు. ఇందుకు ఎకరాకు రూ. 5 వేలు మాత్రమే ఖర్చు వస్తుందని, 550 మిల్లీమీటర్ల వర్షపాతమున్న అన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతి విజయం సాధిస్తుందన్నారు. నాలుగు సూత్రాల వాటర్‌షెడ్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్టు కృషి చేస్తుందని ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తక పండుగ వచ్చేస్తోంది..
=7 నుంచి బుక్ ఫెస్టివల్ =ప్రవేశం ఉచితం =ప్రతీ పుస్తకంపై రాయితీ పంజగుట్ట,న్యూస్‌లైన్: ఒకటికాదు..రెండుకాదు. వేలాది పుస్తకాలు ఒకేచోట.. చిన్నారులు, పెద్దలు, యువతకు కావాల్సిన అన్నిరకాల పుస్తకాలు కొలువుదీరనున్నాయి. అంతేకాదు ఒక్కో పుస్తకానికి 10 నుంచి 50 శాతం వరకు రాయితీ కూడా ఇస్తున్నారు. ప్రతియేటా నగరంలో నిర్వహించే పుస్తకమేళా డిసెంబర్ 7 నుంచి 15 తేదీ వరకు జరగనుంది. దీనికి సంబంధించిన విషయాలను హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు హన్మంతరావు, పుస్తక మేళా ఆఫీసర్ ఇన్ఛార్జ్ డా.పత్తిపాక మోహన్లతో కలిసి నేషనల్ బుక్ ట్రస్ట్ డెరైక్టర్ సికందర్ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈసారి మేళా పీపుల్స్‌ప్లాజాలో కాకుండా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 8గంటల వరకు జరిగే ఈ పుస్తక ప్రదర్శనలో మొదటిసారిగా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, మేళాలో విక్రయించే ప్రతీ పుస్తకంపై పదిశాతం రాయితీ ఉంటుందని, ఆంగ్లభాష కాకుండా అన్ని భారతీయ భాషల్లో పుస్తకాలు అమ్మే స్టాళ్లకు యాభైశాతం ప్రత్యేకరాయితీ ఉంటుందన్నారు. మొత్తం 300కు పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని,ప్రదర్శనలో పాల్గొనే ప్రచురణకర్తలు, విక్రేతలు మేళావేదికపై సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు జరపదల్చుకునే వారు 09811239219, లేదా www.nbtindia.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన కోరారు.