సాక్షి, మంథని: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు టీఆర్‌ఎస్ నాయకులు మొక్కలు నాటడం.. కేకులు కట్ చేయడంతోపాటు హైకోర్టు న్యాయవాద దంపతులుగట్టు వామన్‌రావు–నాగమణి దంపతుల గొంతు కూడా కోశారని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. న్యాయవాద దంపతుల స్వగ్రామం మంథని మండలం గుంజపడుగులో మృతులకు టుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి శుక్రవారం పరామర్శించారు. అనంతరం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఇంత పెద్ద సంఘటన జరిగినా మంత్రులు, నాయకులు స్పందించకపోవడమే కాకుండా, తమకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రజల పక్షాన, మంథని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్న న్యాయవాద దంపతులను హత్య చేయడం పాశవిక చర్య అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు జరిగిన ఈ దారుణం గురించి ఇకపై ప్రతీ పుట్టినరోజు మాట్లాడుకుంటారని తెలిపారు. న్యాయవాదుల కుటుంబ సభ్యులు కోరుతున్నట్లుగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పేరు నిందితుల జాబితాలో ఎందుకు చేర్చడంలేదని ప్రశ్నించారు. హనమంత రావుతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, మండల అధ్యక్షుడు సెగ్గెంరాజేశ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్ కాచే, డీసీసీ అధికార ప్రతినిధి ఇనుముల సతీశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్, నాయకులు మంథని సత్యం, ఆజీంఖాన్ ఉన్నారు.
హత్య స్థలాన్ని పరిశీలించిన వీహెచ్..
రామగిరి(మంథని): రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపైన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకటనాగమణిని హత్యచేసిన స్థలాన్ని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు శుక్రవారం పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment