ఆయుధాలు పడవేసిన అనుమానిత ప్రదేశాన్ని చూపిస్తున్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి
సాక్షి, పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసు నిందితులు ఉపయోగించిన ఆయుధాల వెలికితీత ఆపరేషన్ ముగిసింది. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం పెద్దపల్లి జిల్లా సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీలో 2 రోజులు సుమారు 10 నుంచి 15 మీటర్ల లోతున్న నీటిలో శ్రమించి రెండు కత్తులను బయటకు తీశారు. ఆదివారం ఆయుధాలు లభ్యం కాకపోవడంతో సోమవారం మళ్లీ ఇద్దరు నిందితులను బ్యారేజీ వద్దకు తీసుకొచ్చారు. ఓ పక్క డైవర్స్ గాలింపు చేస్తుండగానే, పోలీసులు 3 కిలోల బరువున్న 5 అయస్కాంతాలను తెప్పించారు. స్థానికుల సాయంతో నీటిలో వెతికించారు. సాయంత్రం సమయంలో 53–54వ పిల్లర్ల మధ్యలో రెండు కత్తులను డైవర్లు కనుగొని.. బయటికి తెచ్చారు. ఆ కత్తులను నిందితులకు చూపించగా అవేనని అంగీకరించారు. పంచనామా నిర్వహించిన తర్వాత కత్తులను రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు.
జ్యుడీషియల్ కస్టడీకి బిట్టు శ్రీను
మంథని: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు బిట్టు శ్రీను జ్యుడీషియల్ కస్టడీకి పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు అనుమతి ఇచ్చింది. హత్య కేసులో శ్రీనును గత నెల 22న అరెస్టు చేసిన పోలీసులు 23న అర్ధరాత్రి దాటిన తర్వాత రిమాండ్‌కు తరలించారు. శ్రీనును తమ కస్టడీకి ఇవ్వాలని రామగిరి పోలీసులు శనివారం మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వాదనల అనంతరం ఏడు రోజుల కస్టడీకి మంథని జడ్జి అనుమతి ఇచ్చారు. ఇదే కేసులో ఏ1, ఏ2, ఏ3 నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్‌ల ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈ నెల 4తో ముగుస్తుంది.
చదవండి!
న్యాయవాదుల హత్య: పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment