కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన పెద్దపల్లి జిల్లాలో మధ్యప్రదేశ్ బాలిక కేసు మరో మలుపు తిరిగింది. ఆగస్టు 14వ తేదీ రాత్రి బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిందని, దాంతో అమ్మాయి అనారోగ్యం పాలై, మరణించిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బాలిక ఒంటిపై గాయాలున్న మాట వాస్తవమే గానీ, లైంగికదాడి జరిగినట్లుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్న విషయం సంచలనం రేపుతోంది.
ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రామగుండం పోలీసులు స్పందించారు. గోదావరిఖని, పెద్దపల్లి ఏసీపీలు, పెద్దపల్లి డీసీపీలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రెమా రాజేశ్వరి కేసును స్వయంగా పర్యవేక్షించారు. అసలు అనారోగ్యంతో ఉన్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు తరలించాల్సి వచ్చింది? వీరికి వాహనం ఎవరు సమకూర్చారు? తనపై కొందరు లైంగికదాడి జరిపారు.. అంటూ బాలిక చెబుతున్న ఆడియోలో వాస్తవమెంత? తదితర విషయాలపై దాదాపు 48 గంటల సుదీర్ఘ సాంకేతిక, శాసీ్త్రయ దర్యాప్తు తర్వాత రామగుండం పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలిసింది.
ఇంట్లో వారే కొట్టారా?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులోని అక్కాబావల వద్దకు మధ్యప్రదేశ్ నుంచి బాలిక వచ్చింది. ఆమె మరణానికి ముందు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. ఇవి ఎవ రు చేశారు? అన్నదానిపై స్పష్టత లేదు. బాలికను కుటుంబసభ్యులు లేదా తెలిసినవారే తీవ్రంగా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరోజు తనను తీవ్రంగా కొట్టడంపై బాలిక మనస్తాపానికి గురైంది.
అది తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకుందేమోనని అనుమానిస్తున్నారు. బాలిక చివరిసారిగా కనిపించిన పరిస్థితులు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆమె ఆగస్టు 14 మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇంట్లో లేదు. ఆ సమయంలో ఏం చేసింది? అన్నదాని పై పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో బాలిక పురుగుల మందు షాపుల ముందు, రాత్రి 8 గంటల ప్రాంతంలో సమీపంలోని ఓ చెరువు వద్ద కూడా కనిపించిందని సమాచారం.
అర్ధరాత్రి చెరువు వద్ద ఏం చేస్తున్నావని కొందరు మందలించడంతో అక్కడి నుంచి బస్టాండ్ వైపు వెళ్లినట్లు తెలిసింది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది కాబట్టే.. ఈ రెండు ప్రాంతాల్లో కనిపించిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి బస్టాండ్ వద్దకు బాలిక సంచరించిన ప్రాంతాల్లో మొత్తం 15 మంది ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రాత్రి 11 తర్వాత ఇంటికి చేరిన బాలిక.. అస్వస్థతకు గురైంది. వెంటనే బాలిక బంధువులు కారు మాట్లాడుకొని, ఆమెను హుటాహుటిన మధ్యప్రదేశ్‌లోని బాల్‌ఘాట్ జిల్లా కజ్రీ గ్రామానికి తరలించారు.
మార్గమధ్యలో వాంతులు చేసుకుంది. విషయం తెలుసుకున్న రామగుండం పోలీసులు అక్కడి ఎస్పీని సంప్రదించారు. తొలుత బాలిక మరణించిన విషయాన్ని ధ్రువీకరించుకున్నాక అంత్యక్రియలు జరపకుండా ఆపగలిగారు. అంత్యక్రియలు ఆపేది లేదంటూ ఆమె బంధువులు వాదనకు దిగారు. ఎంతో శ్రమిస్తే గానీ.. వారు దారికి రాలేదు. ఎట్టకేలకు బాలిక మృతదేహానికి అక్కడ స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, తిరిగి సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ ఆస్పత్రికి మరోసారి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
గాయపరిచింది ఎవరు?
బాలిక ఒంటిపై గాయాలున్నాయి తప్పితే, లైంగికదాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిసింది. మరి ఆమెను మరణించేంత స్థాయిలో గాయపరిచింది ఎవరు? అసలు ఆగస్టు 14 మధ్యాహ్నం ఏం జరిగింది? బాలిక ఎవరితో ఘర్షణ పడింది? ఆమైపై ఎవరు దాడి చేసి ఉంటారు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక లైంగికదాడి జరిగిందని ప్రచారం కావడం, అందులోనూ బాధితురాలు మైనర్ కావడంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించారు.
అన్ని బృందాల పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఇంతవరకూ దర్యాప్తు పురోగతిలో ఏ విషయాన్ని మీడియాతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే అమ్మాయి మాట్లాడిందని చెబుతున్న ఆడియో విడుదల చేసిన వారిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించినట్లు తెలిసింది. వారు చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని సమాచారం. గాంధీ ఆస్పత్రి నుంచి నివేదిక వస్తేగానీ.. పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేసేలా లేరు. ఆ నివేదికలో ఏం ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment