సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసు మరో మలుపు తిరిగింది. గుంజపడుగు రామాలయం విషయంలో తమకు రక్షణ కల్పించాలని న్యాయవాది నాగమణి డీసీపీ రవీందర్‌ను కోరిన ఆడియో కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుంజపడుగు గ్రామంలోని ఆలయం విషయంలో కుంట శ్రీనివాస్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తమకు రక్షణ కల్పించాలని నాగమణి డీసీపీని కోరారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, ఎస్సై తమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, మీరైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, డీసీపీ రవీందర్ ఆమెకు రక్షణ విషయం కల్పించే విషయాన్ని పదే పదే దాటవేస్తూ.. ప్రతీది పోలీసుల పరిధిలోకి రాదని, ఆలయానికి సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతీదానికి పోలీసులను మధ్యలోకి లాగొద్దని ఆమెకు సూచించడం గమనార్హం. అయితే రక్షణ కల్పించాలంటూ న్యాయవాద దంపతులు తమను ఎప్పుడూ సంప్రదించలేదని గురువారం పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత ఆడియో క్లిప్పింగ్ సంచలనం సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment