పైప్‌లైన్ భారం 1,100 కోట్లు
- కాళేశ్వరం ప్యాకేజీ–21లో కాల్వలకు బదులు మళ్లీ పైప్‌లైన్లే
- రూ. 2,243 కోట్లకు పెరగనున్న ప్యాకేజీ–21 అంచనా
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి వ్యయం పెరుగుతుందన్న భయంతో పక్కనపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–21లోని పైప్‌లైన్ వ్యవస్థ ప్రతిపాదనను ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. డిస్ట్రిబ్యూటరీలు, పంట కాల్వల స్థానంలో పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవలి ‘జల్ మంథన్’లో కేంద్ర జలవనరులశాఖ నిర్ణయించడంతో దానివైపే సర్కారు మొగ్గుతోంది. అయితే పైప్‌లైన్ వ్యవస్థ వల్ల సర్కారుపై రూ.1,100 కోట్ల అదనపు భారం పడనుంది.
మొదట పక్కన పెట్టి...
వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల్లో కాల్వల నిర్మాణానికి ఎకరాకు ఖర్చు రూ. 25 వేల వరకు ఉంటే, పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా ఖర్చు ఎకరాకు రూ. 23,500 ఉంటుంది. అలాగే కాల్వల ద్వారా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉండగా, పైప్‌లైన్ వ్యవస్థలో 20 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు. నీటి వృథా సైతం గణనీయంగా తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే పైలట్ ప్రాజెక్టు కింద కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో ఈ విధానాన్ని సర్కారు అమల్లోకి తేవాలనుకుంది. రూ. 1,143.78 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలో 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది.
ఇందులో లక్ష ఎకరాలకు నీరివ్వాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. ప్రస్తుతం ప్యాకేజీ–21 కింద నష్టపోతున్న భూమి ధర ఎకరాకు రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య పలుకుతోంది. ఈ లెక్కన భూసేకరణకే రూ. 320 కోట్లు అవసరం. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే భూసేకరణ అవసరం ఉండదు. ఈ ఏడాది మార్చిలో దీనిపై చర్చించిన కేబినెట్ పెట్టుబడి వ్యయం అధికంగా ఉంటుందన్న కారణంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టింది.
కేంద్రం నిర్ణయంతో మారిన ఆలోచన..
అయితే నీటి వృథాను అరికట్టడంతోపాటు పలు ప్రయోజనాలున్న పైప్‌లైన్ డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధాన కాలువ స్థానంలో పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం సాధ్యం కా>నందున డిస్ట్రిబ్యూటరీలు, పంట కాల్వల స్థానంలో దీన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పలు పథకాల కింద రాష్ట్రాల్లో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీంతో మళ్తీ పాత ప్రతిపాదనకు నీటిపారుదల శాఖ తెరపైకి తెచ్చింది. పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అదనంగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని తేల్చింది.
అయితే ఈ మేరకు ఆయకట్టు లేకపోవడంతో కొండం చెరువు, మంచిప్ప చెరువును కలిపి రిజర్వాయర్లుగా మార్చి అదనంగా లక్ష ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇందుకోసం డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ అంతా పైప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనికి మొత్తం రూ. 2,242.60 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. పాత అంచనా రూ. 1,143.78 కోట్లతో పోలిస్తే రూ.1,098.82 కోట్ల మేర అదనంగా ఉంటుందని లెక్కగట్టారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందేందుకు నీటిపారుదలశాఖ కసరత్తు చేపట్టింది.