కాంట్రాక్టర్లకు అ‘ధనం’ పండుగ | Shipments to additional payments | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లకు అ‘ధనం’ పండుగ

Published Fri, Oct 9 2015 6:45 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

కాంట్రాక్టర్లకు అ‘ధనం’ పండుగ

కాంట్రాక్టర్లకు అ‘ధనం’ పండుగ

25 ప్రాజెక్టుల్లోని 111 ప్యాకేజీలకు  అదనపు చెల్లింపులు.. జీవో జారీ
2013 ఏప్రిల్ 1 నుంచి  ఎస్కలేషన్ వర్తింపు
తాజా నిర్ణయంతో ఖజానాపై రూ.2,712 కోట్ల భారం
మూడు దశల్లో బకాయిల చెల్లింపు

 
హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి వీలుగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు(జీవో-146) జారీ చేసింది. స్టీలు, సిమెంట్, ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి ఇప్పటికే అవకాశం ఉంది. తాజాగా కార్మికుల వ్యయం, యంత్ర పరికరాల ధరలు, ఇసుక, కంకర వంటి ఇతర మెటీరియల్స్ ధరల పెరుగుదలకు అనుగుణంగా అదనపు చెల్లింపులు చేయడానికి ఈ జీవోతో అవకాశం కల్పించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, కంట్రోల్ బ్లాస్టింగ్, డీ వాటరింగ్ తదితర పనులకు అదనపు చెల్లింపులు వర్తించేలా అవకాశం కల్పించారు. ఈ చెల్లింపులన్నీ 2013, ఏప్రిల్ 1 నుంచి చేసిన పనులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ప్రాజెక్టులోని 111 ప్యాకేజీలకు ఎస్కలేషన్‌ను వర్తింపజేస్తే ప్రభుత్వంపై రూ.2,712 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్కలేషన్ పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 2న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే  వివాదం రేగడం, రాష్ర్ట విభజనతో అమల్లోకి రాలేదు. తర్వాత ఎస్కలేషన్‌పై ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎస్కలేషన్‌కు ఓకే చెప్పడంతో తాజాగా ఉత్తర్వులు వెలువరించింది.

జాప్యానికి ప్రభుత్వం కారణమైతేనే..
నిర్మాణ పనుల్లో జాప్యానికి ప్రభుత్వం కారణమైన పక్షంలో మాత్రమే అదనపు చెల్లింపులు పొందడానికి కాంట్రాక్టర్‌కు అవకాశం ఉంటుంది. భూసేకరణ, అటవీ అనుమతుల్లో ప్రభుత్వం జాప్యం చేసిందనే విషయాన్ని నిర్ధారిస్తూ ప్రాజెక్టు సీఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంటేనే అదనపు చెల్లింపుల ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటారు.

 ఇవీ మార్గదర్శకాలు..
డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణ ధరను సాగు విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.10,500 చొప్పున చెల్లించాలని ఉండగా, దాన్ని రూ.15,000కు పెంచుతూ గతంలో ఇచ్చిన మెమోను జీవోలో ప్రస్తావించారు. ఇసుక విధానంలో మార్పులు వచ్చిన కారణంగా పెరిగిన వ్యయం, రవాణా అదనపు ఖర్చులను పెరుగుదలలో చేర్చవచ్చు. ఏఎంఆర్‌పీ-ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టుల్లో విదేశీ యంత్రాలతో పాటు విదేశీ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన జీతభత్యాలు డాలర్‌తో రూపాయి మారకం విలువలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చెల్లింపులు చేయవచ్చు.

 భూసేకరణ, రీ ఇంజనీరింగ్, చట్టపరమైన అనుమతులు వంటి సహేతుక కారణాలతో కాంట్రాక్టర్ ఎవరైనా ప్యాకేజీల నుంచి తప్పుకోవాలని భావిస్తే అందుకు ప్రభుత్వం అంగీకరించాలి.అదనపు పనులు చేయాల్సిన అవసరం ఉంటే ఈపీసీ నిబంధనల మేరకు అదనపు నిర్మాణాలకు అనుమతివ్వాలి. అనుమతించిన పరిమితులకు మించి కంట్రోల్ బాస్టింగ్స్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. నిర్మాణ అవసరాల మేరకు కాలువల్లో నీటి నిలుపుదల విషయంలోనూ ఈ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు.

బ్యాంకు గ్యారంటీ కమీషన్లు, బీమా చార్జీలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీవోకు అనుబంధంగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు... రాష్ట్రస్థాయి కమిటీ, అంతర్గత ప్రమాణాల కమిటీ అన్ని పనులకు సంబంధించిన సిఫారసులను చేస్తుంది. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన పనులకు సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ అనుమతి తప్పనిసరి. మిగతా పనులకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అనుమతి ఇస్తుంది.కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను మూడు దశల్లో చెల్లిస్తారు. 40 శాతం బకాయిలు ముందుగా, పనుల పురోగతిని బట్టి మరో 40 శాతం, పనులు పూర్తయిన అనంతరం మరో 20 శాతం చెల్లిస్తారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement