
సమగ్ర నివేదికలు పంపితేనే ప్రాజెక్టులకు నిధులు
తెలంగాణ ప్రభుత్వ సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందాలంటే ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను(డీపీఆర్) కేంద్రానికి పంపాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందాలంటే ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను(డీపీఆర్) కేంద్రానికి పంపాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, మిషన్ భగీరథకు కేంద్రం నుంచి నిధులు విడుదలవ్వా లంటే డీపీఆర్‌లు సమర్పించా లన్నారు. ఈ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం సంతోషకరమని అన్నారు. మిషన్ భగీరథకు రూ. 25 వేల కోట్లు ఇవ్వా ల్సిందిగా నీతి ఆయోగ్ కేంద్రానికి ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఇదే విషయమై ఆర్థిక శాఖ వద్ద ప్రస్తావించగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికలు అందాకే నిధులు విడుదల చేస్తామని ఆయా వర్గాలు పేర్కొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు పంపితే నిధులు విడుదల చేయించడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం పాల్గొన్నారు.