‘పాలమూరు’ పనుల్లో వేగం పెంచండి
మహబూబ్‌నగర్ జిల్లా అధికారులకు హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం మొత్తం 96,485 ఎకరాలను సేకరించాల్సి ఉండగా 86,956 ఎకరాలను సేకరించినట్లు పాలమూరు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు.
మరో 600 ఎకరాలను సేకరిస్తే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని వివరించారు. ప్రాజెక్టులను నిర్ణీత గడువు లోపలే పూర్తి చేయాలని చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావుకు సూచించారు.