Minister T.Harish Rao
-
పాలమూరు రూపురేఖలు మార్చుతాం
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మక్తల్: పాలమూరులో వలసలను రూపుమాపుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉందన్నారు. పాలమూరు అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా సరే ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గురువారం మక్తల్‌లో రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకం స్టేజ్–1, స్టేజ్–2 పంప్‌లతో పాటు గురుకుల పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం వెయ్యి కోట్లతో గోదాములు నిర్మించినట్లు చెప్పారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేస్తుందన్నారు. జిల్లాలోని 18లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సంగంబండ రిజర్వాయర్‌ను పూర్తిచేసి 75వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించి తీరుతామన్నారు. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆగదన్నారు. చంద్రబాబు పల్లకీ మోస్తున్న టీడీపీ నాయకులు నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరును ప్రగతి పథంలో నిలుపుతామని ధీమా వ్యక్తంచేశారు. జిల్లాలోని ప్రతిచెరువుకు నీళ్లు అందిస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసమే.. అనంతరం ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువు, కుంటకు నీళ్లు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కె.నారాయణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, విఠల్‌రావు ఆర్యా, దేవరి మల్లప్ప, మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ, మక్తల్ ఎంపీపీ కోళ్ల పద్మమ్మ, వైస్ ఎంపీపీ సునితాగోపాల్రెడ్డి, మాగనూర్ జెడ్పీటీసీ సరిత, ఆర్డీఓ శ్రీనివాస్, సీఈ ఖగేందర్ పాల్గొన్నారు. -
వారంలో పాలమూరు సర్వే
సాక్షి, హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణకు సంబంధించి... గతంలో సమర్పించిన షెడ్యూలుకు అనుగుణంగా వారం రోజుల్లో సర్వే పనులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల పనులు, భూ సేకరణ పురోగతిపై శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి సమీక్షించారు. కోర్టు స్టే ఇవ్వని ప్రాంతాల్లో భూ సేకరణ ప్రక్రియ కొనసాగించాలని.. సర్వే, భూ సేకరణకు సంబంధించి నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పహానీల్లో పేర్లు నమోదైవున్న అసైన్డ్ లబ్దిదారులకు నష్టపరిహారాన్ని చెల్లిం చాలని.. పేర్లు లేని వారి విషయంలో పంచనామా నిర్వహించి పరిహారాన్ని సెటిల్ చేయాలన్నారు. వేర్వేరు రేషన్, ఆధార్ కార్డులు కలిగి.. వివాహమై ఒకే ఇంట్లో నివసిస్తున్నా.. వారిని వేర్వేరు కుటుంబాలుగా గుర్తించి పరిహారం ఇవ్వాలన్నారు. రిజర్వాయర్ల ఆనకట్ట పరిధిలోకి వచ్చే భూముల సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని.. అదే సమయంలో ఇతర భూ సేకరణ ద్వారా పనులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించే కరివెనరిజర్వాయర్ డిజైన్లు, డ్రాయింగ్లకు వారం రోజుల్లో తుది రూపు ఇచ్చి.. పనులు ప్రారంభించాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రోబో శాండ్ వినియోగానికి సంబంధించి నీటి పారుదల శాఖ ఈఎన్సీతో పాటు, చీఫ్ ఇంజనీర్ 3 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు. ‘కల్వకుర్తి’ నీటి నిర్వహణపై దృష్టి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండు, మూడో దశ పంపులు ప్రారంభమైన నేపథ్యంలో నీటి నిర్వహణను సవాలుగా తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించా రు. పథకం ద్వారా ప్రస్తుత సీజన్లో 1.6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కాలువలకు గండ్లు కొట్టే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయ ర్లు, నిర్దేశిత ఆయకట్టుకు నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా రెండో పంపును తక్షణమే సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలపై తలపెట్టిన నిర్మాణాలను 2017 జూన్‌లోగా పూర్తి చేయాలన్నారు. జీఓ 123కి సంబంధించి పెండింగులో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించాలన్నారు. బీమా ఎత్తిపోతల పథకానికి సంబంధించి జూలైలోనే ఒక పంపు ప్రారంభమైనా... సంగంబండ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రబీ సీజన్లో సంగంబండ కింద 30వేల ఎకరాలకు నీరివ్వాలన్నారు. -
నేడు జిల్లాకు మంత్రి హరీశ్‌రావు
కేఎల్ఐ లిఫ్ట్–2, 3 ప్రారంభోత్సవం గుడిపల్లి గట్టు వద్ద బహిరంగసభ మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్–2ను ప్రారంభించనున్నారు. జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ను ప్రారంభించి సాగునీటిని విడుదల చేయనున్నారు. మంత్రి ఉదయం 11 గంటలకు పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద కల్వకుర్తి లిఫ్ట్–2 ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తారని, అనంతరం జొన్నల బొగుడ రిజర్వాయర్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేస్తారని కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లిఫ్ట్–3 పరిధిలోని గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ను ప్రారంభించి కాల్వలకు నీరు వదులుతారని, అక్కడకూడా నిర్వహించే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మంత్రులు హైదరాబాద్ బయలుదేరి వెళతారు. -
కరువు నేలకు కొత్తకాంతులు
నెరవేరుతున్న దశాబ్దాల కల నేడు 4ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవం 4.30లక్షల ఎకరాలకు సాగునీరు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు తీరనున్న వలస బతుకుల కష్టాలు జూరాల: కాగితాలకే పరిమితమైన తెలంగాణ ప్రాజెక్టులకు ప్రాణం వచ్చింది. సాగునీరు లేక భూములు బీళ్లుగా మారి కూలీ పనుల కోసం వలసబాట పట్టిన రైతుల తలరాతలు మారే ఘడియలు వచ్చాయి. దాదాపు 15 లక్షల మంది వలసబాట పట్టి దేశంలోనే రికార్డు సృష్టించిన పాలమూరు రైతుల బతుకులు మారాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నిజమవుతున్నాయి. జిల్లాలోని నాలుగు పెండింగ్ ప్రాజెక్టుల పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ ఖరీఫ్ నుంచే 4.30లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోంది. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ఖరీఫ్ నుంచే జిల్లాలోని 4.3లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. జిల్లాలో గురువారం విస్తృతంగా పర్యటించి ఐదుచోట్ల నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పలు సందర్భాల్లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో మొదటి ప్రాధాన్యం అత్యంత నిర్లక్ష్యానికి గురైన పాలమూరు జిల్లాకే దక్కాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. జిల్లాలోని ప్రతి ఎకరం సాగులోకి రావాలని తపించారు. ప్రాజెక్టుల రీడిజైన్లలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టుకే తొలి శంకుస్థాపన చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యేలోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మంజూరు చేశారు. పాత బిల్లులు కూడా చెల్లించారు. పరిపాలనపరమైన జాప్యాన్ని నివారించారు. ఫలితంగా 2005లో జలయజ్ఞంలో భాగంగా చేపట్టినప్పటికీ నత్తనడకన పనులు నడుస్తున్న భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు పరుగు అందుకున్నాయి. దగ్గరుండి పర్యవేక్షించిన హరీశ్‌రావు సీఎం ఇచ్చిన మాట నిలబెట్టడానికి ప్రాజెక్టుల వద్ద నిద్ర చేసి మరీ పనులు చేయించారు మంత్రి హరీశ్‌రావు. ఈ పథకాలకు అవసరమైన భూసేకరణ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. భూ నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు. కొన్నిచోట్ల సాగునీటి ప్రాజెక్టులు, ప్రధాన కాలువలకు అంతరాయంగా ఉన్న రైల్వే సమస్యలను రైల్వే అధికారులతో నిరంతరం చర్చించి పరిష్కరించారు. కాంట్రాక్టర్లు అధికారులతో పలుమార్లు సమావేశమై ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణాలను అన్వేషించారు. కారణాలు తెలిసిన తర్వాత వాటి పరిష్కారానికి చొరవ చూయించారు. దాదాపు ప్రతి ప్రాజెక్టులోని లిఫ్టులు, పంప్‌హౌస్‌లు, కాలువలు, పైప్‌లను స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టుల పనులు జరుగుతున్న చోటే నిద్రచేసి అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులు, టెక్నీషియన్లు, కూలీలతో మాట్లాడారు. వారిలో ఉత్సాహం నింపి, పనులు త్వరితంగా జరిగేలా చూశారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ తయారు చేసి ప్రతిక్షణం ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్నారు. ప్రతిరోజు పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఇన్ని ప్రయత్నాల తర్వాత ప్రాజెక్టుల పనులు అనుకున్న రీతిలో పూర్తి దశకుచేరుకున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఎట్టి పరిస్థితుల్లోసాగునీరు ఇవ్వాలన్నదే లక్ష్యం నిర్ణయించుకొని దాన్ని చేరుకోవడానికి పట్టుదలతో పనిచేశారు. తాను స్వయంగా చొరవచూపి పూర్తి చేయించిన పనులను తానే స్వయంగా పరిశీలించి గురువారం ప్రారంభించి రైతులకు, పవిత్ర కృష్ణాజ లాలను అందిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కష్టపడి పనిచేసిన lఅధికారులు ప్ర«భుత్వ ప్రాధాన్యతను, పాలమూరు ప్రజల అవసరాలను గుర్తించిన నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు కూడా ఈ రెండేళ్ల సమయంలో ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యమంత్రి, నీటి పారుదలశాఖ మంత్రి అందించిన ప్రత్యేక సహకారంతో అధికారులు, ఇంజనీర్లు శక్తివంచన లేకుండా పనిచేశారు. రికార్డు టైములో పనులు పూర్తిచేసి రైతులకు మేలు చేశారు. ప్రారంభోత్సవాలు ఇలా... భీమా, ఎత్తిపోతల పథకం ఆత్మకూరు మండలం నందిమళ్ల లో ఉదయం 9గంటలకు పార్లర్ కెనాల్, కొత్తకోటలో మధ్యాహ్నం 12గంటలకు స్టేజ్–2 ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఆయకట్టు 2లక్షల ఎకరాలు. గురువారం నుంచి నీరందే ఆయకట్టు 1.40లక్షల ఎకరాలు. 2017 ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. సాగునీరందే నియోజకవర్గాలు– మక్తల్, దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ధరూరు మండలం ర్యాలంపాడులో ఉదయం 10.30గంటలకు రెండో లిఫ్టు ప్రారంభోత్సవం జరుగుతుంది. మొత్తం ఆయకట్టు 2లక్షల ఎకరాలు. గురువారం నుంచి నీరందించే ఆయకట్టు 1.20లక్షల ఎకరాలు. 2017 ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. సాగునీరందే నియోజకవర్గాలు– అలంపూర్, గద్వాల. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో సాయంత్రం 3గంటలకు లిఫ్ట్–1 ప్రారంభోత్సవం జరుగుతుంది. ధన్వాడ మండలం సీలేరులో సాయంత్రం 4గంటలకు లిఫ్ట్–2 ప్రారంభోత్సవం జరుగుతుంది. మొత్తం ఆయకట్టు 50వేల ఎకరాలు. గురువారం నీరందించే ఆయకట్టు 20వేల ఎకరాలు. 2017 ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. సాగునీరందే నియోజకవర్గాలు–నారాయణపేట, మక్తల్, దేవరకద్ర. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొత్తం ఆయకట్టు 3.65లక్షల ఎకరాలు. ఈ ఏడాది నీరందే ఆయకట్టు 1.50లక్షల ఎకరాలు. 2017 ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. సాగునీరందే నియోజకవర్గాలు– కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి. -
‘పాలమూరు’ పనుల్లో వేగం పెంచండి
మహబూబ్‌నగర్ జిల్లా అధికారులకు హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం మొత్తం 96,485 ఎకరాలను సేకరించాల్సి ఉండగా 86,956 ఎకరాలను సేకరించినట్లు పాలమూరు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు. మరో 600 ఎకరాలను సేకరిస్తే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని వివరించారు. ప్రాజెక్టులను నిర్ణీత గడువు లోపలే పూర్తి చేయాలని చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావుకు సూచించారు. -
టీ ప్రాజెక్టుల నిలిపివేతకు టీడీపీ కుట్ర
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ను ఎంతగా విమర్శిస్తే, అంతగా ఏపీ ప్రజలకు దగ్గర కావచ్చని తెలుగుదేశం అల్ప బుద్ధిని ప్రదర్శిస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఏపీలో రాజకీయ ఆధిపత్యం కోసం తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రాజెక్టులపై పడి ఏడ్వటం వారి రాజకీయ దివాళాకోరు తనానికి నిదర్శమన్నారు. గురువారం మంత్రి హరీశ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని టీడీపీ ప్రభుత్వం ఏపీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటోందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, డిండి ప్రాజెక్టును నిలిపి వేయాలని ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ కేంద్రాన్ని కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆ ప్రకటనలో తెలిపారు. పాలమూరు, డిండి పథకాలను అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలోనే ఎక్కువమంది వలస కూలీలు ఉన్న దురదృష్టమైన జిల్లాగా పేరుపడ్డ పాలమూరు ప్రజల బతుకుల్లో మార్పు రావడాన్ని టీడీపీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. ఫ్లోరైడ్ పీడిత బాధితులున్న నల్లగొండ జిల్లాకు రక్షిత తాగు, సాగునీరు ఇవ్వడం వారికి కంటగింపుగా మారిందని దుయ్యబట్టారు. పాత ప్రాజెక్టులే.. కడుపు మంటెందుకు..? కృష్ణానది నికర జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉందని, మిగులు జలాల్లో కనీసం 150 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయి. మొత్తంగా 499 టీఎంసీల వాటా దక్కుతుంది. ఇప్పటి దాకా కృష్ణానదిలో 150 టీఎంసీలు కూడా వాడుకోలేదు. పాలమూరు ద్వారా 70 టీఎంసీలు, డిండి ద్వారా 30 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నామని, ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యి, అనుకున్న స్థాయిలో నీటిని వాడుకున్నా, కృష్ణా నదిలో ఇంకా తెలంగాణ వాటా నీళ్లు మిగిలే ఉంటాయని మంత్రి హరీశ్ రావు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే బీమా ప్రాజెక్టుకు 100 టీఎంసీల నీటి కేటాయింపు ఉందని, బీమా ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగానే పాలమూరు, డిండి ప్రాజెక్టులను చేపడుతున్నామని, కేటాయింపు ఉన్న నీళ్లనే వాడుకుంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే డిండి ప్రాజెక్టు నిర్మిస్తామని కాంగ్రెస్ మాటిచ్చిందని, పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సర్వే చేయాలని కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మోదీ మహబూబ్‌నగర్ సభలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయలేకపోయిన కాంగ్రెస్‌ను విమర్శించారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ పార్టీలకు తోక పార్టీగా మారిందని, పాలమూరును అడ్డుకోవడానికి టీడీపీ చేసే కుట్రలకు ఉత్తమ్ వంతపాడటం సిగ్గుచేటన్నారు. -
ధరల స్థిరీకరణనిధి విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శుక్రవారం శాసనసభ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉల్లిని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చేపడుతున్న చర్యలను వివరించారు. ఉల్లి సేకరణకు కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాని పక్షంలో రాష్ట్ర ఖజానా నుంచి రూ.100 కోట్ల మేర వినియోగించే యోచనలో ఉన్నామన్నారు. రూ.20కే కిలో ఉల్లిని అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 80 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 40 విక్రయ కేంద్రాలు ఏర్పా టు కాగా, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో మరో 40 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని హైదరాబాద్‌లో రైతు బజార్లతో పాటు ‘మన కూరగాయల’ అవుట్లెట్ల ద్వారా ఉల్లి విక్రయాలు ప్రారంభించామన్నారు. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రభు త్వ అవుట్లెట్లు ప్రారంభమయ్యేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఉల్లి సేకరణ, విక్రయాలపై సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. కుటుంబానికి రెండు కిలోలు మహారాష్ట్రలోని నాసిక్‌తోపాటు కర్నూలు, హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్ల నుంచి ఉల్లి కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు హరీశ్ ప్రకటిం చారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉందన్నారు. ప్రభుత్వ ఔట్లెట్ల ద్వారా రోజూ 100 టన్నుల ఉల్లి అందుబాటులోకి తెస్తామన్నారు. కుటుంబానికి గరిష్టంగా రెండు కిలోల వంతున సరఫరా చేస్తామని చెప్పారు. వాట్సప్ ద్వారా ఉల్లి ధరలపై ఎప్పటికప్పుడు మార్కెటింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. -
చెరువులే ఆధారం
పునరుద్ధరణకు పరిమితి లేదు ⇒ జిల్లాలో 5939 పునరుద్ధరణ.. మొదటి దశలో 1188 అభివృద్ధి ⇒ ముంపునకు గురయ్యే పొలాలకు పరిహారం ఇస్తాం ⇒ పునరుద్దరణ ఖర్చులు భరిస్తే చెరువులకు దాతల పేర్లు పెడతాం ⇒ చెరువుల చుట్టూ ఈత చెట్లు, పూల మొక్కలు నాటుతాం ⇒ తెలంగాణ ఉద్యమం మాదిరిగా చెరువుల పునరుద్దరణ ⇒ వారంలో టెండర్లు, జనవరి మొదటి వారం నుంచి పనులు షురూ ⇒ మట్టిని తీసుకెళ్లే సన్నకారు రైతులకు సబ్సిడీ ఇచ్చే యోచన ⇒ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడి ⇒ జెడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ‘మిషన్ కాకతీయ’పై చర్చ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి నిధుల పరిమితి లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. చెరువులను పూర్తిస్థాయిలో పటిష్టం చేసేందుకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చెరువుల పునరుద్దరణలో భాగంగా ముంపుకు గురయ్యే పట్టా భూములకు నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని కోరారు. వారం రోజుల్లో చెరువుల పునరుద్దరణకు టెండర్లు నిర్వహించడంతోపాటు జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బాగా పనిచేసే అధికారులకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే సాగునీటి శాఖ అధికారులంతా తప్పనిసరిగా స్థానిక ప్రజాప్రతినిధులతో చెరువుల పునరుద్దరణపై మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ కాకతీయలో భాగంగా సోమవారం కరీంనగర్ పర్యటకు వచ్చిన మంత్రి హరీష్‌రావు జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఈఓ అంబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. చెరువుల పునరుద్దరణ కార్యక్రమాల విధివిధానాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజా ప్రయోజనాలను గంటకుపైగా వివరించడంతో పాటు ప్రజాప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. చెరువుల పునరుద్దరణకు నిధుల పరిమితిపై ప్రసంగిస్తూ ‘ఒక్కో చెరువు పునరుద్దరణకు ఎన్ని నిధులైనా ఇస్తాం. పరిమితి లేనేలేదు. పూడిక తీయాలి. కట్టలను పోయాలి. కట్టు కాలవలు, పంట కాలువను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. చెరువు గట్లపై ఈతచెట్లు, పూలమొక్కలు నాటాలి. ఇట్లా పూర్తిస్థాయిలో చెరువులను పునరుద్దరించేందుకు ఎంత ఖర్చయినా భరిస్తాం’ అని ఉద్ఘాటించారు. చెరువు భూముల ను కబ్జా చేసిన వారెంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించొద్దని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువు శిఖం భూములకు, రెవెన్యూ రికార్డులకు పొంతనలేదని, వీటిని సరిచేయాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపైనే ఉందన్నారు. చెరువుల మరమ్మతులకు అయ్యే ఖర్చును భరించేందుకు ఎన్ఆర్ఐలు సహా దాతలెవరు ముందుకొచ్చినా ఆయా చెరువులకు వారి కుటుంబసభ్యుల పేర్లు పెడతామని చెప్పారు. అటవీశాఖ పరిధిలోనున్న చెరువులను తమకు అప్పగిస్తే తామే పునరుద్దరిస్తామని, సాధ్యంకాని పక్షంలో తాము ప్రతిపాదించిన డిజైన్ ప్రకారం అటవీశాఖ అధికారులు పనులు చేపడితే అందుకయ్యే వ్యయాన్ని తమ శాఖే భరిస్తుందన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, చెరువులను పునరుద్దరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. పునరుద్దరణ పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు ఒక్కో జిల్లాలో చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని స్థానిక కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ఒక్కో చెరువుకు విడివిడిగా టెండర్లను పిలుస్తామని, క్లాస్-5 కాంట్రాక్టర్ సైతం రూ.50 లక్షల లోపు విలువ గల టెండర్లలో పాల్గొనవచ్చునని అన్నారు. చెరువుల్లో పూడిక తీసిన సారవంతమైన మట్టిని రైతులే స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తరలించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సన్నకారు రైతులకు సబ్సిడీని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల పొలాల్లో కుప్పలుగా పోసిన మట్టిని చదును చేయిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో కమిటీ - మంత్రి ఈటెల రాజేందర్ అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. చెరువుల పునరుద్దరణ అనంతరం వాటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా స్థానిక సర్పంచ్, ఎంపీటీసీతో పాటు ఆయా చెరువులపై ఆధారపడే సామాజిక చైతన్యమున్న రైతులు, రజకులు, మత్స్యకారులు సహా ఐదుగురితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని హరీష్‌రావుకు సూచించారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా చెరువుల పునరుద్దరణ పనులు చేపడతామని, రాబోయే రోజుల్లో మంత్రులంతా చెరువుల వద్దే టెంట్లు వేసుకుని పనులను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పరుసన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభ, చెన్నమనేని రమేశ్‌బాబు, వి.సతీష్‌బాబు ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, నగర మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జేసీ సర్ఫరాజ్ అహ్మద్, సీఈఓ అంబయ్య, జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, సిద్దం వేణు, ఎడ్ల శ్రీనివాస్, ఆగయ్య, లచ్చిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలున్న నేపథ్యంలో ఎంపీలెవరూ ఈ సమావేశానికి రాలేదు. అంతకుముందు మొదటిసారి జెడ్పీకి వచ్చిన మంత్రి హరీష్‌రావును జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సన్మానించారు.