చెరువులే ఆధారం | T Harish Rao asks NRIs to get involved in Mission Kakatiya | Sakshi
Sakshi News home page

చెరువులే ఆధారం

Published Tue, Dec 9 2014 2:03 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

చెరువులే ఆధారం - Sakshi

చెరువులే ఆధారం

పునరుద్ధరణకు పరిమితి లేదు
జిల్లాలో 5939 పునరుద్ధరణ.. మొదటి దశలో 1188 అభివృద్ధి
ముంపునకు గురయ్యే పొలాలకు పరిహారం ఇస్తాం
పునరుద్దరణ ఖర్చులు భరిస్తే చెరువులకు దాతల పేర్లు పెడతాం
చెరువుల చుట్టూ ఈత చెట్లు, పూల మొక్కలు నాటుతాం
తెలంగాణ ఉద్యమం మాదిరిగా చెరువుల పునరుద్దరణ
వారంలో టెండర్లు, జనవరి మొదటి వారం నుంచి పనులు షురూ
మట్టిని తీసుకెళ్లే సన్నకారు రైతులకు సబ్సిడీ ఇచ్చే యోచన
నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడి
జెడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ‘మిషన్ కాకతీయ’పై చర్చ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి నిధుల పరిమితి లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. చెరువులను పూర్తిస్థాయిలో పటిష్టం చేసేందుకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చెరువుల పునరుద్దరణలో భాగంగా ముంపుకు గురయ్యే పట్టా భూములకు నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని కోరారు. వారం రోజుల్లో చెరువుల పునరుద్దరణకు టెండర్లు నిర్వహించడంతోపాటు జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బాగా పనిచేసే అధికారులకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే సాగునీటి శాఖ అధికారులంతా తప్పనిసరిగా స్థానిక ప్రజాప్రతినిధులతో చెరువుల పునరుద్దరణపై మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు.

మిషన్ కాకతీయలో భాగంగా సోమవారం కరీంనగర్ పర్యటకు వచ్చిన మంత్రి హరీష్‌రావు జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఈఓ అంబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. చెరువుల పునరుద్దరణ కార్యక్రమాల విధివిధానాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజా ప్రయోజనాలను గంటకుపైగా వివరించడంతో పాటు ప్రజాప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు.
 
చెరువుల పునరుద్దరణకు నిధుల పరిమితిపై ప్రసంగిస్తూ ‘ఒక్కో చెరువు పునరుద్దరణకు ఎన్ని నిధులైనా ఇస్తాం. పరిమితి లేనేలేదు. పూడిక తీయాలి. కట్టలను పోయాలి. కట్టు కాలవలు, పంట కాలువను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. చెరువు గట్లపై ఈతచెట్లు, పూలమొక్కలు నాటాలి. ఇట్లా పూర్తిస్థాయిలో చెరువులను పునరుద్దరించేందుకు ఎంత ఖర్చయినా భరిస్తాం’ అని ఉద్ఘాటించారు.

చెరువు భూముల ను కబ్జా చేసిన వారెంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించొద్దని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువు శిఖం భూములకు, రెవెన్యూ రికార్డులకు పొంతనలేదని, వీటిని సరిచేయాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపైనే ఉందన్నారు. చెరువుల మరమ్మతులకు అయ్యే ఖర్చును భరించేందుకు ఎన్‌ఆర్‌ఐలు సహా దాతలెవరు ముందుకొచ్చినా ఆయా చెరువులకు వారి కుటుంబసభ్యుల పేర్లు పెడతామని చెప్పారు.

అటవీశాఖ పరిధిలోనున్న చెరువులను తమకు అప్పగిస్తే తామే పునరుద్దరిస్తామని, సాధ్యంకాని పక్షంలో తాము ప్రతిపాదించిన డిజైన్ ప్రకారం అటవీశాఖ అధికారులు పనులు చేపడితే అందుకయ్యే వ్యయాన్ని తమ శాఖే భరిస్తుందన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, చెరువులను పునరుద్దరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. పునరుద్దరణ పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు ఒక్కో జిల్లాలో చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలోని స్థానిక కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ఒక్కో చెరువుకు విడివిడిగా టెండర్లను పిలుస్తామని, క్లాస్-5 కాంట్రాక్టర్ సైతం రూ.50 లక్షల లోపు విలువ గల టెండర్లలో పాల్గొనవచ్చునని అన్నారు. చెరువుల్లో పూడిక తీసిన సారవంతమైన మట్టిని రైతులే స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తరలించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సన్నకారు రైతులకు సబ్సిడీని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల పొలాల్లో కుప్పలుగా పోసిన మట్టిని చదును చేయిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
 పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో కమిటీ
 - మంత్రి ఈటెల రాజేందర్
 
అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. చెరువుల పునరుద్దరణ అనంతరం వాటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా స్థానిక సర్పంచ్, ఎంపీటీసీతో పాటు ఆయా చెరువులపై ఆధారపడే సామాజిక చైతన్యమున్న రైతులు, రజకులు, మత్స్యకారులు సహా ఐదుగురితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని హరీష్‌రావుకు సూచించారు.

తెలంగాణ ఉద్యమం మాదిరిగా చెరువుల పునరుద్దరణ పనులు చేపడతామని, రాబోయే రోజుల్లో మంత్రులంతా చెరువుల వద్దే టెంట్లు వేసుకుని పనులను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పరుసన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభ, చెన్నమనేని రమేశ్‌బాబు, వి.సతీష్‌బాబు ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, నగర మేయర్ రవీందర్‌సింగ్,  కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జేసీ సర్ఫరాజ్ అహ్మద్, సీఈఓ అంబయ్య, జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, సిద్దం వేణు, ఎడ్ల శ్రీనివాస్, ఆగయ్య, లచ్చిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలున్న నేపథ్యంలో ఎంపీలెవరూ ఈ సమావేశానికి రాలేదు. అంతకుముందు మొదటిసారి జెడ్పీకి వచ్చిన మంత్రి హరీష్‌రావును జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement