General meetings
-
అధికారులే టార్గెట్ ..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ పాలనా లోపాలను పక్కన పెట్టి అధికారులే టార్గెట్‌గా శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాగింది. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు మండి పడ్డారు. ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీపీఓ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యశాఖలకు సంబం ధించిన అంశాలపై చర్చ సాగింది. జామిమండల కేంద్రం లో సొంత నిధులతో బోర్లు వేయించానని, బిల్లులు చెల్లిం చాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని జామి జెడ్పీటీసీ సభ్యుడు పెదబాబు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈపై మండిపడ్డారు. గుర్ల జెడ్పీటీసీ మాట్లాడుతూ గుర్ల మండలం గరికి వలస ఎస్సీ కాలనీలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన రెండు రోజుల తర్వాత నీటిసరఫరా నిలిచిపోయిందని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సుజయ్ స్పందిస్తూ పథక నిర్మాణం పూర్తయ్యాకే తాగునీరు సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. కురుపాంలో తాగునీటి పథకం పాడవ్వడంతో 10 రోజులుగా అక్కడ ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి తెలిపారు. సెప్టిక్‌ట్యాంక్ క్లీన్ చేయడానికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారని, దీనివల్ల మరుగుదొడ్డి నిర్మించడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఎల్.కోట జెడ్పీటీసీ కరెడ్డ ఈశ్వరావు సభలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి కలుగుజేసుకుని ఆర్డబ్ల్యూఎస్, రవాణశాఖ, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ తో సమావేశం నిర్వహించి సహజ ధర నిర్ణయిం చాలని జెసీ–2 నాగేశ్వరావుకు ఆదేశించారు. కొమరాడ జెడ్పీటీసీ పావని మాట్లాడుతూ ఉరిటి గ్రామానికి 293 మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఇందులో 150 వరకు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వైడీఓ నెట్వర్స్ సంస్థ నిర్మాణాల పూర్తికి చొరవచూపడం లేదని తెలిపారు. డ్వామా పీడీపై మండిపడిన ఎమ్మెల్యే చిరంజీవులు.. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు రావడం లేదని, దీనివల్ల వేతనదారులు ఇబ్బందిపడుతున్నారని డ్వామా పీడీ రాజ్‌గోపాల్‌ను ప్రశ్నించారు. దీనిపై మంత్రి రంగారావు కలుగుజేసుకుని ఎప్పటి నుంచి ఉపాధిహామీ వేతనదారులకు డబ్బులు ఆగిపోయాయో చెప్పాలని అడిగారు. పిభ్రవరి 19 నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉందని, రూ.66 కోట్లు నిధులు పెండింలో ఉన్నాయని, త్వరలోనే «థర్డ్‌పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదు జమ చేస్తామని రాజ్‌గోపాల్ బదులిచ్చారు. గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, షిప్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్మేస్తుండడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. దీనిపై డ్వామా పీడీ కలుగుజేసుకుని నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరిగాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగితే జిల్లాలో ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు. డెంకాడ జెడ్పీటీసీ అప్పలనారాయణ మాట్లాడుతూ మోపాడ పీహెచ్సీలో స్టాఫ్ నర్సు పోస్టులు –3, ఒక ల్యాబ్ టెక్సీషియన్ పోస్టును భర్తీ చేయాలని కోరారు. రెండేళ్లుగా పోస్టులు ఖాళీగా ఉంటే సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. కురుపాం ఆస్పత్రికి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సు లేకపోవడం వల్ల రెండు, మూడు రోజులు మృత దేహాలను ఆస్పత్రుల్లో ఉంచేస్తున్నారని, చందాలు వేసుకుని మృతదేహాన్ని తరలించాల్సి వస్తోందని కురుపాం జెడ్పీటీసీ పద్మావతి అన్నారు. అలమండ ఎంపీటీసీకి నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌డీఎస్ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆస్పత్రి మధ్యలో కళ్యాణ మండపానికి అతను రోడ్డు వేసేసాడని, హెచ్బిఎస్ చైర్మన్ నుంచి అతన్ని తొలిగిస్తారా లేదా ఆస్పత్రిని కూడ అతనికే ఇచేస్తారా అని జామి జెడ్పీటీసీ పెదబాబు డిఎంహెచ్వోపై మండి పడ్డారు. రుణాలు మంజూరు చేయడంలేదు.. టీడీపీ కార్యకర్తలకు పీఏసీఎస్‌లలో రుణాలు మంజూరు చేయడం లేదని గజపతినగరం ఎమ్మెల్యే కె.ఏ.నాయుడు, పూసపాటిరేగ జెడ్పీటీసీ ప్రసాదరావు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తినాయుడులు ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభస్వాతిరాణి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాలగీత, కోళ్ల లలితకుమారి, నారాయణస్వామినాయుడు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులే ఆధారం
పునరుద్ధరణకు పరిమితి లేదు ⇒ జిల్లాలో 5939 పునరుద్ధరణ.. మొదటి దశలో 1188 అభివృద్ధి ⇒ ముంపునకు గురయ్యే పొలాలకు పరిహారం ఇస్తాం ⇒ పునరుద్దరణ ఖర్చులు భరిస్తే చెరువులకు దాతల పేర్లు పెడతాం ⇒ చెరువుల చుట్టూ ఈత చెట్లు, పూల మొక్కలు నాటుతాం ⇒ తెలంగాణ ఉద్యమం మాదిరిగా చెరువుల పునరుద్దరణ ⇒ వారంలో టెండర్లు, జనవరి మొదటి వారం నుంచి పనులు షురూ ⇒ మట్టిని తీసుకెళ్లే సన్నకారు రైతులకు సబ్సిడీ ఇచ్చే యోచన ⇒ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడి ⇒ జెడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ‘మిషన్ కాకతీయ’పై చర్చ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి నిధుల పరిమితి లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. చెరువులను పూర్తిస్థాయిలో పటిష్టం చేసేందుకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చెరువుల పునరుద్దరణలో భాగంగా ముంపుకు గురయ్యే పట్టా భూములకు నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని కోరారు. వారం రోజుల్లో చెరువుల పునరుద్దరణకు టెండర్లు నిర్వహించడంతోపాటు జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బాగా పనిచేసే అధికారులకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే సాగునీటి శాఖ అధికారులంతా తప్పనిసరిగా స్థానిక ప్రజాప్రతినిధులతో చెరువుల పునరుద్దరణపై మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ కాకతీయలో భాగంగా సోమవారం కరీంనగర్ పర్యటకు వచ్చిన మంత్రి హరీష్‌రావు జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఈఓ అంబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. చెరువుల పునరుద్దరణ కార్యక్రమాల విధివిధానాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజా ప్రయోజనాలను గంటకుపైగా వివరించడంతో పాటు ప్రజాప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. చెరువుల పునరుద్దరణకు నిధుల పరిమితిపై ప్రసంగిస్తూ ‘ఒక్కో చెరువు పునరుద్దరణకు ఎన్ని నిధులైనా ఇస్తాం. పరిమితి లేనేలేదు. పూడిక తీయాలి. కట్టలను పోయాలి. కట్టు కాలవలు, పంట కాలువను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. చెరువు గట్లపై ఈతచెట్లు, పూలమొక్కలు నాటాలి. ఇట్లా పూర్తిస్థాయిలో చెరువులను పునరుద్దరించేందుకు ఎంత ఖర్చయినా భరిస్తాం’ అని ఉద్ఘాటించారు. చెరువు భూముల ను కబ్జా చేసిన వారెంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించొద్దని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువు శిఖం భూములకు, రెవెన్యూ రికార్డులకు పొంతనలేదని, వీటిని సరిచేయాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపైనే ఉందన్నారు. చెరువుల మరమ్మతులకు అయ్యే ఖర్చును భరించేందుకు ఎన్ఆర్ఐలు సహా దాతలెవరు ముందుకొచ్చినా ఆయా చెరువులకు వారి కుటుంబసభ్యుల పేర్లు పెడతామని చెప్పారు. అటవీశాఖ పరిధిలోనున్న చెరువులను తమకు అప్పగిస్తే తామే పునరుద్దరిస్తామని, సాధ్యంకాని పక్షంలో తాము ప్రతిపాదించిన డిజైన్ ప్రకారం అటవీశాఖ అధికారులు పనులు చేపడితే అందుకయ్యే వ్యయాన్ని తమ శాఖే భరిస్తుందన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, చెరువులను పునరుద్దరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. పునరుద్దరణ పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు ఒక్కో జిల్లాలో చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని స్థానిక కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ఒక్కో చెరువుకు విడివిడిగా టెండర్లను పిలుస్తామని, క్లాస్-5 కాంట్రాక్టర్ సైతం రూ.50 లక్షల లోపు విలువ గల టెండర్లలో పాల్గొనవచ్చునని అన్నారు. చెరువుల్లో పూడిక తీసిన సారవంతమైన మట్టిని రైతులే స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తరలించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సన్నకారు రైతులకు సబ్సిడీని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల పొలాల్లో కుప్పలుగా పోసిన మట్టిని చదును చేయిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో కమిటీ - మంత్రి ఈటెల రాజేందర్ అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. చెరువుల పునరుద్దరణ అనంతరం వాటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా స్థానిక సర్పంచ్, ఎంపీటీసీతో పాటు ఆయా చెరువులపై ఆధారపడే సామాజిక చైతన్యమున్న రైతులు, రజకులు, మత్స్యకారులు సహా ఐదుగురితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని హరీష్‌రావుకు సూచించారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా చెరువుల పునరుద్దరణ పనులు చేపడతామని, రాబోయే రోజుల్లో మంత్రులంతా చెరువుల వద్దే టెంట్లు వేసుకుని పనులను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పరుసన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభ, చెన్నమనేని రమేశ్‌బాబు, వి.సతీష్‌బాబు ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, నగర మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జేసీ సర్ఫరాజ్ అహ్మద్, సీఈఓ అంబయ్య, జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, సిద్దం వేణు, ఎడ్ల శ్రీనివాస్, ఆగయ్య, లచ్చిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలున్న నేపథ్యంలో ఎంపీలెవరూ ఈ సమావేశానికి రాలేదు. అంతకుముందు మొదటిసారి జెడ్పీకి వచ్చిన మంత్రి హరీష్‌రావును జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సన్మానించారు. -
మూడేళ్ల తర్వాత..
నేటినుంచి జెడ్పీ సర్వసభ్య సమావేశాలు ►వరుసగా రెండు రోజులపాటు నిర్వహణ ►‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఎజెండా ► మండలాల అనుసంధానానికి ప్రాధాన్యత ►కొత్త పాలకవర్గం తొలి సమావేశం కరీంనగర్ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. వరుసగా శుక్ర, శనివారాల్లో ఉదయం 11 గంటల నుంచి చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ సదానందం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన ప్రణాళిక చివరి దశ అయిన మన జిల్లా-మన ప్రణాళిక అనే అంశం ఎజెండాగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాలో ఇప్పటికే మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక సమావేశాలు పూర్తయినందున, మన జిల్లా-మన ప్రణాళిక కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో మన జిల్లా-మన ప్రణాళిక అంశంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ నెల 26వ తేదీన ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని అధికారులు భావించినా, జిల్లా సమస్యలపై కూలంకషంగా చర్చించి, ప్రణాళికలు రూపొందించాలంటే ఒక్క రోజు సమయం సరిపోదని భావించిన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సమావేశాలు రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. మండలాల అనుసంధానానికి ప్రాధాన్యం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో రెండు, అంతకన్నా ఎక్కువ మండలాలకు సంబంధించిన పనులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా మండలాలను అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి జిల్లా ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పచ్చదనాన్ని ప్రోత్సహించేందుకు మొక్కల పెంపకానికి ప్ర ణాళికు రూపొందించనున్నారు. మండలాల ను కలుపుతూ రోడ్ల నిర్మాణం, గొలుసుకట్టు చెరువులు, కుంటల నిర్మాణం, మొక్కల పెం పకం అనే మూడు అంశాలకు జిల్లా ప్రణాళిక లో అధిక ప్రాధాన్యతను కల్పించనున్నారు. ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా చర్చించి జిల్లా ప్రణాళికలో పొందుపరచనున్నారు. వీటితోపాటు అవకాశాలను బట్టి ఇతర సమస్యలపై కూడా చర్చిస్తారు. మూడు సంవత్సరాల తర్వాత.. మూడు సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్ పాలకవర్గం తెలంగాణ రాష్ట్రంలో సమావేశం కానుంది. 2011 జూలై నుంచి జిల్లా పరిషత్ పాలకవర్గం లేకపోవడంతో సమావేశాలకు అవకాశం లేకుండాపోయింది. ఇటీవల ఎన్నికై న జెడ్పీ పాలకవర్గం కొలువుతీరిన అనంతరం మూడునెలల లోపు ఎప్పుడైనా సమావేశం పె ట్టుకొనే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా ప్రణాళిక రూపొందించేందుకు అత్యవసరంగా సమావేశం కావాల్సి వచ్చింది. ప్రయోగాత్మకం గా మూడున్నర సంవత్సరాల క్రితం రెండు రో జుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసినా, కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నడుమ గొడవతో ఆ సమావేశాలు అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాయి. ఈసారి పూర్తిస్థాయి లో చర్చించి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. సభ్యులు, మంత్రులు హాజరు.. జెడ్పీ సర్వసభ్య సమావేశానికి 57 మంది జెడ్పీటీసీలు, 57 మంది ఎంపీపీలు, ఇద్దరు మంత్రులు సహా 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. డీసీసీబీ, డీసీఎంఎస్, డెయిరీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఆహ్వానితులుగా హాజరవుతారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారక రామారావు హాజరుకానున్నారు.