పాలమూరు రూపురేఖలు మార్చుతాం | change palamuru | Sakshi
Sakshi News home page

పాలమూరు రూపురేఖలు మార్చుతాం

Published Fri, Sep 16 2016 12:21 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

రాజీవ్‌భీమా ఎత్తిపోతల స్టేజ్‌–1, స్టేజ్‌–2 పంప్‌లను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు - Sakshi

రాజీవ్‌భీమా ఎత్తిపోతల స్టేజ్‌–1, స్టేజ్‌–2 పంప్‌లను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

  •  రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
  •  పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
  •  భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు
  •  
    మక్తల్‌: పాలమూరులో వలసలను రూపుమాపుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉందన్నారు. పాలమూరు అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా సరే ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గురువారం మక్తల్‌లో రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకం స్టేజ్‌–1, స్టేజ్‌–2 పంప్‌లతో పాటు గురుకుల పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం వెయ్యి కోట్లతో గోదాములు నిర్మించినట్లు చెప్పారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేస్తుందన్నారు. జిల్లాలోని 18లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సంగంబండ రిజర్వాయర్‌ను పూర్తిచేసి 75వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించి తీరుతామన్నారు. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆగదన్నారు. చంద్రబాబు పల్లకీ మోస్తున్న టీడీపీ నాయకులు నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరును ప్రగతి పథంలో నిలుపుతామని ధీమా వ్యక్తంచేశారు. జిల్లాలోని ప్రతిచెరువుకు నీళ్లు అందిస్తామన్నారు. 
     
    రైతుల సంక్షేమం కోసమే..
    అనంతరం ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువు, కుంటకు నీళ్లు అందించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీచైర్మన్‌ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కె.నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, విఠల్‌రావు ఆర్యా, దేవరి మల్లప్ప, మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ, మక్తల్‌ ఎంపీపీ కోళ్ల పద్మమ్మ, వైస్‌ ఎంపీపీ సునితాగోపాల్‌రెడ్డి, మాగనూర్‌ జెడ్పీటీసీ సరిత, ఆర్డీఓ శ్రీనివాస్, సీఈ ఖగేందర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement