వారంలో పాలమూరు సర్వే
సాక్షి, హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణకు సంబంధించి... గతంలో సమర్పించిన షెడ్యూలుకు అనుగుణంగా వారం రోజుల్లో సర్వే పనులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల పనులు, భూ సేకరణ పురోగతిపై శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి సమీక్షించారు. కోర్టు స్టే ఇవ్వని ప్రాంతాల్లో భూ సేకరణ ప్రక్రియ కొనసాగించాలని.. సర్వే, భూ సేకరణకు సంబంధించి నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పహానీల్లో పేర్లు నమోదైవున్న అసైన్డ్ లబ్దిదారులకు నష్టపరిహారాన్ని చెల్లిం చాలని.. పేర్లు లేని వారి విషయంలో పంచనామా నిర్వహించి పరిహారాన్ని సెటిల్ చేయాలన్నారు.
వేర్వేరు రేషన్, ఆధార్ కార్డులు కలిగి.. వివాహమై ఒకే ఇంట్లో నివసిస్తున్నా.. వారిని వేర్వేరు కుటుంబాలుగా గుర్తించి పరిహారం ఇవ్వాలన్నారు. రిజర్వాయర్ల ఆనకట్ట పరిధిలోకి వచ్చే భూముల సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని.. అదే సమయంలో ఇతర భూ సేకరణ ద్వారా పనులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించే కరివెనరిజర్వాయర్ డిజైన్లు, డ్రాయింగ్‌లకు వారం రోజుల్లో తుది రూపు ఇచ్చి.. పనులు ప్రారంభించాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రోబో శాండ్ వినియోగానికి సంబంధించి నీటి పారుదల శాఖ ఈఎన్‌సీతో పాటు, చీఫ్ ఇంజనీర్ 3 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు.
‘కల్వకుర్తి’ నీటి నిర్వహణపై దృష్టి
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండు, మూడో దశ పంపులు ప్రారంభమైన నేపథ్యంలో నీటి నిర్వహణను సవాలుగా తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించా రు. పథకం ద్వారా ప్రస్తుత సీజన్‌లో 1.6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కాలువలకు గండ్లు కొట్టే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయ ర్లు, నిర్దేశిత ఆయకట్టుకు నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా రెండో పంపును తక్షణమే సిద్ధం చేసుకోవాలన్నారు.
ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలపై తలపెట్టిన నిర్మాణాలను 2017 జూన్‌లోగా పూర్తి చేయాలన్నారు. జీఓ 123కి సంబంధించి పెండింగులో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించాలన్నారు. బీమా ఎత్తిపోతల పథకానికి సంబంధించి జూలైలోనే ఒక పంపు ప్రారంభమైనా... సంగంబండ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రబీ సీజన్‌లో సంగంబండ కింద 30వేల ఎకరాలకు నీరివ్వాలన్నారు.