సాక్షి, అమరావతి: రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ)కు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ నంబర్ 116293)పై ఆమోదముద్ర వేసింది. దీంతో సంస్థ మొదటి బోర్డు సమావేశాన్ని నిర్వహించడానికి ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు చేస్తున్నారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా బ్యాంకులో ఆ సంస్థ పేరుతో ఖాతాను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా తొలి విడతగా రూ.ఐదు కోట్లను అందులో జమ చేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ, జాతీయ ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరిపి.. తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి, వాటికి బడ్జెట్ ద్వారా కేటాయించే నిధులను జత చేసి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రుణాలకు ఆర్ధిక సంస్థలు రెడీ
ప్రాజెక్టులకు అవసరమైన నిధుల్లో 30 శాతాన్ని అంటే రూ.11,994 కోట్లను ప్రభుత్వం తన వాటాగా సమకూర్చుతుంది. మిగిలిన 70 శాతం అంటే రూ.27,986 కోట్లను జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమకూర్చుకోనున్నారు. ఆ మేరకు సంప్రదింపుల నేపథ్యంలో.. రుణాలు ఇచ్చేందుకు పలు సంస్థలు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి.
రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులు
కృష్ణా నదికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపేలా కాలువల వ్యవస్థను అభివృద్ధి చేయడం, అవసరమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వరద జలాలను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళిక కింద రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులను చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే మూడు ప్యాకేజీల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ ఏర్పాటయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment