ఏపీ ఆడించినట్లు ఆడుతోంది!
- కృష్ణా బోర్డుపై గవర్నర్, దత్తాత్రేయలకు హరీశ్ ఫిర్యాదు
- బోర్డును నియంత్రించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి
- రేపు ఢిల్లీకి హరీశ్‌రావు... ఉమా భారతితో భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులపై నియంత్రణ అంశం లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ఆడించినట్లుగా ఆడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్‌లకు మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిగే వరకు ప్రాజెక్టుల నియంత్రణ జోలికి వెళ్లరాదని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులను నోటిఫై చేయాలని కేంద్రానికి బోర్డు సిఫార్సు చేసిందని వారి దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించి.. కృష్ణా బోర్డు తీరును నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు హరీశ్‌రావు శనివారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌లతో కలసి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రాజెక్టుల నియంత్రణ విషయంలో ఇటీవలి పరిణామాలు, చట్టంలో పేర్కొన్న అంశాలను, బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పులను వారికి వివరించారు. విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక.. కృష్ణా బోర్డు కేవలం వాటి నిర్వహణను మాత్రమే చూడాలని స్పష్టంగా ఉందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికి తలొగ్గిన బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు తొందర పడుతోందని వివరించారు. విభజన చట్టంలోని 87(1), 85(8) సబ్ సెక్షన్ల ప్రకారం కృష్ణా బోర్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేయలేదని హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి ఏపీలో అరవై ఏళ్లుగా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే అన్యాయం చేసేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, గవర్నర్‌ల దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించ కుండా కేంద్ర పెద్దలతో మాట్లాడాలని కోరారు.
రేపు ఢిల్లీకి హరీశ్‌రావు: కృష్ణా బోర్డు తీరుపై సీఎం కేసీఆర్ సూచనల మేరకు హరీశ్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో భేటీ కానున్నారు. ఆయన శనివారమే ఢిల్లీ వెళ్లాలని భావించినా.. శని, ఆదివారాల్లో కేంద్ర మంత్రి అందుబాటులో లేని దృష్ట్యా సోమవారం వెళ్లనున్నారు. మంత్రితో పాటు పలువురు ఎంపీలు, శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు ఢిల్లీ వెళ్లి బోర్డు అంశాన్ని వివరించనున్నారు.