సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అందజేసి ప్రాజెక్టు పనులను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ ప్రాజెక్టు పర్యటన ఖరారైంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి పర్యటించనున్నారు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌజ్, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్‌లను పరిశీలించి, ఏరియల్ సర్వే చేయనున్నారు. అక్కడి నుంచి గోలివాడ పంప్‌హౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏరియల్ సర్వే, శాయంపేట ప్యాకేజీ–6, లక్ష్మీపూర్ ప్యాకేజ్–8 పనులను సందర్శించనున్నారు. కాగా.. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రాజెక్టులను సందర్శించి వెళ్లారు. సీఎం పర్యటనతో పనుల్లో వేగం పుంజుకుంది. మూడు షిఫ్టులతో పనులు జోరందుకున్నాయి. దేశంలో ఏ ప్రాజెక్టు పనులు జరగనంత వేగంగా పనులు పూర్తిచేయాలని సంకల్పించారు. సుమారు 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కానుంది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర జలవనరుల కమిటీ (సీడబ్ల్యూసీ) సైతం ప్రాజెక్టులను సందర్శించి వెళ్లింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ ప్రాజెక్టుల సందర్శనకు చేపట్టిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
పకడ్బందీ ఏర్పాట్లు..
రాష్ట్ర గవర్నర్ నరసింహన్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లాలో శనివారం కాళేశ్వరం ప్యాకేజీ–8 పనులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్ గవర్నర్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్లను పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశిం చారు. అంబులెన్స్‌తోపాటు డాక్టర్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. ఫైరింజన్‌ను సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా బారీకేడ్లను ఏర్పాటు చేయాలని ఈఈ ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్ని రకాల ముం దు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చుట్టూపక్కల గ్రామాల ప్రజ లు రావద్దని.. అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ ఇరిగేషన్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాజేశం, ఈఈ ఆర్‌అండ్‌బీ సమాచార శాఖ ఉపసంచాలకులు ఎన్.వెంటేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ వివరాలు
► ఉదయం 7.45 గంటలకు.. : బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి బయలుదేరుతారు.
► ఉదయం 8.30 : కాళేశ్వరానికి చేరుకుంటారు.
► ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు.. : కాళేశ్వరం గుడిని సందర్శిస్తారు.
► 9.30 నుంచి 10 వరకు.. : కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిస్తారు. హెలికాప్టర్‌లో మేడిగడ్డను ఏరియల్ సర్వే చేస్తారు.
► 10.30 నుంచి 11 గంటల వరకు.. : అన్నారం బ్యారేజ్‌ను సందర్శిస్తారు.
► 11.20 నుంచి 12 గంటల వరకు : సుందిల్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌజ్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి గోలివాడ పంప్‌హౌజ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేస్తారు.
► మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు.. : శాయంపేట గ్రామంలోని ప్యాకేజీ–6 అండర్‌గ్రౌండ్ పంప్‌హౌజ్, సర్ట్‌పూల్, టన్నెల్స్‌ను సందర్శిస్తారు.
► మధ్యాహ్నం 3 నుంచి 4.15 వరకు.. : రామడుగు మండలం లక్ష్మీపూర్ ప్యాకేజీ–8 వద్ద ఉన్న అండర్‌గ్రౌండ్ పంప్‌హైజ్, సర్జ్‌పూల్, టన్నెల్స్‌ను సందర్శిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ హెలికాప్టర్‌లో పయనమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment