స్వర్ణోత్సవ వేడుకలో మాట్లాడుతున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్, జస్టిస్ నవీన్‌రావు, అయోధ్యరామారావు తదితరులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జీవితంలో వెలుగు నింపేది విద్యేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. మానవ జీవితానికి పునాది వేసేది పాఠశాలేనని పేర్కొన్నారు. కరీంనగర్‌లో శనివారం జరిగిన వాణినికేతన్ విద్యాసమితి స్వర్ణోత్సవ వేడుకలను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జస్టిస్ నవీన్‌రావుతో కలసి ఆయన ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ.. విద్యావంతులు ఎక్కడికి వెళ్లినా పూజింపబడుతారని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు క్రమశిక్షణ పాటిస్తూ తమ పిల్లలకూ అలవర్చాలని కోరారు. చీకటి నుంచి వెలుగులోకి మన జీవితాన్ని నడిపించేది కేవలం విద్యేనని ఉద్ఘాటించారు. ‘‘పదవులు శాశ్వతం కాదు.. జీవిత విలువలే ముఖ్యం. కుర్చీలు పట్టుకొని వేలాడొద్దు.. అవి ఇప్పుడు ఉండొచ్చు రేపు పోవచ్చు. కానీ వ్యక్తిగత గౌరవం పొందేలా జీవితాన్ని మలచుకోవాలి’’అని ఉద్బోధించారు. విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే గురువులకు నిజమైన సంతోషమన్నారు. విద్యతోనే గౌరవం, క్రమశిక్షణ అలవడుతోందని.. సత్యం వద..« ధర్మం చర అని మా మాస్టారు చెప్పారు.. ఆ మాటలే తనను ఇంతటి స్థాయికి చేర్చిందన్నారు.
హరీశ్ అంటే చాలా ఇష్టం
మంత్రి హరీశ్ అంటే ట్రూత్ అని.. అతనంటే చాలా ఇష్టమని గవర్నర్ చెప్పారు. హరీశ్‌రావు ఎంపీ వినోద్‌తో కలసి తన దగ్గరకు వచ్చి నేను చదివిన పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానించడంతో ఏం ఆలోచించకుండా ఓకే చెప్పానన్నారు. ‘నేను ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి సారిగా బడ్జెట్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఓ టాల్ యువకుడు (హరీశ్) వెనుక బెంచిలో కూర్చున్నాడు. నా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ఒక్కో టేబులు దాటుకుంటూ వస్తున్నాడు. నేను అతడిని గమనించాను.. ఒక్కో టేబుల్ మీద నుంచి జంప్ చేస్తూ వస్తున్న ఆయన కిందపడితే చప్పట్లు కొట్టాలనుకున్నాను.. కానీ నా మీదే పడిపోయాడు.. అప్పటి నుంచి ఆయనంటే ఇష్టం’అని నరసింహన్ వివరించారు. గవర్నర్ తాను చదువుకున్న రోజు నాటి తీపి జ్ఞాపకాలను ఒకసారి నెమరేసుకొన్నారు.
వాణినికేతన్ మాలో మార్పు తెచ్చింది: హరీశ్
మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మనిషి జీవితంలో మార్పు తీసుకొచ్చేది పాఠశాల అని. ఆ మార్పు మాలో తీసుకొచ్చింది వాణినికేతన్ విద్యా సంస్థ అని పేర్కొన్నారు. విద్యతోపాటు వినయం, విజ్ఞానాన్ని, విధేయతను, సంస్కారాన్ని, జీవిత పాఠాలను సైతం నేర్పింది అయోధ్యరామారావు అని చెప్పారు. తమను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకోవడం జీవితంలో మరువలేనిదన్నారు. ప్రస్తుత సమాజంలో ఏ దేశమైనా బాగు పడాలంటే విద్య పాత్ర కీలకమన్నారు.
తమ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు వ్యతిరేకం కాదని, అందరికీ నాణ్యమైన విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తన వ్యక్తి గత జీవితం ప్రారంభమైంది ఈ పాఠశాలలోనేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు అన్నారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మూడేళ్లు చదువుకున్నానని, విలువలతో కూడిన విద్యను, నైతిక విలువలను ఇక్కడే నేర్చుకున్నానని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే, స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్ గంగుల కమలాకర్, వాణినికేతన్ విద్యాసంస్థల అధినేత సీహెచ్ అయోధ్యరామారావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment