కాళేశ్వరం(మంథని): కాళేళ్వరం ప్రాజెక్టుతో బీడు భూములు సస్యశ్యామలమవుతాయని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. శనివారం బేగంపేట విమానాశ్రయం నుంచి జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరానికి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో గవర్నర్ నరసింహన్ ఆయన సతీమణి విమల, మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు.
వీరికి స్పీకర్ మధుసూదనాచారి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, కలెక్టర్ ఆర్‌వీ.కర్ణణ్, ఎస్పీ భాస్కరన్ తదితరులు ఘనస్వాగతం పలికారు.హెలిప్యాడ్ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా కారులో శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పూజలు చేసిన అనంతరం కారులో కన్నెపల్లి(మేడిగడ్డ)పంప్ హౌస్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబ్యిషన్‌ను తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు విశిష్టతను మ్యాప్‌ల సాయంతో గవర్నర్‌కు వివరించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం, మోటార్ల వినియోగం, విద్యుత్ అవసరాలను గవర్నర్‌కు విశ్లేషించి చెప్పారు. అనంతరం వ్యూ పాయింట్ చేరుకుని పనులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పనులు జరుగుతున్న ప్రదేశానికి కారులో చేరుకున్నారు. అక్కడ 20 మీటర్ల ఎత్తులో పనులు జరుగుతుండగా నిచ్చెన ద్వారా పైకి ఎక్కారు. పంప్‌హౌస్ ద్వారా నీటి వినియోగం, రివర్స్ పంపింగ్ విధానం గురించి మంత్రి హరీష్‌రావు, మెగా కంపెనీ ప్రతినిధులు వివరించారు.
మేడిగడ్డ ప్రాజెక్టు ఏరియల్ సర్వే
క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం గవర్నర్ నరసింహన్ హెలిక్యాప్టర్‌లో మేడిగడ్డ ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అన్నారం బ్యారేజీని గవర్నర్ సందర్శించగా అక్కడ జరుగుతున్న పనులను హరీష్‌రావు వివరించారు. గోదావరి, ప్రాణహిత నీటిని వాడుకుని ఇక్కడి నుంచి మళ్లిస్తారని వివరించారు. 90 రోజులకు 180 టీఎంసీల నీటిని బ్యారేజీ ద్వారా వాడుకోవచ్చని గవర్నర్‌కు తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంక్రీట్ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.అక్కడి నుంచి తిరిగి హెలిక్యాప్టర్‌తో పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీకి బయలుదేరి వెళ్లారు.ఆయన వెంట ఇరిగేషన్ సీఎస్ ఎస్‌కే.జోషి, కాళేశ్వరం బ్యారేజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు, కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్, ఎస్పీ భాస్కరన్, ఇరిగేషన్ ఇంజనీర్లు ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈలు మల్లికార్జునప్రసాద్, డీఈఈలు ప్రకాష్, యాదగిరి, సతీష్ పాల్గొన్నారు.
శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడి సన్నిధిలో గవర్నర్ దంపతులు
కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర ఆలయాలన్ని గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్–విమల దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి గర్భగుడిలో గణపతి, మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకాలు చేశారు. గవర్నర్ దంపతులను మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ శాలువాతో సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అక్కడ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గవర్నర్‌కు మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, మాధవి, వసంత, హసీనభాను, చల్లా నారాయణరెడ్డి పాల్గొన్నారు.
శభాష్.. హరీష్..
కాళేశ్వరం బ్యారేజీలోని కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించిన అనంతరం గవర్నర్ నరసింహన్ ఆనందం వ్యక్తం చేశారు. శభాష్ హరీష్... వెరీ గుడ్ అంటూ ఆయన మంత్రి హరీష్‌రావుకు కితాబిచ్చారు. పంప్‌హౌస్ పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు విశిష్టతను క్షుణ్ణంగా వివరించడంతో నరసింహన్ ఫిదా అయి మంత్రిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment