
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ముమ్మాటికీ బీజేపీతో కలిసి లాలూచీ రాజకీయాలు నడుపుతోందని, ఆ పార్టీ కనుసన్నల్లోనే చంద్రబాబు నడుస్తున్నారనడంలో సందేహం లేదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన బుధవారం విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధానితో వ్యవహరించిన తీరు తీరు ఇందుకు నిదర్శనమన్నారు. ఆ సమావేశంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కనీసం నిరసన తెలియజేయలేదని, అక్కడ ఏం మాట్లాడారో మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రజలను సీఎం మరోసారి వంచించినట్టేనన్నారు.
చంద్రబాబు వంచనలకు నిరసనగా, విభజన చట్టంలో హామీల అమలు కోరుతూ ఈ నెల 30న అనంతపురంలో వంచనపై నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఈ దీక్షకు పదవులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు సహా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరవుతారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల అప్పులు పెరిగాయని, తలసరి ఆదాయంకంటే అప్పులే ఎక్కువయ్యాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండానే వాటిని తాకట్టు పెట్టి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సీఎంకు బీసీలంటే చులకనని, నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానని, గతంలో మత్స్యకారుల తోలుతీస్తానని నోరు పారేసుకోవడం ఇందుకు తార్కాణమని చెప్పారు.
15 రోజుల్లో పదవి ముగుస్తుందనగా పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం పెద్ద డ్రామాగా అభివర్ణించారు. ఎన్డీయే నుంచి టీడీపీ మార్చిలో బయటకు రాగా ఇన్నాళ్లూ పరకాల ఎందుకు ఆ పదవిలో కొనసాగారని ప్రశ్నించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రస్తావించగా.. ఆ విషయం ఆయన్నే అడగండని బదులిచ్చారు. విశాఖ భూకుంభకోణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, దీనిపై వేసిన సిట్ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment