
సాక్షి, కర్నూలు: అధికార పార్టీపై నానా యాగీ చేస్తున్న విపక్ష నేతలు.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమరంపై కర్నూలు పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసిన టీడీపీ నేతలు రోజుకో పంచాయతీని తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. నందికొట్కూర్ వైఎస్సార్‌సీపీ విభేదాలపై స్పందించిన మంత్రి .. పంచాయతీ ఎన్నికల్లో టికెట్ల కోసం వైఎస్సార్‌సీపీ నేతల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు సహజమేనని పేర్కొన్నారు.
ఇది తమ అంతర్గత వ్యవహారమని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షానికి లబ్ధి చేకూరే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వమని స్పష్టం చేశారు. ఎంపీటీసీలు ఏకగ్రీవమైన ప్రాంతాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది దారుణమని, అసంబద్ధమని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థి చనిపోతే ఎన్నికల కమిషనర్ సంఘటన స్థలానికి వెళ్లడం అనేది మొదటిసారిగా చూస్తున్నానన్నారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే సునీల్ గవాస్కర్ ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు పరిస్థితి గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment