సాక్షి, అమరావతి: చిన్న పనే చేయలేక చేతులెత్తేసిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థకు పెద్ద పనిని అప్పగించడం ద్వారా అక్రమాలకు తెరలేపిన సర్కారు.. అధికారులపై ఒత్తిడి తెచ్చి చేయని పనులకు రూ. 11.67 కోట్లను అక్రమంగా బిల్లులు చెల్లించింది. ఈ అక్రమాలకు వెలిగొండ ప్రాజెక్టు వేదికగా మారింది. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్, మొదటి సొరంగంలో 150 మీటర్లు, రెండో సొరంగంలో 108 మీటర్ల పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించకుండానే రూ.91.52 కోట్ల విలువైన పనులను సింగిల్ బిడ్ దాఖలైన టెండర్లను గతేడాది ఆగస్టు 9న శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా సంస్థకు ఖరారు చేశారు. అయితే హంద్రీ–నీవాలో మూడు మీటర్ల వ్యాసార్థంతో కూడిన చిన్న సొరంగం పనులే చేయలేని సంస్థకు వెలిగొండ ప్రాజెక్టులో 9.2 మీటర్ల వ్యాసార్థంతో భారీ సొరంగం తవ్వకం పనులను అప్పగించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ హైపవర్ కమిటీ సమావేశంలో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలకు తాను బాధ్యత వహించలేనని, హైపవర్ కమిటీ నుంచి తనను తప్పించాలంటూ సర్కార్‌కు ప్రతిపాదించడం అప్పట్లో సంచలనం రేపింది. అయినా సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా ఒత్తిళ్లతో ఆ పనులు శ్రీనివాసరెడ్డికే దక్కాయి.
సొరంగం తవ్వకుండానే బిల్లులు: వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన సొరంగాలు తవ్వాలన్నా.. హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించాలన్నా శ్రీశైలం రిజర్వాయర్ మీదుగా పడవపై కొల్లంవాగుకు చేరుకోవాలి. యంత్ర సామాగ్రిని అక్కడికి తరలించాలంటే భారీ పడవలు అవసరం. కానీ.. భారీ పడవలు లేకుండానే యంత్రాలను తరలించకుండానే చేయని పనులను చేసినట్లుగా మాయాజాలం చేశారు. సొరంగాల తవ్వకం, హెడ్ రెగ్యులేటర్ పనుల పునాదుల కోసం 31,312 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1,87,645 క్యూబిక్ మీటర్ల రాతి తవ్వకం పనులు పూర్తి చేసినట్లు చూపి రూ.11.67 కోట్లను చెల్లించేశారు. కానీ.. వీటిని ఎం–బుక్‌లో రికార్డు చేయలేదు. సొరంగం పనులు ఎన్ని మీటర్లు, ఎంత ఎత్తులో చేశారన్న లెక్కలు కూడా తీయలేదు. ఎం–బుక్‌లో రికార్డు చేయకుండా పీఏవో(పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్) బిల్లులు చెల్లించరు. కానీ.. ఉన్నతస్థాయి ఒత్తిడి రావడంతో నిబంధనలకు విరుద్ధంగా పీఏవో బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది.
కోటరీ కాంట్రాక్టు సంస్థ ఫిర్యాదుతో..
శ్రీనివాసరెడ్డి సంస్థకు కట్టబెట్టిన పనుల కోసం సీఎం కోటరీలోని ఎంపీకి చెందిన కాంట్రాక్టు సంస్థ పోటీ పడింది. కానీ సీఎం సూచనల మేరకు ఆ తర్వాత వెనక్కు తగ్గింది. వెలిగొండ సొరంగాల పనుల కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి.. మిగిలిన పనులకు తాజాగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పనులపై కన్నేసిన ఎంపీ సంస్థ ప్రతినిధులు ఇటీవల వెలిగొండ సీఈ జబ్బార్‌తో సమావేశమైనట్లు తెలిసింది. ఆ తర్వాత శ్రీశైలం జలాశయం మీదుగా కొల్లంవాగు వద్దకు వెళ్లి సొరంగాలను పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి సంస్థకు పనులు అప్పగించి ఆర్నెళ్లయినా పనులు ప్రారంభించలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన సీఈ జబ్బార్ అధికారులను ఆరా తీయగా రూ.11.67 కోట్ల విలువైన పనులను చేసినట్లు ఈఈ వివరించారు. ఆ సంస్థ పనులే ప్రారంభించలేదు కదా.. బిల్లులు ఎలా చెల్లిస్తారని సీఈ జబ్బార్ నిలదీయడంతో అసలు విషయం బయటపడిందని అధికారవర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ నుంచి సాంకేతిక అనుమతి లేకుండా ప్రారంభించిన సన్నాహక పనులకు మరో రూ.13.27 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇంతలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రంగంలో దిగడంతో విచారణ అటకెక్కినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై వెలిగొండ ఎస్‌ఈ రెడ్డెయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే బిల్లులు చెల్లించామని చెప్పారు. చేసిన పనులకే బిల్లులు చెల్లించామన్నారు. పనులకు సీడీవో సీఈ నుంచి అనుమతి రానిమాట వాస్తవమేనని వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారులకు తెలియకుండా తామేమీ నిర్ణయాలు తీసుకోలేదని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment