కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం.. అడ్డగోలుగా అంచనాలు పెంచేయడం.. పెంచిన నిధులను పంచుకుతినడం..
- బినామీలకు రూ.224 కోట్లు కట్టబెట్టేందుకు సిద్ధం
- పోలవరం ఎడమ కాలువ పనుల్లో అంతులేని అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం.. అడ్డగోలుగా అంచనాలు పెంచేయడం.. పెంచిన నిధులను పంచుకుతినడం.. ఇదీ సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో సాగుతోన్న అవినీతి దందా! పోలవరం ఎడమ కాలువ పనుల్లోనూ ఇదే జరుగుతోంది. వరాహ నదిపై వయాడెక్టు నిర్మాణం అంచనా వ్యయాన్ని ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 13 రెట్లు పెంచేశారు. రూ.17 కోట్ల నుంచి రూ.224 కోట్లకు పెంచడంపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తంచేసినా బేఖాతరు చేశారు. కీలక మంత్రి అండతో కాంట్రాక్టరుకు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 181.50 కి.మీల పొడవున 85.50 మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల లోతుతో 17,561 క్యూసెక్కులను తరలించేలా ఎడమ కాలువ తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎనిమిది ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇందులో 136 కి.మీ నుంచి 162.409 కి.మీ వరకూ రూ.175 కోట్ల విలువైన 26.40 కిలోమీటర్ల కాలువ తవ్వకం పనులను బాబు బినామీలకు కట్టబెట్టారు. ఏడో ప్యాకేజీ కింద ఈ పనులను దక్కించుకున్న కేసీఎల్-జేసీసీజీ(జాయింట్ వెంచర్) ఇప్పటివరకూ రూ.65 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. కానీ విశాఖపట్నం జిల్లా యల మంచిలి మండలంలో 138.75 కి.మీ.వద్ద వరాహ నదిపై 1.214 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన నిర్మాణం పనులు ఇప్పటిదాకా ప్రారంభించలేదు.