ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. అందులో భాగంగానే అసెంబ్లీలో కాంగ్రెస్ నాటకాలు ఆడిందని మండిపడ్డారు. విప్ గొంగిడి సునీతతో కలసి ఆయన మాట్లాడారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రవర్తించిందని విమర్శిం చారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని అడ్డుకో వడం కాంగ్రెస్ నేతల వల్ల కాదని, రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పుట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పారిపోయింది: శ్రీనివాస్ గౌడ్, బాలరాజు
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతంతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కరెంటు, విత్తనాలు, ఎరువుల పరిస్థితిని మెరుగు పర్చడం రైతు సంక్షేమం కాదా అని నిలదీశారు. మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలసి మాట్లాడారు.
అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ పారిపోయిందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరైనా ఒకరు రాజీనామా చేసి గెలవాలని, గెలిస్తే దేనికైనా తాము సిద్ధమే అని సవాలు విసిరారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను అడ్డుకోవడమంటే సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమేనని ఆయన చెప్పారు.