రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దు
కాంగ్రెస్‌పై మంత్రి ఈటల రాజేందర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘ కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో రైతుల సంక్షే మాన్ని అమలు చేస్తున్నాం. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ రైతుల సంక్షేమంలో భాగమే. ప్రాజెక్టులు పూర్తయితే తమకు భవిష్యత్ ఉండదనే దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెబెట్టేట్టు వ్యవహరిస్తున్నారు..’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం సహచర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు.
రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దని కాంగ్రెస్‌కు హితవు పలికారు. కాంగ్రెస్, టీడీపీల ప్రభుత్వాలు రైతులకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. స్వల్ప కాలంలోనే కోతల్లేని నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతుల మన్ననలు పొందామని తెలిపారు. అదే ఉత్సాహంతో సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం రైతుల కోసం వినూత్న పథకాలతో ముందుకు వెళుతోందని పోచారం అన్నారు. తమ ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కాళ్ల కింద భూమి కదలుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మా భూమి – మా పంట ’పేరిట భూములపై త్వరలో సమగ్ర సర్వే చేయనున్నామని చెప్పారు.