సాక్షి, ఖమ్మం: నీటిపారుదల శాఖల పునర్వ్యవస్థీకరణ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖలైన ఎన్నెస్పీ, ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, ఐడీసీ, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జలవనరుల శాఖగా మార్చేందుకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని వనరులు, ఆయకట్టు, నియోజకవర్గాల పరిధిని పరిగణనలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. రీ ఆర్గనైజేషన్ కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయకట్టు, ప్రస్తుతం ఉన్న పోస్టులు, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి సమగ్ర సమాచారం తెప్పించుకొని దాని ఆధారంగా రీ ఆర్గనైజేషన్‌లో తీసుకున్న నియమ నిబంధనల ప్రకారంఅమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆమోదం పొందే విధంగా పనులు సాగిస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సాగులో ఉన్న ఆయకట్టు, ప్రతి నియోజకవర్గాన్ని హద్దుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో ఈఈ పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాని పరిధిలో 25వేల ఎకరాల వరకు ఒక డీఈ స్థాయి అధికారిని నియమించే విధంగా రూపకల్పన చేశారు. శాఖలన్నింటినీ ఏకం చేసిన తర్వాత ఇంజనీర్లను కేటాయిస్తారు. ఎన్నెస్పీ, ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టు, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీటి పర్యవేక్షణ వారే చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కేంద్రంగా ఒక సీఈ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎస్‌ఈలు, ఈఈ, డీఈలు, ఏఈలను కేటాయించే విధంగా ప్రతిపాదించినట్లు సమాచారం. తాజాగా రెండు సీఈ పోస్టులను ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా పరిధికి ఒక సీఈ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధికి ఒక సీఈని కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. అనధికారికంగా మరికొంత ఉంది. ఆ ప్రకారం ఇంజనీర్ పోస్టులను కేటాయించే విధంగా కసరత్తు సాగుతోంది.
గతంలో ఉన్న పోస్టులు ఇలా..
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ఇరిగేషన్ శాఖల పరిధిలో ఒక సీఈ, మూడు ఎస్‌ఈ, 12 మంది ఈఈలు కొనసాగుతున్నారు. ఇరిగేషన్ శాఖలో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ఒక సీఈ, ఇద్దరు ఎస్‌ఈ, ఎన్నెస్పీలో ఒక ఎస్‌ఈ, ముగ్గురు ఈఈలు, ఐడీసీలో ఒక ఈఈ, మిగిలిన ఈఈలు దుమ్ముగూడెం, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 8 మంది కొనసాగుతున్నారు.
ఒకే పరిధిలోకి వస్తే..
ఇరిగేషన్‌లోని అన్ని శాఖలు ఒకే పరిధిలోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోస్టులను కేటాయిస్తారు. రెండు సీఈ, నాలుగు ఎస్‌ఈ, లక్ష ఎకరాల ఆయకట్టుకు, నియోజకవర్గ పరిధికి ఒక ఈఈ, 25వేల ఎకరాల ఆయకట్టుకు ఒక డీఈని కేటాయించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment