రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకింద భూసేకరణ ప్రక్రియ నిలిచిపోవడంతో నిర్మాణ పనులకు తీవ్ర ఆటకం కలుగుతోంది.
నాలుగు నెలలుగా నిలిచిన ప్రక్రియ
ఇంకా కావాల్సిన భూమి 90 వేల ఎకరాల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకింద భూసేకరణ ప్రక్రియ నిలిచిపోవడంతో నిర్మాణ పనులకు తీవ్ర ఆటకం కలుగుతోంది. భూసమస్యకు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 123ని తెరపైకి తెచ్చినా దానికి నిర్వాసితులు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకతకు తోడు హైకోర్టు సైతం స్టే ఇవ్వడంతో నాలుగు నెలలుగా భూసేకరణ ప్రక్రియ ఎక్కడిక్కడ నిలిచిపోయింది.
ఇంకా వివిధ ప్రాజెక్టుల పరిధిలో సుమారు 90వేల ఎకరాల మేర భూసేకరణ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపనున్న భూసేకరణ సవరణ చట్టంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీనికి సంబంధించిన బిల్లు చట్టంగా మారితేనే మిగిలిన భూసేకరణ సాధ్యంకానుంది. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు మొత్తంగా 3,67,218.03 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు మొత్తంగా 2,77,409.23 ఎకరాలు సేకరించారు. మరో 89,808.80 ఎకరాలు సేకరించాల్సిఉంది.
ప్రధాన ప్రాజెక్టులకు ఎంత?...
ప్రధాన ప్రాజెక్టుల పరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 35,729 ఎకరాలు, పాలమూరు కింద 12,445 ఎకరాలు, ప్రాణహిత కింద 4,505 ఎకరాలు, దేవాదుల కింద 5,642 ఎకరాల మేర సేకరించాల్సి ఉంది. అయితే 2013–కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే మార్కెట్ విలువ నిర్ణయించడం, గ్రామసభల ఆమోదం తీసుకోవడం, ప్రభావితం అయ్యే కుటుంబాలకు రూ.5లక్షల వరకు పరిహారం, చేతి వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఏకమొత్తంగా పరిహారం ఇవ్వాల్సి రావడం.., ఈ మొత్తం అంశాలను కొలిక్కి తెచ్చేందుకు సుమారు 6 నుంచి 8 నెలల సమయం పట్టనుండటంతో ప్రభుత్వం జీవో 123తో సేకరణ చేస్తూ వచ్చింది.
అయితే ఈ ఏడాది జనవరిలో జీవో 123పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్ర భూసేకరణ బిల్లును తెచ్చినా, కేంద్రం మరిన్ని సవరణలు సూచించడంతో అది తిరిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న సవరణలతో కూడిన బిల్లును రాష్ట్ర శాసనభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారాకే మిగతా భూసేకరణ చేపట్టే అవకాశాలున్నాయి.