ఏ చట్టంలో ఏముంది? | HC bars Telangana govt from acquiring land under GO 123 | Sakshi
Sakshi News home page

ఏ చట్టంలో ఏముంది?

Published Fri, Jan 6 2017 4:01 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

ఏ చట్టంలో ఏముంది? - Sakshi

ఏ చట్టంలో ఏముంది?

 భూసేకరణ అంశంపై రాష్ట్రంలో జగడాలు
కేంద్ర చట్టం.. 123 జీవో..కొత్త సవరణ చట్టం
వాటిల్లోని అంశాలేమిటి?.. బాధితులకు దేనితో ప్రయోజనం?
123 జీవోపై హైకోర్టు స్టేతో తెరపైకి వివాదాలు  


రాష్ట్రంలో భూసేకరణ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 123 జీవో ద్వారా భూముల సేకరణను నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మరోవైపు కేంద్రం అమల్లోకి తెచ్చిన భూసేకరణ చట్టం–2013కు సవరణలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర భూసేకరణ సవరణ బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం పొందాక ఈ చట్టం అమల్లోకి రానుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి వచ్చాకే భూసేకరణ చేపట్టే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 123 జీవోలో ఏముంది? కేంద్ర చట్టం ఏం చెబుతోంది? కొత్తగా రూపొందించిన రాష్ట్ర చట్టంలో ఏయే అంశాలున్నాయి?.. వీటిల్లో నిర్వాసితులకు ఏది ప్రయోజనకరం అనేది ఆసక్తి రేపుతోంది. ఈ అంశాలను పరిశీలిస్తే...    – సాక్షి, హైదరాబాద్‌

జీవో 123
ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123ను జారీ చేసింది. దీని ప్రకారం... ప్రజోపయోగ పనులకు సేకరించే భూములకు, ఆస్తులకు సంబంధించి సదరు యజమానులతో ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ నిర్వాసితులతో నేరుగా బేరసారాలు జరిపి సహేతుకమైన ధర చెల్లించే ఒప్పందం చేసుకుంటుంది.

తమ భూములు, ఆస్తులు, తన జీవనాధారపు నష్ట పరిహారం, పునరావాసం, పునరాశ్రయానికి కావాల్సిన ఖర్చులన్నీ కలిపి పరిహారం పొందినట్లుగా నిర్వాసితులు సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

కమిటీ సమక్షంలో జరిగిన తుది నిర్ణయం పై భవిష్యత్తులో తమకెలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్‌ సమర్పించాలి. దీంతో నిర్వాసితులకు చెందిన భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానికి ధారాదత్తం అవుతాయి.

అఫిడవిట్లు సమర్పించిన భూముల యజమానుల వివరాలతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అభ్యంతరాలకు కేవలం 15 రోజుల గడువిస్తుంది. అయితే మరింత వేగంగా భూసేకరణ ప్రక్రియను చేపట్టేందుకు ఈ వ్యవధిని వారం రోజులకు కుదిస్తూ 2015 అక్టోబర్‌ 7న మరో జీవో జారీ అయింది.

సహేతుకమైన ధర ఖరారు ప్రక్రియలో పునరావాసం, పునరాశ్రయం అనే పదాలను తొలగిస్తూ అదే ఏడాది నవంబర్‌ 28న మరో జీవో జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర భూసేకరణ (సవరణ) బిల్లు–2016
కేంద్ర భూసేకరణ చట్టం–2013లోని కీలక అంశాలకు సవరణలు చేసి.. ఇంచుమించుగా 123 జీవోలోని అంశాలతోనే దీనినీ రూపొందించారు. ప్రభావిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం కంటే ఎక్కువ ఇచ్చేందుకు, దాని కంటే మెరుగైన పునరావాసం, పునః పరిష్కారం చేసేందుకు రాష్ట్రానికి హక్కు ఉంది. 2013 చట్టంలోని 107వ ఆర్టికల్‌ ఈ అధికారాన్ని కల్పించింది. దాని ప్రకారమే బిల్లును ప్రవేశపెట్టారు.

ప్రజాప్రయోజనం దృష్ట్యా చేపట్టే నీటిపారుదల, విద్యుదీకరణ, గృహ నిర్మాణ ప్రాజెక్టుల భూసేకరణకు నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది.

2013 చట్టంలోని సామాజిక ప్రభావం, ప్రజా ప్రయోజన నిర్ధారణకు చేపట్టే ప్రాథమిక విచారణ అధ్యాయాన్ని తొలగించారు. దీంతో సామాజిక ప్రభావ మదింపు, పరిశోధన లేకుండానే భూసేకరణ చేపట్టే అధికారం రాష్ట్రం సొంతమవుతుంది.

ఆహార భద్రత ప్రయోజనాల పరిరక్షణ కోసం 2013 చట్టంలో నిర్దేశించిన మూడో అధ్యాయాన్ని తొలగించారు. మూడో అధ్యాయం ప్రకారం.. ఏటా రెండు లేదా అంతకు మించి పంటలు సాగు చేసే భూములను సేకరించకూడదు. అసాధారణ పరిస్థితుల్లో సేకరించాల్సి వస్తే అంతే విస్తీర్ణంలో వ్యవసాయ భూములను అభివృద్ధి చేయాలి. కానీ ఈ అధ్యాయాన్ని సవరణలో మొత్తంగా తొలగించారు.

ప్రభుత్వం ప్రజాప్రయోజనాలకు చేపట్టే భూసేకరణకు ఆ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్‌ భూ యజమానితో సంప్రదింపులు జరిపి, వారి సమ్మతితో అమ్మకం ధర ఖరారు చేసుకుంటారు. దాని ప్రకారం ఉత్తర్వులిచ్చి గెజిట్‌ జారీ చేస్తారు. దాంతో నిర్వాసిత భూ యజమానుల హక్కులు ప్రభుత్వానికి ధారాదత్తం అవుతాయి. ఆ భూములు ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్‌ అవుతాయి.

ఖరారు చేసుకున్న ధర ప్రకారం సహాయ పునరావాస, పరిహార మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి.

నిర్వాసితులకు అక్రమంగా డబ్బు చెల్లించినట్లు గుర్తిస్తే భూమి శిస్తు తరహాలో తిరిగి వసూలు చేసుకుంటారు.

కేంద్ర భూసేకరణ చట్టం–2013
భూసేకరణకు సంబంధించి ఈ చట్టం ఎన్నో నిబంధనలను ఏర్పరిచింది. దీని ప్రకారం... ముందుగా భూసేకరణ చేపట్టే ప్రాంతాలకు నోటిఫికేషన్‌ జారీ చేయాలి. గ్రామ సభలు నిర్వహించి, అక్కడి ప్రజలకు తెలియజెప్పాలి. ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసి.. నిర్వాసితుల గుర్తింపు, పునరావాస అంచనా పథకం తయారీ, గ్రామసభల్లో బహిరంగ విచారణ, అభ్యంతరాల స్వీకరణ, డిక్లరేషన్‌ ప్రచురణ, నోటీసుల జారీ, కలెక్టర్‌ ఆధ్వర్యంలో తుది అవార్డు ప్రకటన ప్రక్రియలు చేపట్టాలి. అభ్యంతరాలకు 60 రోజుల గడువు ఇవ్వాలి.

పరిహారం చెల్లింపునకు రిజిస్ట్రేషన్‌ క్రయ విక్రయాల ధర, లేదా సమీప గ్రామాల్లో ఉన్న భూముల అమ్మకాల సగటు అమ్మకపు విలువను పరిగణనలోకి తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో అదే రేటు ప్రకారం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో రెండింతలు ఇవ్వాలి.

భూమి లేదా భవనానికి అనుబంధంగా ఉన్న ఆస్తుల విలువను లెక్కించాలి. భూమిలో ఉన్న పంటలు, మొక్కలు చెట్లు కోల్పోతే యజమానికి జరిగే నష్టం, ఇతర స్థిర చరాస్తులకు వాటిల్లే నష్టం, వ్యాపారానికి కలిగే నష్టం కూడా జత చేయాలి.

చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని నిర్ధారించాక.. ఆ పరిహారానికి వంద శాతం అదనపు మొత్తం ‘సొలీషియం’గా కలిపి తుది అవార్డును నిర్ణయించాలి.

నిర్వాసితులకు ఇందిరా ఆవాస్‌ యోజన ప్రమాణాల మేరకు ఇంటిని నిర్మించి ఇవ్వాలి. లేదంటే ఇంటికయ్యే వ్యయం చెల్లించాలి.

భూసేకరణతో భూమి లేకుండా పోయిన కుటుంబాలకు ఆ ప్రాంతంలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టు ఆయకట్టులో కనీసం ఒక్కో ఎకరం సాగు భూమి ఇవ్వాలి.

ప్రాజెక్టుల వల్ల ఉద్యోగాలు కల్పించబడితే బాధితకు టుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం, లేదా ప్ర తి బాధిత కుటుంబానికి ఒకే దఫా రూ.5 లక్షలు చెల్లిం పు, లేదా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.2 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వార్షిక చెల్లింపులు చేయాలి.

నిర్వాసితులైన ప్రతి కుటుంబానికి అవార్డు ప్రకటించిన తేదీ నుంచి ఏడాది పాటు నెలకు కనీసం రూ.3 వేల లెక్కన నెలసరి జీవన మనుగడ వేతనం చెల్లించాలి.

బాధిత కుటుంబాన్ని, భవన సామగ్రిని, ఇతర వస్తువులను, పశువులను తరలించుకునేందుకు రవాణా ఖర్చులుగా ఒకే దఫాగా రూ.50 వేల ఆర్థిక సాయం.

పశువుల కొట్టాలు, చిన్న చిన్న దుకాణాలను వేరేచోట నిర్మించుకునేందుకు రూ.25 వేలకు తక్కువ కాకుండా నోటిఫికేషన్‌ జారీ చేసి బాధితులకు చెల్లించాలి.

వృత్తి పనివారు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి కలిగిన వారు నిర్వాసితులైతే ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 వేలకు తక్కువ కాకుండా చెల్లించాలి.

సాగునీటి, జల విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వాసిత కుటుంబాలకు రిజర్వాయర్లలో చేపలు పట్టుకోవడానికి హక్కులు కల్పించాలి.

ప్రతి బాధిత కుటుంబానికి ఒకే దఫా ‘రీసెటిల్‌మెంట్‌ వేతనం‘గా రూ.50 వేలు చెల్లించాలి.

నిర్వాసితులు వేరేచోట పునరావాసం పొందడానికి వీలుగా కనీస మౌలిక సౌకర్యాలను కల్పించే బాధ్యత సదరు సంస్థదే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement