123 జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పట్ల ఉద్యమకారుల హర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కోసం 123 జీవో కింద జరుగుతున్న భూ సేకరణ చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఉద్యమకారులు హర్షాతిరేకాలు ప్రకటించారు. ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసినా హైకోర్టు తమ గోడు వినిపించుకొని జీవితాలను నిలబెట్టిందని కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్నసాగర్, జహీరాబాద్ మహిళలు, మహబూబ్‌నగర్ రైతులు, కూలీల విజయంగా దీన్ని ఉద్యమకారులు కొనియాడారు. 9 నెలలుగా సాగుతున్న తమ ఉద్యమానికి హైకోర్టు ఉత్తర్వులు నూతనోత్తేజాన్ని ఇచ్చాయన్నారు. ప్రజాపోరాటాలెప్పుడూ వృ«థాకావని హైకోర్టు ఉత్తర్వులు నిరూపించాయని పేర్కొన్నారు.
పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టం ఉండగా ఒకే ఒక్క జీవోతో రైతుల బతుకులను బుగ్గిపాలు చేయాలని చూసినా కోర్టు తమకు అండగా నిలిచిందని మల్లన్న సాగర్ ఉద్యమకారులు స్పష్టం చేశారు. వేములగట్టు లో 215 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని, కోర్టు ఆసరాతో రైతాంగం ఆనందంగా ఉన్నదని ఉద్యమకారులు తెలిపారు. ఎందరో రైతులు ఇప్పటికే 123 జీవో కింద భూములు అప్పజెప్పారని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తెలంగాణ రైతాంగంపట్ల సానుకూల వైఖరిని అవలంబించాలని వారు కోరారు. తక్షణమే 123 జీవో ప్రకారం భూముల సేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతుల దగ్గర తీసుకున్న భూముల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు తదుపరి ఉత్తర్వులపై ఆశాభావం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగారు 2013 చట్టం పనికిమాలినదన్నారు. హైకోర్టు 123 జీవో ద్వారా భూసేకరణ చెల్లదని స్పష్టం చేసింది. ఏది కరెక్టో తేల్చుకోవాల్సింది ప్రజలే. మార్కెట్ వాల్యూతో 2013 చట్టం ద్వారానే భూసేకరణ చేయాలి. భూమి నుంచి రైతులను, కూలీలను, చేతి వృత్తులవారిని వేరుచేయొద్దు. ఓట్లు వేయించుకొని గెలిచినవారు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే, కోర్టులు మా మొర ఆలకించాయి. మాకు న్యాయం చేశాయి. చేస్తాయన్న నమ్మకం మాకుంది.
– ఎండీ హయత్ ఉద్దీన్, వేములగట్టు, మల్లన్న సాగర్ నిర్వాసిత ఉద్యమకారుడు.
ప్రభుత్వం ఇకనైనా బలవంతపు భూసేకరణను ఆపివేయాలి. ప్రభుత్వం రైతుల్ని కాదన్నా కోర్టు ఆదుకుంది. పాత దాని కంటే కొత్తది ఎప్పుడైనా అభివృద్ధికరంగానే ఉండాలి. కానీ మన తెలంగాణలో చట్టం కన్నా జీవోకి బలమెక్కువని భావించారు. అది తప్పని కోర్టు రుజువు చేసింది.
– కె.వి. అమరేందర్ రెడ్డి, వేములగట్టు, మల్లన్నసాగర్ నిర్వాసిత ఉద్యమకారుడు.
తెలంగాణలో దాదాపు 72 ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణ చేస్తున్నారు. అన్ని చోట్లా ప్రజలు ప్రతిఘటించారు. బలవంతంగా భూములు తీసుకున్న చోటఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వలేదు. 123 జీవోకి చట్టబద్ధత లేదు. పార్లమెంటు చేసిన చట్టాన్ని కాలదన్ని లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకుంటోంది. భూముల నుంచి రైతులను, కూలీలను తరిమికొట్టడం అన్యాయం. అదే విషయం కోర్టు స్పష్టం చేసింది. ఇది వివిధ రకాల క్షేత్ర స్థాయి పోరాటాల వల్ల ప్రజలు సాధించిన విజయం. దీనికి న్యాయపోరాటం తోడైంది. 2016 బిల్లు కూడా నిలబడదని స్పష్టం అయింది. 123 జీవోని వ్యతిరేకిస్తున్నారు కనుక కొత్త చట్టం తెచ్చారు. అంతే!
– ఆశాలత, రైతు స్వరాజ్య వేదిక
ఇప్పటికే 123 జీవో ద్వారా సేకరించిన భూముల రైతులకు న్యాయం చేయాలి. 2013 చట్టాన్ని వారికి అన్వయించాలి. ప్రభుత్వం ప్రజలను మోసగించడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం అసాధ్యం.
– కె.వి. లక్ష్మారెడ్డి, వేములగట్టు.
ఇది ప్రజావిజయం
Published Fri, Jan 6 2017 4:17 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement