‘సాగునీటి’ టెండర్లలో భారీ అక్రమాలు
విచారణకు సభాసంఘం ఏర్పాటు చేయాలి: ఉత్తమ్
⇒ కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్
⇒ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేస్తున్నారు
⇒ వృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తున్నారు
⇒ వాయిదాల్లో రుణమాఫీతో రైతులకు అందని రుణాలు
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, వాటికి కేటాయింపులు చూస్తుంటే కాంట్రాక్టర్ల కోసమే వాటిని చేపడుతున్నారా అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానిం చింది. సోమవారం శాసనసభలో ద్యవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. వాటర్‌గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలపై సభాసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అప్పుల తెలంగాణ చేస్తున్నారు
రాష్ట్రం ఏర్పాటయ్యాక కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నారని.. మూడేళ్లలో అప్పులు రూ.లక్ష కోట్లు దాటాయని ఉత్తమ్ పేర్కొ న్నారు. ఇవేగాక కార్పొరేషన్ల పేరిట చేస్తున్న అప్పులు రూ.31 వేల కోట్లు, డిస్కంల అప్పు రూ.9 వేల కోట్లు అదనమని.. ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని అభివర్ణించారు. గత బడ్జెట్‌లో రూ.4,404 కోట్లు మిగులు చూపించారని, వాస్తవానికి రూ.238 కోట్లు లోటు ఉందని పేర్కొన్నారు. జీఎస్‌డీపీ వృద్ధిని కూడా ఎక్కువ చేసి చూపించారని విమర్శించారు.
ఆవేదనలో రాష్ట్ర రైతులు
రుణమాఫీని వాయిదాల రూపంలో చెల్లిం చడంతో రైతులకు బ్యాంకులు తక్కువగా రుణాలు ఇచ్చాయని.. వడ్డీ భారాన్ని ప్రభుత్వం రైతులపైనే వేసిందని ఉత్తమ్ విమర్శించారు. కేంద్రం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు పైసా ఇవ్వలే దన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి 2013–14లో 107 లక్షల టన్నులుంటే.. 2015–16 నాటికి 51 లక్షల టన్నులకు పడిపోయిందని గుర్తు చేశారు. పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరకు అదనంగా వరికి రూ.200, జొన్నకు రూ.200, కందికి రూ.450 బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కనీసం నష్టం అంచనా కూడా వేయలేదని మండిపడ్డారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, మహిళా రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 2,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
హామీలన్నీ గాల్లోనే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలు గాల్లోనే ఉన్నాయని, అమలు చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేజీ టు పీజీ విద్య కలగానే మిగిలిపోయిందని, దళితులకు ఒక్క ఎకరా భూమిని కూడా పంపిణీ చేయలేదని.. దళిత పారిశ్రామిక వేత్తలకు ఒక్క రూపాయీ ఇవ్వలేదని మండిపడ్డారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు హామీ ఏమైందన్నారు. మహదేవ్‌పూర్‌లో వన్యప్రాణుల చట్టాన్ని అతి క్రమించిన వారిలో మంత్రుల కుమారులు న్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లు, సర్క్యూట్ లైన్లతోనే విద్యుత్ ఉత్పత్తి పెరగలేదంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
అసహన ధోరణి మంచిదికాదు
బడ్జెట్ అంచనాలను, సవరించిన అంచనాలను పరిశీలిస్తే సంక్షేమానికి భారీగా కోత పడుతోందన్న ఎమ్మెల్యే సంపత్‌ను సీఎంతప్పుపట్టారని, ఇంత అసహన ధోరణితో మాట్లాడటం సరికాదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, సీఎం సమాధానం అనంతరం సంపత్ మాట్లాడుతూ.. సంక్షేమంపై ప్రభుత్వ లెక్కలను తప్పుపట్టారు. దీనికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి చట్టం చేసిన తరువాత ఖర్చు చేయకపోవడం ఉండదని పేర్కొన్నారు. ఈ దశలో ఉత్తమ్ జోక్యం చేసుకుని ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని, అందరూ భజన సంఘంగా ఉండరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.