సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందే ఆయకట్టు రైతులకు దీటుగా త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది. భూసేకరణ చట్టం– 2013 ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు కాలనీల్లో నిర్మించిన ఇళ్లల్లో పునరావాసం కల్పిస్తోంది. రక్షిత మంచినీరు, రహదారి, మురుగునీటి కాలువలు, విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో కల్పిస్తోంది. నిర్వాసితులకు చేతివృత్తులతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా శిక్షణ ఇస్తూ.. ఉపాధి కల్పిస్తోంది. గతేడాది గండికోట, చిత్రావతి జలాశయాల్లో ముంపునకు గురైన గ్రామాల్లో 19,688 కుటుంబాలకు రూ.1166.57 కోట్లు ఖర్చు చేసి పునరావాసం కల్పించింది. దేశంలో ఒక ఏడాది ఇంత భారీ ఎత్తున నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది పోలవరం, వెలిగొండలో 22,070 నిర్వాసిత కుటుంబాల పునరావాసానికి రూ.5,452.52 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, సోమశిల, గండికోట, చిత్రావతి, వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాళెం రిజర్వాయర్ల చరిత్రలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసింది.
పోలవరంలో శరవేగంగా..
వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేసేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం పోలవరాన్ని 2022 నాటికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాల్లో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లో 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు ఓ.ఆనంద్‌ను ప్రభుత్వం అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది 41.15 కాంటూర్ మీటర్ల పరిధిలోని 20,870 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటికే 3,417 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 17,453 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.3,942.97 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పునరావాసం కల్పించడం కోసం 73 కాలనీలను నిర్మిస్తోంది. 27 కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని 84,731 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.25,539.18 కోట్లు అవసరం. ఈ కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 140 కాలనీలను నిర్మించనుంది.
వెలిగొండలో వేగవంతం..
వెలిగొండలో అంతర్భాగంగా 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయంతో ప్రకాశం జిల్లాలో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 4,617 నిర్వాసిత కుటుంబాలు, 18 ఏళ్లు నిండిన 2,938 మంది యువతకు ఏకకాల పరిష్కారం కోసం రూ.1510.05 కోట్లు అవసరం. ఇప్పటికే రూ.1411.56 కోట్లను మంజూరు చేశారు. ఏడు పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఫలాలకు దీటుగా పునరావాసం
Published Sun, Mar 7 2021 5:32 AM | Last Updated on Sun, Mar 7 2021 5:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment