‘పెద్దల’ కోసం సర్దుబాటు రూ. 4,000 కోట్లు!! | tdp Fresh sketch in irrigation projects | Sakshi
Sakshi News home page

‘పెద్దల’ కోసం సర్దుబాటు రూ. 4,000 కోట్లు!!

Published Fri, Jan 19 2018 2:08 AM | Last Updated on Fri, Aug 10 2018 8:34 PM

tdp Fresh sketch in irrigation projects - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి, రైతుల పొలాల్లోకి నీరు ఎప్పుడు పారుతుందో తెలియదు గానీ,  ప్రభుత్వ పెద్ద ల జేబుల్లోకి కమీషన్ల ప్రవాహం మాత్రం ఆగ డం లేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అందినంత మింగేస్తున్నా రు. ఇందుకోసం కొత్తకొత్త వ్యూహాలను తెరపై కి తెస్తున్నారు. 2014 తర్వాత దక్కించుకున్న ప్రాజెక్టుల పనులు చేయకుండా మొండి కేస్తున్న కాంట్రాక్టర్లపై జరిమానా విధించాల్సి న ప్రభుత్వం అందుకు భిన్నంగా అంతులేని మమకారం ప్రదర్శిస్తోంది. ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. 

అక్రమం ఇక సక్రమం 
తాజాగా చేపట్టిన పనులకు ‘ధరల సర్దుబాటు’ నిబంధనలను వర్తింపజేసి, కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేయాలంటూ జలవనరుల శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. 2013 ఏప్రిల్‌ 1కి ముందు చేపట్టిన పనులకు మాత్రమే ధరల సర్దుబాటును వర్తింపజేస్తామని.. ఆ తర్వాత చేపట్టిన పనులకు అమలు చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. దాంతో బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజనీర్స్‌(బీవోసీఈ)ను రంగంలోకి దించి, తమకు అనుకూలంగా నివేదిక వచ్చేలా చక్రం తిప్పారు. బీవోసీఈ నివేదికను అమలు చేయడానికి వీలుగా శనివారం (20వ తేదీ) నిర్వహించే కేబినెట్‌ సమావేశానికి ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కేబినెట్‌ తీర్మానం ద్వారా అక్రమాన్ని సక్రమం చేసుకుని, కాంట్రాక్టర్లతో కలిసి రూ.4 వేల కోట్లకు పైగా లబ్ధి పొందడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 

ఆ రెండు జీవోలతో భారమే  
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో స్టీల్, సిమెంట్, డీజిల్‌తోపాటు లేబర్, మెటీరియల్‌కు ధరల సర్దుబాటును వర్తింపజేస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 7న జారీ చేసిన జీవో 13ను గవర్నర్‌ నరసింహన్‌ తాత్కాలికంగా నిలిపివేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జలవనరులు, ఆర్థిక శాఖల అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు చేసిన సూచనలను తుంగలో తొక్కుతూ ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు కట్టబెడుతూ 2015 మార్చి 22న జీవో 22ను జారీ చేశారు. అంతటితో ఆగకుండా... పనుల పరిమాణాల ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించేలా 2015 జూన్‌ 12న జీవో 63ను జారీ చేశారు. ఈ రెండు జీవోల వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.20 వేల కోట్లకు పైగా భారం పడింది. ఆ సొమ్మంతా ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్ల పాలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కోటరీ కాంట్రాక్టర్లతో ప్రతిపాదన 
ధరల సర్దుబాటు నిబంధనలు 2013 ఏప్రిల్‌ 1కి ముందు చేపట్టిన పనులకే వర్తిస్తాయి. రాష్ట్రంలో 2014 జూన్‌ 8 తర్వాత చేపట్టిన పనులకు వర్తించవు. తాజా ధరల ప్రకారం చేపట్టిన పనులను పూర్తి చేయలేకపోతే ఈపీసీ లేదా ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానాల్లోని నిబంధనల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్‌కు జరిమానా విధించవచ్చు. కానీ, తాజాగా చేపట్టిన పనులకు కూడా ధరల సర్దుబాటు నిబంధనలను వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోటరీలోని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. హంద్రీ–నీవా రెండో దశలో భాగంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో చేసిన పనులకు అదనంగా రూ.169.71 కోట్లు ఇవ్వాలని కోరాయి. 2015–16 ధరల ఆధారంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు టెండర్లు పిలిచామని, వాటికి జీవో 22, జీవో 63లను వర్తింపజేయలేమని రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ) పలుమార్లు తేల్చిచెప్పింది. చంద్రబాబు ఒత్తిళ్లకు ఎస్‌ఎల్‌ఎస్‌సీ లొంగకపోవడంతో వ్యూహం మార్చారు. తాజాగా చేపట్టిన పనులకూ ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేసే ప్రతిపాదనపై నివేదిక ఇవ్వాలంటూ బీవోసీఈని ఆదేశించారు. ఒత్తిళ్లకు తలొగ్గిన బీవోసీఈ.. 2013 ఏప్రిల్‌ 1 తర్వాత ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విధానంలో చేపట్టిన పనుల్లో.. అంతర్గత అంచనా విలువ(ఐబీఎం) కంటే 25 శాతం ఎక్కువ పనులు చేసి ఉంటే ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేయవచ్చని 2017 నవంబర్‌ 29న నివేదిక ఇచ్చింది. ఐబీఎంలో పేర్కొన్న మట్టి లేదా కాంక్రీట్‌ పనుల కంటే 50 శాతం ఎక్కువ చేసి ఉన్నా అదనపు నిధులు ఇవ్వొచ్చని ఆ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబు నెల రోజులుగా ఒత్తిడి తెస్తున్నారని జలవనరుల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. 

కేబినెట్‌లో ఆమోద ముద్ర 
తాజా ధరలతో చేపట్టిన పనులకు ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేయలేమని జలవనరులు, ఆర్థిక శాఖల అధికారులు తేల్చి చెప్పారు. 2015–16, 2016–17, 2017–18 ధరల్లో పెద్దగా మార్పు లేదని చెప్పిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు మండిపడినట్లు తెలిసింది. బీవోసీఈ నివేదికను అమలు చేసేలా ఈ నెల 20న నిర్వహించే కేబినెట్‌ సమావేశానికి ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు. యథావిధిగా ఆ నివేదికపై కేబినెట్‌లో ఆమోదముద్ర వేసి.. కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. 2014 జూన్‌ 8 తర్వాత చేపట్టిన పనులకు జీవో 22, జీవో 63లను వర్తింపజేస్తే ఖజానాపై రూ.4 వేల కోట్లకుపైగా భారం పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సింహభాగం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు భాగస్వామిగా ఉన్న హెచ్‌ఈఎస్‌–పీఎస్‌కే, నవయుగ వంటి సంస్థలకే దక్కనుంది. 

అ‘ధనం’ ఇవ్వాల్సిందేనట! 
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వంశధార, చింతలపూడి తదితర ప్రాజెక్టుల్లో పాత కాంట్రాక్టర్లపై వేటు వేశారు. ఆ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. టెండర్‌ నిబంధనలను అడ్డం పెట్టుకుని కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించారు. తాజాగా ఆ పనులకే ధరల సర్దుబాటును వర్తింపజేసి అదనపు నిధులు కట్టబెట్టడానికి పావులు కదుపుతున్నారు. 

హంద్రీ–నీవా రెండో దశలో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనుల అంచనా విలువ తొలుత రూ.207 కోట్లే. కానీ, అంచనా వ్యయాన్ని పెంచి.. రూ.430.26 కోట్లకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిల సంస్థలకు కట్టబెట్టారు. ఒప్పందం ప్రకారం తొమ్మిది నెలల్లోగా ఈ పనులు పూర్తి కావాలి. కానీ, కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేకపోయారు. గడువు పెంచాలంటూ కాంట్రాక్టర్లు పంపిన ప్రతిపాదనపై ఉన్నతస్థాయి ఒత్తిడి మేరకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఆమోదముద్ర వేసింది. తాజాగా పెంచిన గడువు కూడా పూర్తయింది. మట్టి పనులు పూర్తయ్యాయి. కానీ 66,139 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మిగిలిపోయాయి. ఒప్పందంలో పేర్కొన్న దాని కంటే అధికంగా పనులు చేశామని, రూ.169.71 కోట్లు అదనంగా ఇవ్వాలని వారు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. 

వంశధార ప్రాజెక్టు రెండో దశలో 87 ప్యాకేజీ పనులు చేస్తున్న సీఎం రమేశ్, 88 ప్యాకేజీ పనులు చేస్తున్న చంద్రబాబు కోటరీలోని సంస్థ ఇప్పటికే అదనపు నిధులు ఇవ్వాలంటూ సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించాయి. 

హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు పనులను 2016–17 ధరలతో చేపట్టారు. గతేడాది చేపట్టిన ఈ పనులకు సైతం ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలంటూ సీఎం రమేశ్, చంద్రబాబు కోటరీలోని కాంట్రాక్టర్లు ప్రతిపాదనలు పంపారు.

గడువులోగా పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం..నిబంధనలకు విరుద్ధంగా భారీగా ప్రయోజనం చేకూర్చడానికి రంగం సిద్ధం చేయడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement