సూక్ష్మసేద్యం.. ఏదీ నిధులకు మోక్షం!
- రూ. 190 కోట్లకు ఒక్క పైసా విడుదల చేయని సర్కారు
- కేంద్ర వాటా రూ. 112 కోట్లు... ఇచ్చింది రూ. 22 కోట్లే
- సబ్సిడీ తగ్గించాలని ప్రభుత్వ యోచన
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యం పథకానికి నిధుల మోక్షం కలగడంలేదు. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర సర్కారు చెబుతున్నా ఆచరణ మాత్రం అధ్వానంగా ఉంది. నిధులు విడుదల చేయడంలేదు. కేంద్ర వాటా సొమ్ముపైనే ఆధారపడి రాష్ట్ర వాటాను విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. 2016–17 రాష్ట్ర బడ్జెట్‌లో సూక్ష్మసేద్యం కోసం ప్రభుత్వం రూ.302.50 కోట్లు కేటాయించింది. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.112 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.190.50 కోట్లు కేటాయించింది. కేంద్రం తన వాటాలో కేవలం రూ.22.31 కోట్లు మాత్రమే విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క పైసా విడుదల చేయలేదు.
తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యానశాఖ అధికారులు రూ. 22.31 కోట్లు చెల్లించి రూ.164.06 కోట్ల విలువైన సూక్ష్మసేద్యం పరికరాలను కంపెనీల నుంచి తీసుకువచ్చి రైతుల భూముల్లో ఏర్పాటు చేశారు. మిగిలిన సొమ్ము కంపెనీలకు బకాయి పడింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ ఏడాది బడ్జెట్‌లో రూ. 308 కోట్లు కేటాయించారు. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 92.75 కోట్లు కాగా... రాష్ట్ర ప్రభుత్వం రూ. 215.25 కోట్లు కేటాయించింది. కేంద్రం తన వాటాలో రూ. 90.33 కోట్లు విడుదల చేయగా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 100 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం కంపెనీలకు రూ. 273.73 కోట్లు బకాయి పడింది. దీంతో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేయడానికి కంపెనీలు ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు.
సబ్సిడీకి కోత?
ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచిత సూక్ష్మసేద్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, ఉద్యాన నర్సరీ సంస్థల కార్యనిర్వాహక సమావేశం రాయితీని తగ్గిస్తూ సిఫారసు చేసింది. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా (100 శాతం బదులు 90 శాతం సబ్సిడీతోనే సూక్ష్మసేద్యం అందించాలని నిర్ణయించింది. బీసీలకు, ఇతర సన్నచిన్నకారు రైతులకు ప్రస్తుతం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా 80 శాతానికి తగ్గించాలని... పెద్ద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 80 శాతం సబ్సిడీని 60 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు నష్టపోతారు.