కాంగ్రెస్కు జలగండం తప్పదు
ఎంపీ బూర నర్సయ్యగౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు సైంధవుల్లా అడ్డుతగులుతున్నారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని రైతుల వెంట పడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నదీజలాలను వినియోగించుకోవడానికి ఇప్పటిదాకా సరైన ప్రణాళికలే లేవని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నియోజకవర్గంలో పులిచింతల ప్రాజె క్టు కింద 28 గ్రామాలు ముంపునకు గురైనా ఆయన బాధితులకు చేసిన న్యాయం ఏమీ లేదన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడితే కాంగ్రెస్‌కు జలగండం తప్పదని ఆయన హెచ్చరించారు. అవినీతికి అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి రహిత టీఆర్‌ఎస్ పాలన చూసి ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు.