ప్రాజెక్టులు పెండింగే.. | Need Rs 60 thousand crores for complete the pending Projects | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు పెండింగే..

Published Thu, Mar 16 2017 4:41 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

ప్రాజెక్టులు పెండింగే.. - Sakshi

ప్రాజెక్టులు పెండింగే..

రూ.40 వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ
కోటి ఎకరాలకు నీరందిస్తామని ప్రచారం..
ప్రస్తుతం పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి కావాలంటే ఇంకా రూ.60 వేల కోట్లు కావాలి


సాక్షి, అమరావతి: సాగునీటి రంగానికి తాజా బడ్జెట్‌లో కేవలం రూ.12,770.26 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో నాబార్డు రుణ రూపంలో కేంద్రం విడుదల చేస్తుందని అంచనా వేస్తున్న నిధులే రూ.7,665.30 కోట్లు ఉన్నాయి. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల్లో కేవలం రూ.5,104.96 కోట్లను మాత్రమే సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇక మిగిలింది ఒక్క బడ్జెట్‌ (2018–19) మాత్రమే. ఈ లెక్కన ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో, కోటి ఎకరాలకు నీళ్లు అందేది ఎప్పుడో.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వానికి   ఎంత శ్రద్ధ ఉందో, ప్రభుత్వ నేతలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఎలా ఉండదో బడ్జెట్‌ కేటాయింపుల్ని చూస్తే అర్థమవుతుంది. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తోంది. అరకొర కేటాయింపులతో కానీ నేటికీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని దుస్థితి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని.. వాటిని సత్వరమే పూర్తి చేసి కోటి ఎకరాలకు నీళ్లందిస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాలుగు బడ్జెట్లు (2014–15, 2015–16, 2016–17, 2017–18) ప్రవేశపెట్టారు. గత మూడు బడ్జెట్లలో కలిపి రూ.19,468.76 కోట్లు కేటాయించారు. మరోవైపు కమీషన్ల కోసం పనులు అస్మదీయులకు అప్పగించి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. దీంతో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా సుమారు రూ.60 వేల కోట్లు అవసరమని అంచనా.

నాబార్డు నుంచి అన్ని నిధులు అనుమానమే..
ప్రాజెక్టులకు 2017–18 బడ్జెట్‌లో 2016–17తో పోల్చితే 60 శాతం అధికంగా కేటాయించినట్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. వాస్తవంగా చూస్తే ఇందులో నాబార్డు రుణ రూపంలో కేంద్రం విడుదల చేస్తుందని అంచనా వేసిన నిధులు రూ.7,665.30 కోట్లు. అయితే దేశంలోని పోలవరం సహా వంద ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై (ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన) కింద పూర్తి చేసేందుకు నాబార్డు నుంచి రుణం మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. పీఎంకేఎస్‌వైకి రుణం మంజూరు చేసేందుకు వీలుగా ఎల్‌టీఐఎఫ్‌ (దీర్ఘకాలిక నీటిపారుదల నిధి) కింద రూ.40 వేల కోట్లను నాబార్డుకు మంజూరు చేస్తామని 2017–18 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఈ రూ.40 వేల కోట్లలో ఒక్క మన రాష్ట్రానికే రూ.7,665.30 కోట్ల రుణాన్ని నాబార్డు మంజూరు చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల నుంచి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,931.54 కోట్లను విడుదల చేస్తే.. ఇందులో గతేడాది డిసెంబర్‌ 26న నాబార్డు ఇచ్చిన రుణం రూ.1,981.54 కోట్లు కావడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే నాబార్డు నుంచి రూ.7,665.30 కోట్ల రుణం మంజూరయ్యే అవకాశాలు తక్కువేనని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

నాబార్డు ఇవ్వకుంటే అంతే..
రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం) కింద గుండ్లకమ్మ, తాడిపూడి, పుష్కర, తారకరామతీర్థ సాగరం, ముసురుమిల్లి, ఎర్రకాల్వ, మద్దిగెడ్డ తోటపల్లి ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల్లో అధికశాతం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. గతేడాది ఏఐబీపీని కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో పీఎంకేఎస్‌వై పథకాన్ని ప్రారంభించింది. 2017–18లో ఆ ఎనిమిది ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను నాబార్డు నుంచి రుణం రూపంలో అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇదే అదునుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అమాంతంగా పెంచేసింది. ఎనిమిది ప్రాజెక్టులకు కేంద్రం వాటా కింద రూ.785.30 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఇప్పటిదాకా ఆమోదముద్ర వేయలేదు. కానీ ప్రభుత్వం ఆ ఎనిమిది ప్రాజెక్టులకు నాబార్డు రుణం పేరిట నిధులు కేటాయించింది. ఒకవేళ నాబార్డు రుణం ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. కేవలం రూ.154 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి.. ఆరు లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉండేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.

రూ.2 కోట్లతో రూ.1,638 కోట్ల పనా?
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి సస్యశ్యామలం చేసేందుకు రూ.1,638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టినట్లు సర్కార్‌ ప్రకటించింది. తొమ్మిది నెలల్లోగా ఈ ఎత్తిపోతలను పూర్తి చేసి పోలవరం ఎడమ కాలువ కింద 2.15 లక్షల ఎకరాలకు 2017 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని హామీ ఇచ్చింది. కానీ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కేవలం రూ.2 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.2 కోట్లతో రూ.1,638 కోట్ల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వమే చెప్పాలి. హంద్రీ–నీవా, గాలేరు–నగరి తొలి దశ, గుండ్లకమ్మ, వంశధార రెండో దశ, పోలవరం ఎడమ కాలువను పూర్తి చేసి 2017 ఖరీఫ్‌లో 8.86 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని బడ్జెట్‌లో పేర్కొంది. కానీ ఆ మేరకు నిధులు కేటాయించలేదు. కమీషన్‌ల కోసం హంద్రీ–నీవా అంచనా వ్యయం రూ.6,850 కోట్ల నుంచి రూ.11,722 కోట్లకు పెంచేసిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.1,900 కోట్లకుపైగా అవసరం. కానీ.. బడ్జెట్‌లో కేవలం రూ.479.20 కోట్లను కేటాయించారు. గాలేరు–నగరి, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), వెలిగొండ, సోమశిల, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులదీ ఇదే దుస్థితి.

ఎన్నికల హామీ: డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ హామీని పక్కన పెట్టారు. ప్రతి మహిళకు పది వేల చొప్పున మూడు విడతలుగా పెట్టుబడి నిధిగా ఇస్తామన్నారు.  
డ్వాక్రా రుణమాఫీకి చేయడానికి 14,204 కోట్లు కేటాయించాల్సి ఉంది.
రూ. 14,360 కోట్లు మేర సంఘాల జీరో వడ్డీ డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement