అసెంబ్లీలో బడ్జెట్‌ను చదువుతున్న ఆర్థిక మంత్రి యనమల. చిత్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చినరాజప్ప తదితరులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు పెట్టిన 2018–19 రాష్ట్ర బడ్జెట్‌లో అంకెలు ఘనంగా కనిపిస్తున్నా అన్నీ కాకిలెక్కలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారం కోసం ఉద్దేశించిందే తప్ప.. ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. ఎన్నికల ఏడాది కనుక ఈ బడ్జెట్‌లోనైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యింది. ఊహాజనిత లెక్కలతోనే ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ కేటాయింపులు సరిపుచ్చారు. ఒక్క హామీకి కూడా న్యాయం చేసే విధంగా కేటాయింపులు చేయలేదు.
కేంద్ర గ్రాంట్లపై ఆశలు..
భారీ రెవెన్యూ వ్యయంతో రూపొందించిన బడ్జెట్‌కు ఆర్థిక వనరులు ఎక్కువగా కేంద్ర గ్రాంట్లు, అప్పులపైన ఆధారపడినట్లు స్పష్టమైంది. అంతే కాకుండా ఏకంగా రాష్ట్ర సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని భారీగా చూపెట్టారు. అంటే అదనంగా పన్నులైనా వేయాలి లేదా గొప్పల కోసం రాని ఆదాయాన్ని వస్తుందని అంచనా వేసైనా ఉండాలి అని నిపుణులంటున్నారు. అలాగే కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో రూ.50,696 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర నుంచి గ్రాంటు రూపంలో రూ.37,548 కోట్లు వస్తాయని అంచనా వేయగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2018–19లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏకంగా రూ.50,695 కోట్లు వస్తాయని అంచనా వేశారు.
ఈ లెక్కలన్నీ ఊహాజనితమే తప్ప వాస్తవ రూపం దాల్చవనేది ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.53,715 కోట్లు వస్తాయని అంచనా వేయగా సవరించిన అంచనాల్లో రూ.52,715 కోట్లే వస్తాయని పేర్కొన్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.65,535 కోట్లు్లగా అంచనా వేశారు. అంటే ఏకంగా రూ.12,820 కోట్లు పన్నుల రూపంలో అదనంగా ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.29,605 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించారు.
రెవెన్యూలోటు పెరిగినా మిగులేనా..
విచిత్రంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో రూ.415 కోట్ల రెవెన్యూ లోటును చూపెట్టగా.. ఇప్పుడు సవరించిన అంచనాల్లో రెవెన్యూ లోటు రూ.4,018 కోట్లకు పెరిగిపోయింది. అయినా సరే 2018–19కి మాత్రం రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఏకంగా రూ.5,235 కోట్ల రెవెన్యూ మిగులతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనలను సడలించుకుని అప్పులు ఎక్కువగా తీసుకోవడానికి వెసులు బాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆర్థిక వర్గాలే పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపులకు, వాస్తవ వ్యయానికి పొంతన లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులనే తిరిగి సవరించిన అంచనాలుగా పేర్కొన్నారంటే వాస్తవంగా వ్యయం ఎంత చేసిందీ చెప్పకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. మద్యం నుంచి ఆదాయాన్ని భారీగా ఆశిస్తున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మద్యం నుంచి రూ.5,886 కోట్లు వస్తాయని పేర్కొనగా 2018–19లో రూ.7,357 కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు. రవాణా, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్ ద్వారా భారీగా ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.
♦ సామాజిక ఆర్థిక సర్వే 2017-18
తెలియకుండా పన్ను పీకుతున్నారు
రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2016–17లో రూ.44,181 కోట్లుగా ఉన్న సొంత పన్నుల ఆదాయం.. ఈ ఏడాది రూ.52,717 కోట్లకు చేరింది. ఇదే సమయంలో సొంత పన్నేతర ఆదాయంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2016–17లోరూ.3,989 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈసారి రూ.5,347 కోట్లకు పెరిగింది. ఈ రెండూ కలిపితే రాష్ట్ర సొంత ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.48,170 కోట్ల నుంచి రూ.58,064 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment