బాబు బడ్జెట్ అంతా అంకెలు గారడీయే | andhrapradesh first budget | Sakshi
Sakshi News home page

బాబు బడ్జెట్ అంతా అంకెలు గారడీయే

Published Thu, Aug 21 2014 1:25 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

బాబు బడ్జెట్ అంతా అంకెలు గారడీయే - Sakshi

బాబు బడ్జెట్ అంతా అంకెలు గారడీయే

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతా 7 నెలలకు రూ.1,11,824 కోట్ల అంచనాతో యనమల బడ్జెట్
* టీడీపీ ఎన్నికల హామీలు, బాబు ప్రకటనల వివరాలే ఏకరువు
* ఒక్కో రైతుకు రూ. 1.50 లక్షలు రుణ మాఫీ అమలుకు కృషి
* డ్వాక్రా మహిళలకు లక్షకు మించకుండా సరికొత్త పెట్టుబడి
* చిత్తూరులో ట్రిపుల్ ఐటీ, కాకినాడలో పీపీపీ పద్ధతిలో ట్రిపుల్ ఐటీ
* సాగుకు 9 గంటలు, పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా
* 2014-15 సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో ఏపీ ఆర్థికమంత్రి వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం దాదాపు మధ్యలో ఉన్నందున మిగిలిన కాలానికి ప్రభుత్వ అత్యవసర కనీస అవసరాలను తీర్చడం మీదనే ప్రస్తుత బడ్జెట్‌లో దృష్టి పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ ఆరేడు నెలల్లో ఆదాయాన్ని వీలైనంత పెంచుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. దాదాపు గంటన్నర మాట్లాడిన యనమల.. ఆయా శాఖల స్థాయీ నివేదికలు, సీఎం చంద్రబాబు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని హామీలు, ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొన్న విషయాలను యథాతథంగా బడ్జెట్ ప్రసంగంలో చేర్చారు.
 
వాటి అమలుకు కృషి చేస్తామని పాత పాటే పాడారు. రూ.1,11,824 కోట్ల ప్రతిపాదనలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ.. అందులో ఎన్నికల హామీల అమలుకు అవసరమైన కేటాయింపులూ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014-15 బడ్జెట్‌ను ఆయన బుధవారం శాసనసభకు సమర్పించారు. ఉదయం 11 గంటల నుంచి 12.26 గంటల వరకు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆర్థికమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ...
 
సింహ భాగం ప్రణాళికేతరమే...
రూ. 1,11,824 కోట్ల బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ. 85,151 కోట్లు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికిచ్చిన నిధులు స్వల్పమే అయినా విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీని ఆదుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పడం సంతోషకరం. అదనపు నిధులు రాబట్టడానికి గట్టిగా కృషిచేస్తాం. 2004- 05 స్థిర ధరల ప్రకారం 2012-13లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2,35,930 కోట్లు. 2013-14లో రూ. 2,50,282 కోట్లకు పెరుగుతుందని.. అంటే 6.08 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని అంచనా. తలసరి ఆదాయం రూ. 42,186 నుంచి రూ. 44,481కు పెరగవచ్చు. రాష్ట్ర స్థూల వస్తూత్పత్తి సూచిక కంటే స్థూల సంతోష సూచికకు అధిక ప్రాధాన్యత ఇస్తాం.
 
హామీల అమలుకు కృషి చేస్తున్నాం
* ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.5 లక్షల రుణ మాఫీ నిర్ణయం అమలుకు ఆర్‌బీఐ, బ్యాంకులు లేవనెత్తిన అవరోధాలను అధిగమిస్తాం. మాఫీకి వనరులు సమకూర్చుకుంటున్నాం.
* డ్వాక్రా సంఘానికి రూ. లక్షకు మించకుండా పెట్టుబడి సమకూర్చడం ద్వారా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేస్తాం.
* తక్కువ ధరకు ఆహారాన్ని అందింంచే ‘అన్న’ క్యాంటీన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.
* పింఛన్లు పెంపు అక్టోబర్ 2 నుంచి చెల్లించేలా సెప్టెంబర్‌లో అమల్లోకి తేనున్నాం.
* ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉపాధి కల్పన, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగ భృతి.. అందించేందుకు కట్టుబడి ఉన్నాం.
* ఎన్‌టీఆర్ సుజల పథకం కింద కుటుంబానికి రూ.2కే 20 లీటర్ల మంచి నీటిని సరఫరా చేస్తాం.
 
అన్ని పథకాలకూ విధిగా ‘ఆధార్’
* ఆధార్ నంబర్‌ను అన్ని పథకాలకూ తప్పనిసరిగా అనుసంధానం చేస్తాం. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. బీపీఎల్ మహిళలకు దీపం గ్యాస్ కనెక్షన్లు అందిస్తాం.
* అన్ని సంక్షేమ హాస్టళ్లనూ దశలవారీగా రెసిడెన్షియల్ స్కూళ్లుగా అభివృద్ధి చేస్తాం. ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఉప ప్రణాళిక కేటాయిపులను 17.1 శాతానికి పెంచుతాం.
* బీసీల కోసం ప్రతినియోజకవర్గంలో బాలుర కోసం, బాలికల కోసం ఒక్కో హాస్టల్ చొప్పున నిర్మించనున్నాం. బీసీ సబ్‌ప్లాన్ రూపకల్పన కోసం చర్యలు చేపట్టనున్నాం.
* మైనారిటీల సంక్షేమానికి దుకాన్-మకాన్, రోష్నీ.. పథకాలు మళ్లీ అమలు చేయనున్నాం. వీరి సంక్షేమానికి రూ.371 కోట్లు కేటాయించాం.
* ఎస్సీ, ఎస్టీల ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ. 1.5 లక్షలకు పెంచాలని నిర్ణయించాం. మిగతా వారి ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ. లక్ష చేయనున్నాం. ప్రస్తుతం నడుస్తున్న ఇందిరమ్మ పథకాన్నే సవరించి అమలు చేస్తాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 65.35 లక్షల ఇళ్లు పూర్తియ్యాయి. 4.93 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. 6.98 లక్షల ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు.
 
ట్రిపుల్ ఐటీలు, శిల్పారామాలు, పోర్టులు...
* చిత్తూరు జిల్లాలో ట్రిపుల్ ఐటీ, కాకినాడలో పీపీపీ పద్ధతిలో మరో ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు చేస్తాం. ఉన్నత విద్యకు రూ.2,275 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 12,595 కోట్లు, ప్రాథమిక విద్యకు రూ. 4,388 కోట్లు కేటాయించాం.
రూ. 100 కోట్లతో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మెగా టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తాం.
* భావనపాడు, కళింగపట్నం సహా రాష్ట్రంలో 14 మైనర్ పోర్టులను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.
* విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలను విస్తరిస్తాం. విజయవాడలో కొత్త టెర్మినల్, కంట్రోల్ టవర్ ఏర్పాటు, విజయవాడ - కాకినాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను కేంద్రం ప్రతిపాదిస్తోంది.
* ఎల్‌ఎన్‌జీ ఇంపోర్టేషన్ టెర్మినల్ ఏర్పాటుకు కాకినాడ డీప్ వాటర్ పోర్టు అనుకూలమైందని ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీజీడీసీ) గుర్తించింది. దీనికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
 
గుంటూరు, అనంతల్లో సౌర వెలుగులు...
త్వరలో ఇళ్లకు నిరంతర విద్యుత్ సరఫరా అందించనున్నాం. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచనున్నాం. వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 సౌర విద్యుత్ పార్క్‌లను గంటూరు, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం.
 
11 చివరి దశ ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తి
జలయజ్ఞం ప్రాజెక్టుల్లో 13 పూర్తయ్యాయి. మరో 14 పాక్షికంగా నీటిని సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.19,378 కోట్ల వ్యయంతో 11.878 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మూడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాం. చివరి దశలో ఉన్న మరో 11 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. వీటి ద్వారా 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. మరో 35,990 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తాం.పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నాం.ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు జాతీయ స్థాయి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో 5 శాతం వాటా సాధిస్తాం.
 
తలసరి అప్పు రూ. 22,395
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం వరకు రూ. 1,78,348 కోట్ల అప్పు ఉండగా.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1,10,634 కోట్ల అప్పు ఉంటుందని ఆర్థికశాఖ లెక్క తేల్చింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పాదకతలో 21.13 శాతంగా ఉంది. రాష్ట్రం విడిపోయిన తరువాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 4.94 కోట్ల మంది జనాభా ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న రాష్ట్ర మొత్తం అప్పులో ఒక్కొక్కరి తలపై 22,395 రూపాయలు అప్పు ఉన్నట్లు తేలింది.
 
ఇదిలావుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల ద్వారా మొత్తం రూ. 16,366 కోట్లు అప్పు చేయనుంది. బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 10,532 కోట్లు, విదేశీ సంస్థల ద్వారా రూ. 1,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 978 కోట్లు, నాబార్డు తదితర రంగాల ద్వారా రూ. 2,994 కోట్లు, డిపాజిట్ల బదిలీల ద్వారా రూ. 862 కోట్లు అప్పు చేయనుంది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 8,000 కోట్లు గ్రాంటు రూపంలో వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. గత పది సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మిగుల్లో ఉండగా.. రాష్ట్రం విడిపోయాక ఇప్పుడు రూ. 6,063 కోట్ల రెవెన్యూ లోటులోకి వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement