ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఇంటికో ఉద్యోగం – ఉపాధి కల్పిస్తామని, ఇవ్వలేకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు నాలుగేళ్ళుగా వంచిస్తూనే ఉన్నారు. రెండేళ్లపాటు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇంతవరకు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు.
రాష్ట్రంలో సుమారు కోటిన్నర కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన నెలకు రూ. 3వేల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయి ఉంది. సంవత్సరానికి రూ. 36వేల కోట్లు.. నాలుగేళ్ళలో రూ. 1.44 లక్షల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయిపడింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా కలుపుకుంటే రూ. 1.80 లక్షల కోట్లు. మరి రూ. 1,000 కోట్లు ఏమూలకు? 2016లో ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో 35 సంవత్సరాల లోపు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతరుల వివరాలు ప్రభుత్వం నమోదు చేసింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఏ తరగతిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఒక లెక్క తయారు చేసింది.
దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 24 లక్షల మంది ఉన్నట్లు చెబుతున్నది. పదో తరగతి చదివిన వారు 6.25 లక్షల మంది, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి సాంకేతిక అర్హతలు కలిగిన వారు 2.89 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతున్నది. పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర అర్హతలు కలిగిన వారు 2.07 లక్షల మంది ఉన్నట్లు ఆరు నెలల క్రితం ప్రభుత్వం అధికారిక లెక్కలు తయారు చేసింది.
ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే చూసినా అన్ని తరగతులకు సంబంధించి 33,70,315 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎస్సీ నిరుద్యోగులు 6,11,309, ఎస్టీ నిరుద్యోగులు 1,38,328, బీసీ నిరుద్యోగులు 16,20,823, దివ్యాంగ నిరుద్యోగులు 11,683, ఇతరులు 9,88,172 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తయారు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఈ 33,70,315 మందికి నెలకు రూ.2వేల చొప్పున ఎంత ఇవ్వాలి? ఇపుడు కేటాయించిన రూ.1,000 కోట్లు ఏ మూలకు..?
Comments
Please login to add a commentAdd a comment