
తుని: 2018–19కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను మార్చిలో ప్రవేశపెట్టనున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ ముసాయిదా రూపకల్పన కోసం త్వరలో మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.
సీఎం దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలకు నిధులు కేటాయిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చి, 13 జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.