అప్పుల్లోనూ గొప్పే!
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఏకంగా రూ. 69 వేల కోట్ల అప్పులతో తెలంగాణను దేశంలోనే అత్యధిక రుణభారంగల రాష్ట్రంగా మార్చి ‘రికార్డు’సృష్టించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అవాస్తవికంగా, అబద్ధపు అంకెలతో గారడీ చేసేలా ఉందని విమర్శించారు. అడ్డగోలుగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతూ ప్రభుత్వం ప్రమాదకరబాటలో పయనిస్తోందని మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సోమవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడే నాటికి 70 వేల కోట్ల అప్పులుండగా ఈ రెండున్నరేళ్లలోనే అవి రూ. 1.40 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. వీటికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న కార్పొరేషన్ల రుణాలు కూడా కలిపితే అప్పులు రూ. 1.85 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. అప్పులను పెంచడం ద్వారా సర్కారు భావితరాలనూ తాకట్టుపెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఓవైపు అప్పులు తెస్తూ మరోవైపు కమీషన్లు వచ్చే మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకే నిధులు కేటాయించిందని ఆరోపించారు.
పథకాలకు నిధులేవీ...?
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, దళిత, గిరిజన, పేదలకు మూడెకరాల భూపంపిణీ వంటి పథకాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని ఉత్తమ్ ఆరోపించారు. కమీషన్లు రావనే కారణంతోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సర్కారు తప్పుడు లెక్కలు చూపుతోందని మండిపడ్డారు. ఫీజు బకాయిలు రూ. 3,500 కోట్లకు చేరాయన్నారు. 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశామన్న ప్రభుత్వం కేవలం 1,400 ఇళ్లు కట్టడం దారుణమన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులను ప్రభుత్వం తగ్గించిందని, రైతు రుణమాఫీ అమల్లో మోసపూరితంగా వ్యవహరించిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్‌కార్డుల జారీపై ప్రభుత్వం ఇంకా మోసం చేస్తూనే ఉందన్నారు. ప్రభుత్వోద్యోగులకు హెల్త్‌కార్డులు ఇస్తున్నా అవి పనిచేయట్లేదని, ప్రైవేటు ఆసుపత్రులు వారికి వైద్యాన్ని అందించట్లేదని ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్లను కుంటిసాకులతో వాయిదా వేస్తున్నారని విమర్శించారు.