Telangana budget -2017-18
-
పట్టణాభివృద్ధికి చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో పాత పంథానే కొనసాగించింది. హైదరాబాద్ విషయానికి వస్తే మాసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్లు, నగర రోడ్ల అభివృద్ధికి మరో రూ.377.35 కోట్లను కేటాయించింది. అలాగే రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.426.41 కోట్లు కేటాయించగా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా పురపాలికలకు సహాయక నిధి పద్దు కింద రూ.117.23 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రయోజిత పథకాలైన స్మార్ట్ సిటీకి రూ.150.94 కోట్లు, అమృత్‌కు మరో రూ.203.96 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.115 కోట్లు కేటాయించింది. ఆలయాలకు రూ.200 కోట్లు ప్రముఖ ఆలయాలకు గతేడాది తరహాలోనే కేటాయింపులను కొనసాగించింది. తాజాగా బడ్జెట్లో యాదగిరిగుట్ట ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు, వేములవాడ ఆలయాభివృద్ధికి మరో రూ.100 కోట్లు కేటాయించింది. అభివృద్ధి పనులకు రుణాలు హైదరాబాద్ జలమండలి, హెచ్ఎండీఏ, మెట్రో రైలు సంస్థలకు బడ్జెట్లో భారీ ఎత్తున పెట్టుబడి రుణాలను కేటాయించింది. రుణాల చెల్లింపునకు హైదరాబాద్ జల మండలికి రూ.1,420.50 కోట్లు కేటాయించగా, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం కేటాయించింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.250 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణ సహాయం కింద హెచ్ఎండీఏకు ఇవ్వనుంది. పురపాలికలు, కార్పొరేషన్లకు మరో రూ.192 కోట్ల రుణాలను కేటాయించింది. -
‘ఫీజు’లకు సరిపోయేనా..!
⇒ ఫీజు బకాయిలు రూ.2,827 కోట్లు ⇒ బడ్జెట్ కేటాయింపులు రూ. 1,939 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం అంతంత మాత్రం కేటా యింపులే చేసింది. బడ్జెట్లో ఫీజు పథకానికి రూ.1,939.31 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు సంబంధించి ఫీజు బకాయిలు రూ.2,827.45 కోట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి 13.65 లక్షల మంది విద్యార్థులకుగాను రూ.1,606.89 కోట్లు అవసరమని సంక్షేమ శాఖలు ప్రతిపాదనలను ఇటీవలే ప్రభుత్వానికి నివేదించాయి. 2015–16 సంవత్సరానికి సంబంధించి రూ.1,220.56 కోట్లు బకాయిలున్నాయి. తాజా బడ్జెట్లో కేవలం రూ.1,939.31 కోట్లు కేటాయించడంతో పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించడం కష్టమే. ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి.. ఫీజు పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. విద్యాసంవత్సరం ముగిశాకే నిధులు విడుదల చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వాస్తవానికి బడ్జెట్ లో కేటాయించిన నిధులు విడుదల చేయడం లోనూ జాప్యం చేస్తుండటం, డిమాండ్‌కు తగినట్లు కేటా యింపులు చేయకపో వడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. గతేడాది ఫీజు బకా యిలు చెల్లించకపో వడంతో పలువురు విద్యార్థులు కోర్సు పూర్తిచేసినా సర్టిఫికెట్లను కాలేజీల యాజమాన్యాలు తమ దగ్గరే ఉంచుకున్నాయి. దీంతో వారంతా ఉద్యోగాలు వచ్చినా ఒరిజినల్ ధ్రువపత్రాలు లేక కంపెనీల్లో చేరలేకపోయారు. -
విద్యా శాఖకు 12,705 కోట్లు
గతేడాది కంటే రూ.2,357 కోట్లు అదనంగా కేటాయింపు సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో విద్యాశాఖకు అదనంగా నిధులు లభించాయి. గత ఏడాది సవరించిన అంచనాలకంటే ఈసారి రూ.2,357 కోట్లు అదనంగా ఇచ్చింది. నిర్వహణ పద్దు కింద రూ.1,000 కోట్లకుపైగా కేటాయింపులు పెంచగా, ప్రగతి పద్దులోనూ మరో రూ.1,000 కోట్లకుపైగా నిధులు పెంచింది. 2016–17లో ప్రభుత్వం విద్యా శాఖకు 10,736 కోట్లను కేటాయించ గా.. దానిని రూ.10,348 కోట్లకు సవరించింది. 2017–18లో విద్యా శాఖకు రూ.12,705 కోట్లు కేటాయిం చింది. ఈసారి అదనంగా కేటాయించిన రూ.2,357 కోట్లలో పాఠశాల విద్యాశాఖకే రూ.1,990.66 కోట్ల(90 శాతం) నిధులను ఇవ్వడం విశేషం. సాంకేతిక విద్యకు బడ్జెట్లో కొద్దిగా కోత పెట్టగా, వర్సిటీలకు అదనంగా నిధులను కేటాయిం చింది. నిర్వహణ పద్దులో నిధులు నిర్వహణ వ్యయంతోపాటు వేతనాలు, కరువు భత్యం, ఇతర అలవె న్సుల కిందే ఖర్చు కానుండగా, ప్రగతి పద్దులో అదనంగా కేటాయించిన రూ.1,000 కోట్లకుపైగా నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించనుంది. కేజీ టు పీజీ ఊసేలేని బడ్జెట్ బడ్జెట్లో విద్యాశాఖకు నిధుల కేటాయింపును పెంచినా... కేజీ టు పీజీ ప్రస్తావన ఎక్కడా లేదు. కేజీ టు పీజీ కోసం నిధులను కేటాయించలేదు. పాఠశా ల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు రూ.14 వేల కోట్ల వరకు బడ్జెట్ కావాలని ప్రతిపాదించగా.. గతంలో కంటే ప్రభుత్వం ఎక్కువగా కేటాయించింది. అయితే అడిగిన మేరకు బడ్జెట్‌ను కేటాయిం చలేదు. విద్యా కార్యక్రమాల్లో వేగం పుంజు కోవాలంటే ఈ కేటాయింపులు (రూ. 12.705 కోట్లు) సరిపోవని, బడ్జెట్‌ను మరింత పెంచాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ బడ్జెట్లో కేజీ టు పీజీ ప్రస్తావన లేకపోవడాన్ని బట్టి చూస్తే ఉచిత కేజీ టు పీజీని ప్రభుత్వం పక్కన పెట్టినట్లు అర్థం అవుతోందని యూటీఎఫ్ పేర్కొంది. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే విద్యాశాఖకు కేవలం 8.49 శాతం బడ్జెట్ కేటాయించడం సరైంది కాదని, కనీసం 11 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తే బాగుండేది అని టీపీటీఎఫ్ పేర్కొంది. -
వర్సిటీలకు 820 కోట్లు
⇒ నిర్వహణకు రూ. 400.06 కోట్లు.. ⇒ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.420 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూనివర్సిటీల పటిష్టానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గతేడాది వర్సిటీల్లో అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు, పలు గ్రాంట్ల మేరకే నిధులిచ్చిన సర్కారు.. ఈసారి వేతనాల నిధులతోపాటు యూనివర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మరో రూ.420.89 కోట్లు కేటాయించింది. అటు ఉన్నత విద్య, సాంకేతిక విద్యకూ గణనీయ స్థాయిలో నిధులిచ్చింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా.. పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను కేటాయించే పథకాలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మధ్యాహ్న భోజన పథకం, ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కాంపొనెంట్ నిధుల కింద మొత్తంగా రూ.1,899 కోట్లు కేటాయించింది. గతేడాది ఈ కేటాయింపులు రూ.1,134 కోట్లు మాత్రమే. నిధులు భారీగా పెంచడం ద్వారా 2017–18లో ఆయా పథకాల కింద కేంద్రం నుంచి రూ. 2 వేల కోట్లకుపైగా రాబట్టుకునేలా చర్యలు చేపట్టింది. మరోవైపు పాఠశాల విద్యలో నిర్వహణ, వేతనాలు, కరువుభత్యం వ్యయం పెరిగిన నేపథ్యం లో నాన్‌ప్లాన్ కింద కేటాయింపులు రూ.6,940 కోట్ల నుంచి రూ.8,157 కోట్లకు పెరిగాయి. ఇక గతేడాది ప్రణాళిక పద్దు కింద రూ.1,283 కోట్లు ఇవ్వగా.. ఈసారి ప్రగతి (ప్రణాళిక) పద్దులో రూ.2,058 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు కోత! సాంకేతిక విద్యకు ప్రగతి పద్దులో కోత విధించింది. 2016–17లో ప్రణాళిక వ్యయం కింద రూ.179.64 కోట్లు ఇవ్వగా. తాజాగా రూ.60.85 కోట్లు మాత్రమే కేటాయించారు. నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.60 కోట్లు ఎక్కువగా ఇచ్చారు. వర్సిటీలకు ఊరట 2016–17 బడ్జెట్లో యూనివర్సిటీల్లో వేతనాలు చెల్లించేందుకు ప్రణాళికేతర పద్దు, ఇతర గ్రాంట్లు కింద కలిపి రూ.371.92 కోట్లు కేటాయించగా.. ప్రణాళికా వ్యయం కింద ఒక్క రూపాయీ ఇవ్వలేదు. ఈ సారి వర్సిటీల్లో వేతనాల కోసం నిర్వహణ పద్దు కింద రూ. 400.06 కోట్లు ఇవ్వడంతోపాటు.. ప్రగతి పద్దు కింద మరో రూ. 420.89 కోట్లను కేటాయించారు. ఉస్మానియా వర్సిటీకి శతాబ్ది ఉత్సవాలు, అభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఉన్నత విద్యలో వేతనాలు, ఖర్చులకు గతేడాది ప్రణాళికేతర పద్దు కింద రూ.1,489 కోట్లు ఇవ్వగా.. వివిధ కార్యక్రమాల కోసం ప్రణాళిక కింద రూ. 191 కోట్లు కేటాయించింది. ఈసారి నిర్వహణ (ప్రణాళికేతర) పద్దు కింద రూ.1,546 కోట్లు, ప్రగతి (ప్రణాళిక) పద్దు కింద రూ.563 కోట్లు కేటాయించారు. మరిన్ని ప్రధాన అంశాలకు కేటాయింపులు ► వర్సిటీల్లో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) కార్యక్రమాలకు రూ.48.33 కోట్లు. ► డిగ్రీ కాలేజీల్లో స్కిల్ అండ్ నాలెడ్జ్ కేంద్రాలకు రూ.3.25 కోట్లు. ల్యాబ్ పరికరాలకు కోటి, రూసా లో గిరిజన ప్రత్యేక నిధి కింద రూ.73.46 కోట్లు. ► డిగ్రీ కాలేజీల భవనాలకు రూ.5 కోట్లు. జూ. కాలేజీల్లో ఉచిత పాఠ్య పుస్తకాలకు రూ. 2.5 కోట్లు, కంప్యూటర్ విద్యకు రూ. 5.23 కోట్లు, భవ న నిర్మాణాలకు ఆర్ఐడీఎఫ్ కింద రూ. 46.26 కోట్లు. ► మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్‌లకు రూ.16.65 కోట్లు. సామర్థ్యాల పెంపునకు రూ.3 కోట్లు. కొత్త పాలిటెక్నిక్‌లకు రూ.8.83 కోట్లు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యామ్నాయ బోధనకు రూ. 20 కోట్లు. వంద శాతం హాజరున్న విద్యార్థుల కు ప్రోత్సాహకాలకు రూ.4.3 కోట్లు. పాలిటెక్నిక్ భవన నిర్మాణాలకు రూ. 28.41 కోట్లు. ► పాఠశాలల్లో భవన నిర్మాణాలు, మరమ్మతులకు రూ.48.35 కోట్లు, కేజీబీవీల్లో ప్రహరీగోడల నిర్మాణానికి రూ. 5 కోట్లు. మోడల్ స్కూళ్లలో మిగిలిన పనులకు రూ. 5 కోట్లు, గురుకుల భవన నిర్మాణాలకు రూ. 33.72 కోట్లు. ► మధ్యాహ్న భోజనానికి రూ.990 కోట్లు. -
కాబోయే అమ్మలకు అందలం
కేసీఆర్ అమ్మఒడి పేరుతో కొత్త పథకం రూపకల్పన ⇒ రూ.605 కోట్లతో గర్భిణులకు ప్రోత్సాహకం.. శిశువులకు కిట్లు ⇒ బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు రూ.5,976 కోట్లు కేటాయింపు ⇒ గత బడ్జెట్ రూ.5,966 కోట్లు ⇒ ఈసారి బడ్జెట్లో రూ. 5,976 కోట్లు సాక్షి, హైదరాబాద్: కాబోయే అమ్మలకు రాష్ట్ర బడ్జెట్ పెద్ద పీట వేసింది. ‘కేసీఆర్ అమ్మఒడి..’పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగా పేద గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించుకుంటే రూ.12 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. రూ.4 వేల చొప్పున మూడు విడతలుగా ఈ ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది. అలాగే బాలింతకు, పుట్టిన నవజాత శిశువుల సంరక్షణ కోసం 16 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ‘కేసీఆర్ కిట్లు’అని నామకరణం చేశారు. ఆడ శిశువులు జన్మిస్తే అదనంగా మరో రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.605 కోట్లు కేటాయించింది. అలాగే హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్లో ఒకటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని బడ్జెట్లో ప్రస్తావించింది. వీటికోసం దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకు బ్యాంకు రుణం తీసుకునే అవకాశముంది. స్వల్పంగా పెరిగిన బడ్జెట్.. వైద్య ఆరోగ్య శాఖకు 2016–17లో రూ.5,966.89 కోట్లు కేటాయించగా.. 2017–18 బడ్జెట్లో రూ.5,976.17 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే రూ.10 కోట్లే పెంచినట్లైంది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.3,310.09 కోట్లు, ప్రగతి పద్దు కింద 2,666.08 కోట్లు కేటాయించారు. డ్రగ్స్ కోసం 2016–17 బడ్జెట్లో రూ.223 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.300 కోట్లకు పెంచారు. మెడికల్ కాలేజీలకు రూ.42.24 కోట్లు, ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్ పరికరాల కొనుగోలుకు రూ.45 కోట్లు, ఆరోగ్యం, వైద్య విద్యలో మానవ వనరులను అభివృద్ధిపరచడం కోసం రూ.201 కోట్లు కేటాయించారు. మొత్తంగా వైద్య విద్యకు రూ.505.18 కోట్లు కేటాయించారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రానికి రూ.862.78 కోట్లు రానున్నాయి. వాటి ద్వారా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, సిబ్బంది నియామకాలు చేపడతారు. ముఖ్య కేటాయింపులు ఇవీ.. ► డ్రగ్స్, మెడిసిన్స్ కేంద్రీకృత కొనుగోలుకు రూ.245.19 కోట్లు ► నిమ్స్‌లో బీపీఎల్ కింద ఆరోగ్యశ్రీలోకి రాని పేదల వైద్యం కోసం రూ.10 కోట్లు. నిమ్స్‌లో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కోసం రూ.2 కోట్లు. నిమ్స్ అభివృద్ధికి రూ.36 కోట్లు కేటాయింపు. ► ఎన్హెచ్ఎం కింద స్వచ్ఛంద సంస్థల చేయూతకు రూ.10 కోట్లు ► 108, 104 అత్యవసర సర్వీసులకు కొత్త వాహనాల కొనుగోలుకు రూ.20 కోట్లు ► మృతదేహాల తరలింపు ఉచిత వాహనాలకు రూ.10.25 కోట్లు ► 108 సేవలకు 53.56 కోట్లు.. 104 సేవలకు 33.24 కోట్లు ► ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణకు రూ.15.38 కోట్లు ► ఆసుపత్రుల సమగ్ర నిర్వహణ, సేవల కోసం రూ.40 కోట్లు ► మెడికల్ కాలేజీలకు పరిశోధన నిధులు రూ.6 కోట్లు ► కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణం, ఇతరత్రా సాయానికి రూ.2 కోట్లు ► బీబీనగర్ రంగాపూర్ నిమ్స్ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.5 కోట్లు ► తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు సాయం కోసం రూ.65.15 కోట్లు, దానికింద ఉన్న ఆసుపత్రుల్లో వసతులు నిర్వహణ సర్వీసులకు రూ.40 కోట్లు, వాటి బలోపేతానికి రూ.కోటి, కంటిజెన్సీ ఫండ్ కింద రూ.8 కోట్లు కేసీఆర్ అమ్మ ఒడితో పేద గర్భిణులకు ప్రయోజనం రాష్ట్ర బడ్జెట్ చాలా బాగుంది. కేసీఆర్ అమ్మ ఒడి పథకం వల్ల పేద గర్భిణులకు రూ.12 వేల ప్రోత్సాహకం రానుంది. దీనివల్ల వారికి సరైన పోషకాహారం ఇవ్వడానికి, వారు పనికి వెళ్లలేని పరిస్థితుల్లో ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడనుంది. కేసీఆర్ కిట్స్ వల్ల నవజాత శిశువులకు, బాలింతలకు ఉపయోగపడే వస్తువులు అందజేస్తాం. – డాక్టర్ లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
మేడిపండు చందంగా బడ్జెట్
మేడిపండు చందంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.3,391 కోట్లు ఉండగా, ఈ బడ్జెట్లో కేవలం రూ.1,939 కోట్లు కేటాయించారు. దీనివల్ల పేదవిద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 2.6 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామని చెప్పి ఇప్పటికి 1,400 మాత్రం నిర్మించారు. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కలగా మిగిలిపోవాల్సిందేనా ? సాగునీటి ప్రాజెక్టులకు 2016–17లో రూ.25 వేల కోట్లు కేటాయించి, రూ.11,500 కోట్లే ఖర్చుచేశారు. మళ్లీ 2017–18లో రూ.25 వేల కోట్లు కేటాయించడం హాస్యాస్పదం. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.1.50 లక్షల కోట్లు కావాలి. ఇప్పటికి రూ.25–30 వేల కోట్లే వ్యయంచేశారు. వచ్చే రెండేళ్లలో ఎన్ని కోట్లు కేటాయించి ఎప్పటిలోగా ప్రాజెక్టులను పూర్తిచేస్తారో చెప్పాలి. ఎస్సీ ఉపప్రణాళిక కింద 2016–17లో రూ.10,483 కోట్లు కేటాయించి, కేవలం రూ.4,250 కోట్లు ఖర్చుచేశారు. ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.6,171 కోట్లు కేటాయించి, అందులో 40 శాతం కూడా ఖర్చు చేయలేదు. 2017–18లోనైనా ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన రూ.22,540 కోట్లు పూర్తిస్థాయిలో ఖర్చుచేయాలి. వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన ప్రభుత్వం నామమాత్రంగా రూ.4,120 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. – డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు -
ఆర్టీసీకి స్వల్ప ఊరట
బడ్జెట్లో రూ.వెయ్యి కోట్ల కేటాయింపు అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని ప్రభుత్వం కాస్త కనికరించింది. బడ్జెట్లో దాదాపు రూ.1,000 కోట్లు కేటాయించింది. రాయితీ పాస్‌ల రూపంలో ఆర్టీసీ ఏటా రూ.520 కోట్ల దాకా నష్టపోతోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి తిరిగి చెల్లించాల్సి ఉంది. తాజా బడ్జెట్లో ఆ పద్దు కింద రూ.520 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలుకు రుణంగా రూ.140 కోట్లు, ప్రభుత్వ పూచీకత్తుపై ఆర్టీసీ తీసుకున్న రుణాల చెల్లింపుకు రూ.334 కోట్లు కేటాయించింది. వెరసి రూ.1,000 కోట్లు చూపడంపై ఆర్టీసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్చకులకు శుభవార్త ఉద్యోగుల తరహాలో తమకు కూడా ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలన్న దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయ అర్చకులు, ఉద్యోగుల డిమాండును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వారికి జీతాల కోసం బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించింది. ఆలయాల ఆదాయం నుంచి 12 శాతం దేవాదాయ శాఖ తీసుకునే మొత్తానికి దీన్ని జత చేసి జీతాల నిధిగా చూపనున్నారు. దేవాదాయ శాఖ సర్వశ్రేయో నిధికి రూ.50 కోట్లు గ్రాంటుగా ప్రకటించింది. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలను ధూపదీప నైవేద్యాల పథకం కిందకు తేవటం, బలహీన వర్గాల కాలనీల్లో రామాలయాల నిర్మాణానికి వీటిని వినియోగిస్తారు. పర్యాటకానికి రూ.93 కోట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖకు బడ్జెట్లో రూ.93 కోట్లు కేటాయించారు. తెలంగాణ సాంస్కృతిక సారథికి రూ.17.12 కోట్లు, వృద్ధ కళాకారుల పించన్‌కు రూ.5.85 కోట్లు, సాంస్కృతిక అకాడమీలకు రూ.13 కోట్లు కేటాయించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రభుత్వం కొనసాగించింది. పరిశ్రమలు, వాటి పరిధిలోని లిడ్‌క్యాప్, చేనేత, చక్కెర, గనుల శాఖకు కలిపి మొత్తం రూ.985.15 కోట్లు కేటాయించింది. ఇందులో పరిశ్రమల ప్రోత్సాహక రాయితీల కింద రూ.155.39 కోట్లు, విద్యుత్ రాయితీలకు రూ.180 కోట్లు కేటాయించింది. మెదక్ జిల్లాలోని నిమ్జ్ ప్రాజెక్టుకు భూ సేకరణ కోసం కేటాయింపులను రూ.200 కోట్లకు పెంచింది. చేనేత, జౌళి శాఖకు గతేడాది తరహాలోనే రూ.83 కోట్ల కేటాయింపులను కొనసాగించింది. ‘విద్యుత్’ సబ్సిడీలు అంతంతే! రూ.5,340 కోట్ల లోటు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచడం తప్పేలా లేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యంలో విద్యుత్ సబ్సిడీలను పెంచాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017–18లో ఆర్థిక లోటును రూ.9824 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. ఇందులో రూ.7150.13 కోట్లను సబ్సిడీగా ప్రభుత్వం భరించాలని కోరగా, తాజా బడ్జెట్లో రూ.4484.3 కోట్లు మాత్రమే కేటాయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సబ్సిడీ కింద కేవలం రూ.3387.8 కోట్లు కేటాయించింది. 100 యూనిట్లలోపు వాడే వినియోగదారులకు సబ్సిడీ కింద మరో రూ.988.09 కోట్లు కేటాయించింది. అలా చూసినా రూ.5340 కోట్ల లోటు అలాగే ఉండనుంది. చార్జీల పెంపుతో రూ.2,300 కోట్ల దాకా పూడ్చుకునేందుకు డిస్కంలు ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నాయి. అందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా మరో రూ.3,000 కోట్ల దాకా లోటును ఎదుర్కోనున్నాయి. ఉజ్వల్ డిస్కం అష్యురెన్స్ యోజన (ఉదయ్) పథకంలో చేరి అప్పుల భారం నుంచి విముక్తి పొందిన డిస్కంలు మళ్లీ అప్పులు, నష్టాల బాటపట్ టేసూచనలు కనిపిస్తున్నాయి. -
పోలీస్... ధనా ధన్!
ఆధునీకరణ, టెక్నాలజీ వినియోగానికి భారీగా నిధులు ⇒ రూ.975.95 కోట్లు హోంశాఖకు ప్రగతి బడ్జెట్ కింద ⇒ రూ.3852.21 కోట్లు నిర్వహణ పద్దు కింద కేటాయింపులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్లో హోంశాఖకు అగ్రతాంబూలం దక్కింది. పూర్తి స్థాయి ఆధునీకరణ, టెక్నాలజీ వినియోగం, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. నిర్వహణ పద్దు కింద రూ.3,852.21 కోట్లు కేటాయించగా, ప్రగతి పద్దు కింద హోం శాఖకు రూ.975.95 కోట్లు ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. హోంశాఖ కింద విభాగాలుగా ఉన్న డీజీపీ(హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్), జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ, సైనిక్ వెల్ఫేర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, కమిషనర్ ప్రింటింగ్, పోలీస్ అకాడమీ, నగర కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, ఇంటెలిజెన్స్ విభాగం, హోంగార్డు విభాగం, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు సముచిత స్థానం కల్పిస్తూ బడ్జెట్ ప్రతిపాదించారు. సీక్రెట్ సర్వీసెస్‌కు రూ.11.6 కోట్లు.. పోలీస్ శాఖలోని కమిషనర్లు, ఎస్పీలు, పోలీస్ దళాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో రహస్య కార్యకలాపాలకు రూ.11.66 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో డీజీపీ కింద సీక్రెట్ సర్వీసెస్ వాటా రూ.4.58 కోట్లు, నగర కమిషనర్ వాటా కింద రూ.1.2 కోట్లు కేటాయించారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు రూ.60 లక్షల చొప్పున కేటాయించారు. మిగిలిన జిల్లాలకు రూ.12 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. నగర పోలీస్‌కు ‘సింహ భాగం’ పోలీస్ శాఖకు ప్రగతి పద్దుల కింద కేటాయించిన రూ.975 కోట్లలో హైదరాబాద్ నగర కమిషనరేట్‌కు ప్రధాన వాటా దక్కింది. నగర కమిషనరేట్‌కు రూ.509.21 కోట్లు కేటాయించారు. సీసీటీవీలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐటీ బ్యాక్ బోన్ సపోర్ట్ నిర్వహణ, పోలీస్స్టేషన్ల ఆధునీకరణ కింద ఈ నిధులు ఉపయోగించుకునేందుకు వీలు కల్పించారు. ఆధునీకరణకు రూ.76 కోట్లు రాష్ట్ర పోలీస్ శాఖలో కీలకంగా ఉన్న దళాల ఆధునీ కరణ, ఆయుధాలు, ఎక్విప్మెంట్ తదితరాలకు రాష్ట్ర వాటా కింద రూ.76.29 కోట్లు కేటాయించారు. అయితే ప్రతి ఏటా మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నిధుల్లో రాష్ట్ర వాటాగా రూ.76.29 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో ప్రభుత్వం స్ప ష్టంచేసింది. ప్రతీ జిల్లాలోనూ ఉన్న పోలీస్ శిక్ష ణ కేంద్రాలను ఆధునీకరించడానికి, మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు రూ.15 కోట్లు కేటాయించారు. హోంగార్డులకు పెద్దగా దక్కని ప్రాధాన్యత ఈ బడ్జెట్లో హోంగార్డు లకు రూ.1.73 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇటీవలే సీఎం కేసీఆర్ హోంగార్డులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు జీతభత్యాలను పెంచుతామని ప్రకటించారు. దీంతో ఈ హామీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఓకే అవుతుందా? లేక ఇదే ఏడాది ప్రత్యేక నిధుల ద్వారా అమలు చేస్తారా అన్న అంశంపై సందిగ్ధత ఏర్పడింది. నిర్మాణాలకు రూ.94 కోట్లు.. కొత్త జిల్లాలు, కొత్త బెటాలియన్లకు సంబంధించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్, బ్యారక్ తదితర నిర్మాణాలకు రూ.76 కోట్లు కేటాయించారు. ఇందులో వరంగల్ కమిషనరేట్ నిర్మాణానికి రూ.10 కోట్లు ఇచ్చారు. భవనాల నిర్మాణానికి రూ.43 కోట్లు, టెక్నాలజీ బ్యాక్ బోన్, సిటీజన్ సెంట్రల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కింద రూ.5కోట్లు, ఐటీ బ్యాక్ బోన్, డాటా అనలైటిక్ కింద రూ.5 కోట్లు, అర్బన్ ప్రాంతాల్లో సీసీటీవీల ఏర్పాటుకు రూ.5 కోట్లు, కొత్త ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ల నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారు. ‘గిరిజన’ పథకాలకు రూ.15 కోట్లు గిరిజన యువకులు మావోయిజం బాట పట్టకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలకు రూ.15.62 కోట్లు కేటాయించింది. ఆ ప్రాంతాల్లో పోలీస్ ఆధునీకరణ కోసం మరో రూ.9.17 కోట్లు కేటాయిస్తున్నట్టు స్పష్టంచేసింది. అగ్నిమాపక కేంద్రాలకు రూ.12 కోట్లు నూతన అగ్నిమాపక కేంద్రాలు, భవన నిర్మాణాలకు రూ.12.23 కోట్లు కేటాయించింది. 2016–17లో రూ.47.30 కోట్లు కేటాయించగా, రూ.20 కోట్లు ఉపయోగించారు. మిగిలిన రూ.27 కోట్లను సవరిస్తున్నట్టు స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రూ.101 కోట్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ఎల్‌డబ్ల్యూఈ కింద ఈ ఆర్థిక సంవత్సరం రూ.101.10 కోట్లు కేటాయించనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. డీజీపీ యూనిట్‌కు ఈ నిధులు కేటాయించి షెడ్యూల్ కులాల ప్రగతికి కృషి చేయనున్నట్టు తెలిపింది. ప్రాధాన్యతనివ్వడం ఎనలేని తోడ్పాటు డీజీపీ అనురాగ్ శర్మ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పోలీస్ శాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి తాము ప్రతిపాదించిన మేరకు నిధులను కేటాయిస్తున్నారని, ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణలో తమ సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేస్తారని తెలిపారు. టెక్నాలజీ వినియోగం, నూతన నిర్మాణాలు, ప్రపంచ స్థాయి పోలీసింగ్, నేరాల నియంత్రణ, పోలీస్ సంక్షేమం కోసం నిధులు కేటాయించడం శుభపరిణామమని అన్నారు. -
పంచాయతీరాజ్‌కు రూ.14,723 కోట్లు
వ్యవస్థ పటిష్టం కోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు ⇒ ఆసరాకు అవసరానికి మించి రూ.5,330.59 కోట్లు ⇒ ‘భగీరథ’కు 80% అప్పులే.. బడ్జెట్ సపోర్ట్ రూ.3,000 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలను పటిష్టం చేయడంతో పాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం 2017–18 వార్షిక బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు భారీ స్థాయిలో కేటాయింపు చేసింది. 2016–17 బడ్జెట్లో పీఆర్అండ్ఆర్డీకి రూ.11,031 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజా బడ్జెట్లో రూ.14,723.42 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.1,891.09 కోట్లను నిర్వహణ పద్దుగా చూపగా, అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.12,832.32 కోట్లు కేటాయించింది. నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి రూ.3 కోట్లు.. ప్రగతి పద్దులో జిల్లా పరిషత్తులకు సాయం, స్థానిక సంస్థలకు ఎస్ఎఫ్సీ గ్రాంట్ కలిపి రూ.111 కోట్లు, మండల పరిషత్తులకు రూ.61.50 కోట్లు, గ్రామ పంచాయతీల కోసం రూ.52.10 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రహదారుల నిర్మాణానికి రూ.484.60 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.146.77 కోట్లు, గిరిజన సబ్‌ప్లాన్ కింద రూ.86 కోట్లు ప్రకటించింది. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి మిషన్ భగీరథతో కలిపి రూ.3,228.37 కోట్లు కేటాయించింది. గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు ఇలా.. గ్రామీణాభివృద్ధికి నిర్వహణ పద్దు కింద బడ్జెట్లో రూ.58.41 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ప్రగతి పద్దు కింద రూ.7,384 కోట్లు చూపింది. రూర్బన్, టీఆర్ఐజీపీ, ఎన్ఆర్ఎల్ఎం.. తదితర పథకాల అమలు కోసం రూ.330 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఉపాధిహామీ పథకానికి రూ.3 వేల కోట్లు, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థకు రూ.6.04 కోట్లు కేటాయించారు. ఆసరాకు భారీ కేటాయింపులు సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’కు ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. పథకం కింద ప్రస్తుతం 36 లక్షల మంది లబ్ధిదారులుండగా, నెలనెలా పింఛన్ల కోసం ఏడాదికి రూ.4,800 కోట్లు అవసరమవుతున్నాయి. ఏప్రిల్ 1నుంచి ఒంటరి మహిళలకూ ఆసరా కింద ఆర్థిక భృతి అందించాలని నిర్ణయించడంతో సుమారు 2 లక్షల మందికి మరో రూ,.247 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆసరాకు రూ.5,247 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం రూ.5,330.59 కోట్లు కేటాయించడం విశేషం. అప్పులతోనే భగీరథ! మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు వివిధ ఆర్థిక సంస్థలిచ్చే అప్పులే ఆధారం కానున్నాయి. రూ.42 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు బ్యాంకు రుణాల ద్వారానే నిధులు సమకూర్చాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ప్రాజెక్ట్ పరిధిలోని వివిధ సెగ్మెంట్లకు 80% మించి రుణాలిచ్చేందుకు బ్యాంకు లు అంగీకరించకపోవడంతో 20 శాతం నిధులను బడ్జెట్ సపోర్ట్‌గా అందిం చేందుకు ప్రభు త్వం సన్నద్ధమైంది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. తన వాటా నిధుల కింద రూ.3 వేల కోట్లు కేటాయించింది. -
అప్పుల్లోనూ గొప్పే!
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఏకంగా రూ. 69 వేల కోట్ల అప్పులతో తెలంగాణను దేశంలోనే అత్యధిక రుణభారంగల రాష్ట్రంగా మార్చి ‘రికార్డు’సృష్టించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అవాస్తవికంగా, అబద్ధపు అంకెలతో గారడీ చేసేలా ఉందని విమర్శించారు. అడ్డగోలుగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతూ ప్రభుత్వం ప్రమాదకరబాటలో పయనిస్తోందని మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సోమవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే నాటికి 70 వేల కోట్ల అప్పులుండగా ఈ రెండున్నరేళ్లలోనే అవి రూ. 1.40 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. వీటికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న కార్పొరేషన్ల రుణాలు కూడా కలిపితే అప్పులు రూ. 1.85 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. అప్పులను పెంచడం ద్వారా సర్కారు భావితరాలనూ తాకట్టుపెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఓవైపు అప్పులు తెస్తూ మరోవైపు కమీషన్లు వచ్చే మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకే నిధులు కేటాయించిందని ఆరోపించారు. పథకాలకు నిధులేవీ...? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, దళిత, గిరిజన, పేదలకు మూడెకరాల భూపంపిణీ వంటి పథకాలకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఉత్తమ్ ఆరోపించారు. కమీషన్లు రావనే కారణంతోనే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సర్కారు తప్పుడు లెక్కలు చూపుతోందని మండిపడ్డారు. ఫీజు బకాయిలు రూ. 3,500 కోట్లకు చేరాయన్నారు. 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశామన్న ప్రభుత్వం కేవలం 1,400 ఇళ్లు కట్టడం దారుణమన్నారు. బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులను ప్రభుత్వం తగ్గించిందని, రైతు రుణమాఫీ అమల్లో మోసపూరితంగా వ్యవహరించిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్‌కార్డుల జారీపై ప్రభుత్వం ఇంకా మోసం చేస్తూనే ఉందన్నారు. ప్రభుత్వోద్యోగులకు హెల్త్‌కార్డులు ఇస్తున్నా అవి పనిచేయట్లేదని, ప్రైవేటు ఆసుపత్రులు వారికి వైద్యాన్ని అందించట్లేదని ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్లను కుంటిసాకులతో వాయిదా వేస్తున్నారని విమర్శించారు.