వర్సిటీలకు 820 కోట్లు | 820 crore to the universities | Sakshi
Sakshi News home page

వర్సిటీలకు 820 కోట్లు

Published Tue, Mar 14 2017 4:48 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

వర్సిటీలకు 820 కోట్లు - Sakshi

వర్సిటీలకు 820 కోట్లు

నిర్వహణకు రూ. 400.06 కోట్లు..
అభివృద్ధి కార్యక్రమాలకు రూ.420 కోట్లు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యూనివర్సిటీల పటిష్టానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గతేడాది వర్సిటీల్లో అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు, పలు గ్రాంట్ల మేరకే నిధులిచ్చిన సర్కారు.. ఈసారి వేతనాల నిధులతోపాటు యూనివర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద మరో రూ.420.89 కోట్లు కేటాయించింది. అటు ఉన్నత విద్య, సాంకేతిక విద్యకూ గణనీయ స్థాయిలో నిధులిచ్చింది.

కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా..
పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను కేటాయించే పథకాలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ), మధ్యాహ్న భోజన పథకం, ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కాంపొనెంట్‌ నిధుల కింద మొత్తంగా రూ.1,899 కోట్లు కేటాయించింది. గతేడాది ఈ కేటాయింపులు రూ.1,134 కోట్లు మాత్రమే. నిధులు భారీగా పెంచడం ద్వారా 2017–18లో ఆయా పథకాల కింద కేంద్రం నుంచి రూ. 2 వేల కోట్లకుపైగా రాబట్టుకునేలా చర్యలు చేపట్టింది. మరోవైపు పాఠశాల విద్యలో నిర్వహణ, వేతనాలు, కరువుభత్యం వ్యయం పెరిగిన నేపథ్యం లో నాన్‌ప్లాన్‌ కింద కేటాయింపులు రూ.6,940 కోట్ల నుంచి రూ.8,157 కోట్లకు పెరిగాయి. ఇక గతేడాది ప్రణాళిక పద్దు కింద రూ.1,283 కోట్లు ఇవ్వగా.. ఈసారి ప్రగతి (ప్రణాళిక) పద్దులో రూ.2,058 కోట్లు కేటాయించారు.

సాంకేతిక విద్యకు కోత!
సాంకేతిక విద్యకు ప్రగతి పద్దులో కోత విధించింది. 2016–17లో ప్రణాళిక వ్యయం కింద రూ.179.64 కోట్లు ఇవ్వగా. తాజాగా రూ.60.85 కోట్లు మాత్రమే కేటాయించారు. నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.60 కోట్లు ఎక్కువగా ఇచ్చారు.

వర్సిటీలకు ఊరట
2016–17 బడ్జెట్‌లో యూనివర్సిటీల్లో వేతనాలు చెల్లించేందుకు ప్రణాళికేతర పద్దు, ఇతర గ్రాంట్లు కింద కలిపి రూ.371.92 కోట్లు కేటాయించగా.. ప్రణాళికా వ్యయం కింద ఒక్క రూపాయీ ఇవ్వలేదు. ఈ సారి వర్సిటీల్లో వేతనాల కోసం నిర్వహణ పద్దు కింద రూ. 400.06 కోట్లు ఇవ్వడంతోపాటు.. ప్రగతి పద్దు కింద మరో రూ. 420.89 కోట్లను కేటాయించారు. ఉస్మానియా వర్సిటీకి శతాబ్ది ఉత్సవాలు, అభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఉన్నత విద్యలో వేతనాలు, ఖర్చులకు గతేడాది ప్రణాళికేతర పద్దు కింద రూ.1,489 కోట్లు ఇవ్వగా.. వివిధ కార్యక్రమాల కోసం ప్రణాళిక కింద రూ. 191 కోట్లు కేటాయించింది. ఈసారి నిర్వహణ (ప్రణాళికేతర) పద్దు కింద రూ.1,546 కోట్లు, ప్రగతి (ప్రణాళిక) పద్దు కింద రూ.563 కోట్లు కేటాయించారు.

మరిన్ని ప్రధాన అంశాలకు కేటాయింపులు
► వర్సిటీల్లో రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) కార్యక్రమాలకు రూ.48.33 కోట్లు.
► డిగ్రీ కాలేజీల్లో స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ కేంద్రాలకు రూ.3.25 కోట్లు. ల్యాబ్‌ పరికరాలకు కోటి, రూసా లో గిరిజన ప్రత్యేక నిధి కింద రూ.73.46 కోట్లు.
► డిగ్రీ కాలేజీల భవనాలకు రూ.5 కోట్లు. జూ. కాలేజీల్లో ఉచిత పాఠ్య పుస్తకాలకు రూ. 2.5 కోట్లు, కంప్యూటర్‌ విద్యకు రూ. 5.23 కోట్లు, భవ న నిర్మాణాలకు ఆర్‌ఐడీఎఫ్‌ కింద రూ. 46.26 కోట్లు.
► మోడల్‌ రెసిడెన్షియల్‌ పాలిటెక్నిక్‌లకు రూ.16.65 కోట్లు. సామర్థ్యాల పెంపునకు రూ.3 కోట్లు. కొత్త పాలిటెక్నిక్‌లకు రూ.8.83 కోట్లు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యామ్నాయ బోధనకు రూ. 20 కోట్లు. వంద శాతం హాజరున్న విద్యార్థుల కు ప్రోత్సాహకాలకు రూ.4.3 కోట్లు. పాలిటెక్నిక్‌ భవన నిర్మాణాలకు రూ. 28.41 కోట్లు.
► పాఠశాలల్లో భవన నిర్మాణాలు, మరమ్మతులకు రూ.48.35 కోట్లు, కేజీబీవీల్లో ప్రహరీగోడల నిర్మాణానికి రూ. 5 కోట్లు. మోడల్‌ స్కూళ్లలో మిగిలిన పనులకు రూ. 5 కోట్లు, గురుకుల భవన నిర్మాణాలకు రూ. 33.72 కోట్లు.
► మధ్యాహ్న భోజనానికి రూ.990 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement