కాబోయే అమ్మలకు అందలం
కేసీఆర్ అమ్మఒడి పేరుతో కొత్త పథకం రూపకల్పన
⇒ రూ.605 కోట్లతో గర్భిణులకు ప్రోత్సాహకం.. శిశువులకు కిట్లు
⇒ బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు రూ.5,976 కోట్లు కేటాయింపు
⇒ గత బడ్జెట్ రూ.5,966 కోట్లు
⇒ ఈసారి బడ్జెట్‌లో రూ. 5,976 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కాబోయే అమ్మలకు రాష్ట్ర బడ్జెట్ పెద్ద పీట వేసింది. ‘కేసీఆర్ అమ్మఒడి..’పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగా పేద గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించుకుంటే రూ.12 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. రూ.4 వేల చొప్పున మూడు విడతలుగా ఈ ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది. అలాగే బాలింతకు, పుట్టిన నవజాత శిశువుల సంరక్షణ కోసం 16 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ‘కేసీఆర్ కిట్లు’అని నామకరణం చేశారు. ఆడ శిశువులు జన్మిస్తే అదనంగా మరో రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.605 కోట్లు కేటాయించింది. అలాగే హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్‌లో ఒకటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని బడ్జెట్లో ప్రస్తావించింది. వీటికోసం దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకు బ్యాంకు రుణం తీసుకునే అవకాశముంది.
స్వల్పంగా పెరిగిన బడ్జెట్..
వైద్య ఆరోగ్య శాఖకు 2016–17లో రూ.5,966.89 కోట్లు కేటాయించగా.. 2017–18 బడ్జెట్లో రూ.5,976.17 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే రూ.10 కోట్లే పెంచినట్లైంది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.3,310.09 కోట్లు, ప్రగతి పద్దు కింద 2,666.08 కోట్లు కేటాయించారు. డ్రగ్స్ కోసం 2016–17 బడ్జెట్లో రూ.223 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.300 కోట్లకు పెంచారు. మెడికల్ కాలేజీలకు రూ.42.24 కోట్లు, ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్ పరికరాల కొనుగోలుకు రూ.45 కోట్లు, ఆరోగ్యం, వైద్య విద్యలో మానవ వనరులను అభివృద్ధిపరచడం కోసం రూ.201 కోట్లు కేటాయించారు. మొత్తంగా వైద్య విద్యకు రూ.505.18 కోట్లు కేటాయించారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రానికి రూ.862.78 కోట్లు రానున్నాయి. వాటి ద్వారా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, సిబ్బంది నియామకాలు చేపడతారు.
ముఖ్య కేటాయింపులు ఇవీ..
► డ్రగ్స్, మెడిసిన్స్ కేంద్రీకృత కొనుగోలుకు రూ.245.19 కోట్లు
► నిమ్స్‌లో బీపీఎల్ కింద ఆరోగ్యశ్రీలోకి రాని పేదల వైద్యం కోసం రూ.10 కోట్లు. నిమ్స్‌లో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కోసం రూ.2 కోట్లు. నిమ్స్ అభివృద్ధికి రూ.36 కోట్లు కేటాయింపు.
► ఎన్‌హెచ్‌ఎం కింద స్వచ్ఛంద సంస్థల చేయూతకు రూ.10 కోట్లు
► 108, 104 అత్యవసర సర్వీసులకు కొత్త వాహనాల కొనుగోలుకు రూ.20 కోట్లు
► మృతదేహాల తరలింపు ఉచిత వాహనాలకు రూ.10.25 కోట్లు
► 108 సేవలకు 53.56 కోట్లు.. 104 సేవలకు 33.24 కోట్లు
► ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణకు రూ.15.38 కోట్లు
► ఆసుపత్రుల సమగ్ర నిర్వహణ, సేవల కోసం రూ.40 కోట్లు
► మెడికల్ కాలేజీలకు పరిశోధన నిధులు రూ.6 కోట్లు
► కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణం, ఇతరత్రా సాయానికి రూ.2 కోట్లు
► బీబీనగర్ రంగాపూర్ నిమ్స్ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.5 కోట్లు
► తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు సాయం కోసం రూ.65.15 కోట్లు, దానికింద ఉన్న ఆసుపత్రుల్లో వసతులు నిర్వహణ సర్వీసులకు రూ.40 కోట్లు, వాటి బలోపేతానికి రూ.కోటి, కంటిజెన్సీ ఫండ్ కింద రూ.8 కోట్లు
కేసీఆర్ అమ్మ ఒడితో పేద గర్భిణులకు ప్రయోజనం
రాష్ట్ర బడ్జెట్ చాలా బాగుంది. కేసీఆర్ అమ్మ ఒడి పథకం వల్ల పేద గర్భిణులకు రూ.12 వేల ప్రోత్సాహకం రానుంది. దీనివల్ల వారికి సరైన పోషకాహారం ఇవ్వడానికి, వారు పనికి వెళ్లలేని పరిస్థితుల్లో ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడనుంది. కేసీఆర్ కిట్స్ వల్ల నవజాత శిశువులకు, బాలింతలకు ఉపయోగపడే వస్తువులు అందజేస్తాం.
– డాక్టర్ లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి