మేడిపండు చందంగా బడ్జెట్
మేడిపండు చందంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.3,391 కోట్లు ఉండగా, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.1,939 కోట్లు కేటాయించారు. దీనివల్ల పేదవిద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 2.6 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లు కడతామని చెప్పి ఇప్పటికి 1,400 మాత్రం నిర్మించారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కలగా మిగిలిపోవాల్సిందేనా ? సాగునీటి ప్రాజెక్టులకు 2016–17లో రూ.25 వేల కోట్లు కేటాయించి, రూ.11,500 కోట్లే ఖర్చుచేశారు. మళ్లీ 2017–18లో రూ.25 వేల కోట్లు కేటాయించడం హాస్యాస్పదం. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.1.50 లక్షల కోట్లు కావాలి. ఇప్పటికి రూ.25–30 వేల కోట్లే వ్యయంచేశారు.
వచ్చే రెండేళ్లలో ఎన్ని కోట్లు కేటాయించి ఎప్పటిలోగా ప్రాజెక్టులను పూర్తిచేస్తారో చెప్పాలి. ఎస్సీ ఉపప్రణాళిక కింద 2016–17లో రూ.10,483 కోట్లు కేటాయించి, కేవలం రూ.4,250 కోట్లు ఖర్చుచేశారు. ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.6,171 కోట్లు కేటాయించి, అందులో 40 శాతం కూడా ఖర్చు చేయలేదు. 2017–18లోనైనా ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన రూ.22,540 కోట్లు పూర్తిస్థాయిలో ఖర్చుచేయాలి. వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన ప్రభుత్వం నామమాత్రంగా రూ.4,120 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది.
– డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు