‘ఫీజు’లకు సరిపోయేనా..!
⇒ ఫీజు బకాయిలు రూ.2,827 కోట్లు
⇒ బడ్జెట్ కేటాయింపులు రూ. 1,939 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం అంతంత మాత్రం కేటా యింపులే చేసింది. బడ్జెట్‌లో ఫీజు పథకానికి రూ.1,939.31 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు సంబంధించి ఫీజు బకాయిలు రూ.2,827.45 కోట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి 13.65 లక్షల మంది విద్యార్థులకుగాను రూ.1,606.89 కోట్లు అవసరమని సంక్షేమ శాఖలు ప్రతిపాదనలను ఇటీవలే ప్రభుత్వానికి నివేదించాయి. 2015–16 సంవత్సరానికి సంబంధించి రూ.1,220.56 కోట్లు బకాయిలున్నాయి. తాజా బడ్జెట్‌లో కేవలం రూ.1,939.31 కోట్లు కేటాయించడంతో పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించడం కష్టమే.
ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి..
ఫీజు పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. విద్యాసంవత్సరం ముగిశాకే నిధులు విడుదల చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వాస్తవానికి బడ్జెట్ లో కేటాయించిన నిధులు విడుదల చేయడం లోనూ జాప్యం చేస్తుండటం, డిమాండ్‌కు తగినట్లు కేటా యింపులు చేయకపో వడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. గతేడాది ఫీజు బకా యిలు చెల్లించకపో వడంతో పలువురు విద్యార్థులు కోర్సు పూర్తిచేసినా సర్టిఫికెట్లను కాలేజీల యాజమాన్యాలు తమ దగ్గరే ఉంచుకున్నాయి. దీంతో వారంతా ఉద్యోగాలు వచ్చినా ఒరిజినల్ ధ్రువపత్రాలు లేక కంపెనీల్లో చేరలేకపోయారు.