విద్యా శాఖకు 12,705 కోట్లు
గతేడాది కంటే రూ.2,357 కోట్లు అదనంగా కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో విద్యాశాఖకు అదనంగా నిధులు లభించాయి. గత ఏడాది సవరించిన అంచనాలకంటే ఈసారి రూ.2,357 కోట్లు అదనంగా ఇచ్చింది. నిర్వహణ పద్దు కింద రూ.1,000 కోట్లకుపైగా కేటాయింపులు పెంచగా, ప్రగతి పద్దులోనూ మరో రూ.1,000 కోట్లకుపైగా నిధులు పెంచింది. 2016–17లో ప్రభుత్వం విద్యా శాఖకు 10,736 కోట్లను కేటాయించ గా.. దానిని రూ.10,348 కోట్లకు సవరించింది. 2017–18లో విద్యా శాఖకు రూ.12,705 కోట్లు కేటాయిం చింది. ఈసారి అదనంగా కేటాయించిన రూ.2,357 కోట్లలో పాఠశాల విద్యాశాఖకే రూ.1,990.66 కోట్ల(90 శాతం) నిధులను ఇవ్వడం విశేషం. సాంకేతిక విద్యకు బడ్జెట్‌లో కొద్దిగా కోత పెట్టగా, వర్సిటీలకు అదనంగా నిధులను కేటాయిం చింది. నిర్వహణ పద్దులో నిధులు నిర్వహణ వ్యయంతోపాటు వేతనాలు, కరువు భత్యం, ఇతర అలవె న్సుల కిందే ఖర్చు కానుండగా, ప్రగతి పద్దులో అదనంగా కేటాయించిన రూ.1,000 కోట్లకుపైగా నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించనుంది.
కేజీ టు పీజీ ఊసేలేని బడ్జెట్
బడ్జెట్‌లో విద్యాశాఖకు నిధుల కేటాయింపును పెంచినా... కేజీ టు పీజీ ప్రస్తావన ఎక్కడా లేదు. కేజీ టు పీజీ కోసం నిధులను కేటాయించలేదు. పాఠశా ల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు రూ.14 వేల కోట్ల వరకు బడ్జెట్ కావాలని ప్రతిపాదించగా.. గతంలో కంటే ప్రభుత్వం ఎక్కువగా కేటాయించింది. అయితే అడిగిన మేరకు బడ్జెట్‌ను కేటాయిం చలేదు. విద్యా కార్యక్రమాల్లో వేగం పుంజు కోవాలంటే ఈ కేటాయింపులు (రూ. 12.705 కోట్లు) సరిపోవని, బడ్జెట్‌ను మరింత పెంచాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ బడ్జెట్‌లో కేజీ టు పీజీ ప్రస్తావన లేకపోవడాన్ని బట్టి చూస్తే ఉచిత కేజీ టు పీజీని ప్రభుత్వం పక్కన పెట్టినట్లు అర్థం అవుతోందని యూటీఎఫ్ పేర్కొంది. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే విద్యాశాఖకు కేవలం 8.49 శాతం బడ్జెట్ కేటాయించడం సరైంది కాదని, కనీసం 11 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తే బాగుండేది అని టీపీటీఎఫ్ పేర్కొంది.