పట్టణాభివృద్ధికి చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో పాత పంథానే కొనసాగించింది. హైదరాబాద్ విషయానికి వస్తే మాసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్లు, నగర రోడ్ల అభివృద్ధికి మరో రూ.377.35 కోట్లను కేటాయించింది. అలాగే రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.426.41 కోట్లు కేటాయించగా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా పురపాలికలకు సహాయక నిధి పద్దు కింద రూ.117.23 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రయోజిత పథకాలైన స్మార్ట్ సిటీకి రూ.150.94 కోట్లు, అమృత్‌కు మరో రూ.203.96 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.115 కోట్లు కేటాయించింది.
ఆలయాలకు రూ.200 కోట్లు
ప్రముఖ ఆలయాలకు గతేడాది తరహాలోనే కేటాయింపులను కొనసాగించింది. తాజాగా బడ్జెట్‌లో యాదగిరిగుట్ట ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు, వేములవాడ ఆలయాభివృద్ధికి మరో రూ.100 కోట్లు కేటాయించింది.
అభివృద్ధి పనులకు రుణాలు
హైదరాబాద్ జలమండలి, హెచ్‌ఎండీఏ, మెట్రో రైలు సంస్థలకు బడ్జెట్లో భారీ ఎత్తున పెట్టుబడి రుణాలను కేటాయించింది. రుణాల చెల్లింపునకు హైదరాబాద్ జల మండలికి రూ.1,420.50 కోట్లు కేటాయించగా, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం కేటాయించింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.250 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణ సహాయం కింద హెచ్‌ఎండీఏకు ఇవ్వనుంది. పురపాలికలు, కార్పొరేషన్లకు మరో రూ.192 కోట్ల రుణాలను కేటాయించింది.