city development
-
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్
చార్మినార్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా రద్దయిన ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమం ఈ నెల 21 (నేటి) నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌పై సండే ఫన్ డే ప్రారంభమైంది. ఈ ఆదివారంతో ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని కులీకుతుబ్‌షా నగరాభివృద్ది సంస్థ కార్యదర్శి తెలిపారు. స్టాల్స్‌తో పాటు ఇతర వ్యాపార సంస్థల స్టాల్స్ కొనసాగిస్తామని.. వినోదాత్మక కార్యక్రమాలు ప్రస్తుతానికి ఉండవని ఆయన తెలిపారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. శనివారం పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా మారాయి. చార్మినార్ కట్టడంతో పాటు హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియం, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాలలో సందర్శకుల సందడి కనిపించింది. (చదవండి: ప్రీలాంచ్ మాయ ) -
21వ శతాబ్దపు నగరాలు నిర్మిద్దాం
ముంబై/ఔరంగాబాద్: 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో భారతీయ నగరాల్లో భద్రత, అనుసంధానత, ఉత్పాదకత విషయంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. లేదంటే రాబోయే ఐదేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పగటి కలలాగే మిగిలిపోతుందని హెచ్చరించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోదీ, ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సమగ్రాభివృద్ధిపై దృష్టి.. ‘గత ఐదేళ్లకాలంలో ముంబై నగరంలో మౌలిక ప్రాజెక్టులపై మేం రూ.1.5 లక్షల కోట్లను వెచ్చించాం. కేవలం ముంబైనే కాకుండా దేశంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మనం సొంతంగా మెట్రో రైలు కోచ్‌లను రూపొందిస్తున్నాం. మౌలికవసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. చిన్న పట్టణాల్లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుల కారణంగా ఎక్కువమందికి జీవనోపాధి దొరుకుతోంది. గతంలో ఇంతవేగంగా ప్రాజెక్టు నిర్మాణం ఎన్నడూ జరగలేదు కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు’ అని మోదీ వెల్లడించారు. ముంబై మెట్రో కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏటా 2.5 కోట్ల టన్నులమేర తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ‘ఒకేదేశం–ఒకే కార్డు’ వ్యవస్థ కోసం ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థ తయారుచేసిన 500 మెట్రో కోచ్‌లను ప్రధాని ఆవిష్కరించారు. గణేశ్ ఆలయంలో పూజలు అంతకుముందు ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా విలే పార్లేలోని గణేశ్ ఆలయానికి చేరుకున్న మోదీ, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లోక్మాన్య సేవాసంఘ్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఇంటికి తాగునీరు అందించేందుకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నాం. మహిళలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్న రామ్మనోహర్ లోహియా కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముద్రా పథకం కింద ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.లక్ష చొప్పున రుణాలు ఇస్తున్నాం’’ అని మోదీ తెలిపారు. ముద్రా పథకం కింద ఇప్పటివరకూ 14 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు. -
పట్టణాభివృద్ధికి చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో పాత పంథానే కొనసాగించింది. హైదరాబాద్ విషయానికి వస్తే మాసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్లు, నగర రోడ్ల అభివృద్ధికి మరో రూ.377.35 కోట్లను కేటాయించింది. అలాగే రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.426.41 కోట్లు కేటాయించగా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా పురపాలికలకు సహాయక నిధి పద్దు కింద రూ.117.23 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రయోజిత పథకాలైన స్మార్ట్ సిటీకి రూ.150.94 కోట్లు, అమృత్‌కు మరో రూ.203.96 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.115 కోట్లు కేటాయించింది. ఆలయాలకు రూ.200 కోట్లు ప్రముఖ ఆలయాలకు గతేడాది తరహాలోనే కేటాయింపులను కొనసాగించింది. తాజాగా బడ్జెట్లో యాదగిరిగుట్ట ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు, వేములవాడ ఆలయాభివృద్ధికి మరో రూ.100 కోట్లు కేటాయించింది. అభివృద్ధి పనులకు రుణాలు హైదరాబాద్ జలమండలి, హెచ్ఎండీఏ, మెట్రో రైలు సంస్థలకు బడ్జెట్లో భారీ ఎత్తున పెట్టుబడి రుణాలను కేటాయించింది. రుణాల చెల్లింపునకు హైదరాబాద్ జల మండలికి రూ.1,420.50 కోట్లు కేటాయించగా, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం కేటాయించింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.250 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణ సహాయం కింద హెచ్ఎండీఏకు ఇవ్వనుంది. పురపాలికలు, కార్పొరేషన్లకు మరో రూ.192 కోట్ల రుణాలను కేటాయించింది. -
సిటీపై చెరగని గుర్తు ‘సీతయ్య గుప్తా’
అడుగుజాడ మహానగరం అభివద్ధికి బాటలు వేసిన ప్రముఖులు ఎందరో. హైదరాబాద్ చరిత్రలో వారి ప్రస్థానం మరువరానిది. ఆ పుర ప్రముఖుల గురించి ఈతరం తెలుసుకోవాలి. వారిలో ఒకరు ‘కొత్తూరు సీతయ్య గుప్తా’. అందరికీ ఆప్తుడిగా, సామాజిక సేవకుడిగా తనదైన ముద్ర వేశారు. సిటీబ్యూరో: రాజకీయ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన సీతయ్య గుప్తా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు. రాజకీయ, సేవా రంగాల్లో సేవలు విస్తరించారు. ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన స్వాతంత్రోద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. హైదరాబాద్ సంస్థాన విముక్తి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇదీ నేపథ్యం.. రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలో 1911 ఆగస్టు 10న సీతయ్య గుప్తా జన్మించారు. తల్లిదండ్రులు అన్నమ్మ, శ్రీరామన్న. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా ఆయన పైనే పడింది. ఆముదం మిల్లులో, బట్టల దుకాణంలో పనిచేశారు. 16వ ఏట హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారంపై పట్టు సాధించారు. మాడపాటి హనుమంతరావుతో కలిసి ఉస్మాన్‌గంజ్ ధర్మశాల నిర్మాణానికి కృషి చేశారు. 1938 ఏప్రిల్ 16న ధూల్‌పేటలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆర్య సమాజ్ సత్యాగ్రహ’ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. గుప్తా క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న రోజుల్లో ప్రభుత్వం ఆర్యసమాజ్‌పై ఆంక్షలు, కార్యకర్తలపై నిర్బంధం విధించింది. దత్తాత్రేయ పహాడ్ పైన తలదాచుకున్న కార్యకర్తలకు భోజనం, ఇతర సదుపాయాలు సమకూర్చే బాధ్యతను గుప్తా స్వీకరించారు. రాజకీయ ప్రస్థానం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో మొదటి నుంచి అతివాద, మితవాద గ్రూపులుండేవి. ప్రగతిశీల అతివాద వర్గానికి నేతృత్వం వహించిన స్వామి రామానందతీర్థ బాటలోనే గుప్తా నడిచారు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత సీఎం ఎన్నిక సమయంలో నాయకత్వ సమస్య వచ్చినప్పుడు గుప్తా నీలం సంజీవరెడ్డి వైపు నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. బేగంబజార్ నియోజకవర్గంలో బలమైన స్థానం ఉన్నప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు 1957 సాధారణ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. రెండోసారి 1962 ఎన్నిక ల్లో బేగంబజార్ నుంచి విజయం సాధించారు. విద్యారంగ సేవలు గుప్తా జీవితంలో విద్యారంగ అభివృద్ధికి ఇతోధిక సేవలు అందించారు. మహిళల కోసం 1943లో సావిత్రి కన్య పాఠశాలను ప్రారంభించారు. కేశవ స్మారక హిందీ విద్యాలయం పేరుతో వినాయకరావు విద్యాలంకార్ స్థాపించిన విద్యాసంస్థలో ఆయన వ్యవస్థాపక సభ్యులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్, ఆంధ్ర విద్యాలయం కళాశాల, వాసవీ ఫౌండేషన్, భారతీయ విద్యాభవన్ తదితర విద్యాసంస్థల ఏర్పాటులో సీతయ్య చొరవ ఉంది. ఆర్య వైశ్యుల అభ్యున్నతికి వాసవి సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఇవి సేవలందిస్తున్నాయి. 1939 జులై 5న కేవలం ఏడుగురు విద్యార్థులతో పీల్ఖానాలో వైశ్య హాస్టల్ ప్రారంభించారు. 1950లో కాచిగూడలో 250 మంది విద్యార్థులకు వసతి భవనం కట్టించారు. 1963లో వైశ్య హాస్టల్ ట్రస్టును స్థాపించారు. నగరంలో ఎనలేని సేవలందించిన సీతయ్య గుప్తా 1997లో కన్నుమూశారు. -
స్మార్ట్ సిటీగా నెల్లూరు
మంత్రి నారాయణ నెల్లూరు (దర్గామిట్ట): కేంద్రపట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో నెల్లూరును స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయనున్నట్టు రాష్ట్రపురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులందరికీ పింఛన్లు అందించాలన్నదే టీడీపీ లక్ష్యమన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డుల జారీలో అక్రమాలను నివారించేందుకు ఆధార్‌ను అనుసంధానం చేసినట్టు ఆయన తెలిపారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్‌ను రూ.200 నుంచి రూ.1000కి పెంచుతున్నామన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.16 వేల కోట్ల లోటులో ఉన్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు సకాలంలో పనులు చేసేందుకు 7 మిషన్లు, 5 గ్రిడ్స్‌ను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఒక్కో జిల్లాలో ఒక్కోరకమైన వనరులు అపారంగా ఉన్నాయన్నారు. వాటిని వినియోగించి అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన వనరులను సమకూర్చి అభివృద్ధి చేయనున్నట్టు ఆయన తెలిపారు. అర్హులైన వారికి పింఛన్లు అందకుంటే స్పెషల్ కేసుల కింద పరిగణించి సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.రామకృష్ణ, పోలంరెడి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, పరసా వెంకటరత్నం, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు, తాళ్లపాక అనూరాధ, సీనయర్ నాయకులు బెజవాడ ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.