స్వదేశీ తయారీ మెట్రో కోచ్‌లను పరిశీలిస్తున్న మోదీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్, సీఎం ఫడ్నవీస్
ముంబై/ఔరంగాబాద్: 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో భారతీయ నగరాల్లో భద్రత, అనుసంధానత, ఉత్పాదకత విషయంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. లేదంటే రాబోయే ఐదేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పగటి కలలాగే మిగిలిపోతుందని హెచ్చరించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోదీ, ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
సమగ్రాభివృద్ధిపై దృష్టి..
‘గత ఐదేళ్లకాలంలో ముంబై నగరంలో మౌలిక ప్రాజెక్టులపై మేం రూ.1.5 లక్షల కోట్లను వెచ్చించాం. కేవలం ముంబైనే కాకుండా దేశంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మనం సొంతంగా మెట్రో రైలు కోచ్‌లను రూపొందిస్తున్నాం. మౌలికవసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. చిన్న పట్టణాల్లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుల కారణంగా ఎక్కువమందికి జీవనోపాధి దొరుకుతోంది.
గతంలో ఇంతవేగంగా ప్రాజెక్టు నిర్మాణం ఎన్నడూ జరగలేదు కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు’ అని మోదీ వెల్లడించారు. ముంబై మెట్రో కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏటా 2.5 కోట్ల టన్నులమేర తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ‘ఒకేదేశం–ఒకే కార్డు’ వ్యవస్థ కోసం ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థ తయారుచేసిన 500 మెట్రో కోచ్‌లను ప్రధాని ఆవిష్కరించారు.
గణేశ్ ఆలయంలో పూజలు
అంతకుముందు ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా విలే పార్లేలోని గణేశ్ ఆలయానికి చేరుకున్న మోదీ, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లోక్‌మాన్య సేవాసంఘ్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఇంటికి తాగునీరు అందించేందుకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నాం.
మహిళలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్న రామ్‌మనోహర్ లోహియా కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముద్రా పథకం కింద ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.లక్ష చొప్పున రుణాలు ఇస్తున్నాం’’ అని మోదీ తెలిపారు. ముద్రా పథకం కింద ఇప్పటివరకూ 14 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment