సిటీపై చెరగని గుర్తు ‘సీతయ్య గుప్తా’
అడుగుజాడ
మహానగరం అభివద్ధికి బాటలు వేసిన ప్రముఖులు ఎందరో. హైదరాబాద్ చరిత్రలో వారి ప్రస్థానం మరువరానిది. ఆ పుర ప్రముఖుల గురించి ఈతరం తెలుసుకోవాలి. వారిలో ఒకరు ‘కొత్తూరు సీతయ్య గుప్తా’. అందరికీ ఆప్తుడిగా, సామాజిక సేవకుడిగా తనదైన ముద్ర వేశారు.
సిటీబ్యూరో: రాజకీయ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన సీతయ్య గుప్తా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు. రాజకీయ, సేవా రంగాల్లో సేవలు విస్తరించారు. ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన స్వాతంత్రోద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. హైదరాబాద్ సంస్థాన విముక్తి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.
ఇదీ నేపథ్యం..
రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలో 1911 ఆగస్టు 10న సీతయ్య గుప్తా జన్మించారు. తల్లిదండ్రులు అన్నమ్మ, శ్రీరామన్న. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా ఆయన పైనే పడింది. ఆముదం మిల్లులో, బట్టల దుకాణంలో పనిచేశారు. 16వ ఏట హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారంపై పట్టు సాధించారు. మాడపాటి హనుమంతరావుతో కలిసి ఉస్మాన్‌గంజ్ ధర్మశాల నిర్మాణానికి కృషి చేశారు. 1938 ఏప్రిల్ 16న ధూల్‌పేటలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆర్య సమాజ్ సత్యాగ్రహ’ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. గుప్తా క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న రోజుల్లో ప్రభుత్వం ఆర్యసమాజ్‌పై ఆంక్షలు, కార్యకర్తలపై నిర్బంధం విధించింది. దత్తాత్రేయ పహాడ్ పైన తలదాచుకున్న కార్యకర్తలకు భోజనం, ఇతర సదుపాయాలు సమకూర్చే బాధ్యతను గుప్తా స్వీకరించారు.
రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో మొదటి నుంచి అతివాద, మితవాద గ్రూపులుండేవి. ప్రగతిశీల అతివాద వర్గానికి నేతృత్వం వహించిన స్వామి రామానందతీర్థ బాటలోనే గుప్తా నడిచారు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత సీఎం ఎన్నిక సమయంలో నాయకత్వ సమస్య వచ్చినప్పుడు గుప్తా నీలం సంజీవరెడ్డి వైపు నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. బేగంబజార్ నియోజకవర్గంలో బలమైన స్థానం ఉన్నప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు 1957 సాధారణ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. రెండోసారి 1962 ఎన్నిక ల్లో బేగంబజార్ నుంచి విజయం సాధించారు.
విద్యారంగ సేవలు
గుప్తా జీవితంలో విద్యారంగ అభివృద్ధికి ఇతోధిక సేవలు అందించారు. మహిళల కోసం 1943లో సావిత్రి కన్య పాఠశాలను ప్రారంభించారు. కేశవ స్మారక హిందీ విద్యాలయం పేరుతో వినాయకరావు విద్యాలంకార్ స్థాపించిన విద్యాసంస్థలో ఆయన వ్యవస్థాపక సభ్యులు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్, ఆంధ్ర విద్యాలయం కళాశాల, వాసవీ ఫౌండేషన్, భారతీయ విద్యాభవన్ తదితర విద్యాసంస్థల ఏర్పాటులో సీతయ్య చొరవ ఉంది. ఆర్య వైశ్యుల అభ్యున్నతికి వాసవి సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఇవి సేవలందిస్తున్నాయి. 1939 జులై 5న కేవలం ఏడుగురు విద్యార్థులతో పీల్‌ఖానాలో వైశ్య హాస్టల్ ప్రారంభించారు. 1950లో కాచిగూడలో 250 మంది విద్యార్థులకు వసతి భవనం కట్టించారు. 1963లో వైశ్య హాస్టల్ ట్రస్టును స్థాపించారు. నగరంలో ఎనలేని సేవలందించిన సీతయ్య గుప్తా 1997లో కన్నుమూశారు.